అంత్యక్రియలకు అరటిబోదెలే సాయం..
జి.పెదపూడి(పి.గన్నవరం): ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం నలుగురి సాయం కావాలంటారు. అయితే ఆ గ్రామంలో ఆ నలుగురితో పాటు అరటిబోదెల సాయం కూడా అవసరమే. ఎందుకంటే వాటి సాయం లేకుండా శవాన్ని శ్మశానానికి తరలించడం సాధ్యం కాదు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి శివారు ఉచ్చులవారిపేట వద్ద ప్రధాన పంట కాలువపై ఏడేళ్ల క్రితం చేపట్టిన వంతెన నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు.
దీంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే.. అరటి బోదెలతో తెప్పలు ఏర్పాటు చేసి, దానిపై పాడె లేదా శవపేటికను ఉంచి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కాలువలో ఈదుతూ మృతదేహాన్ని అవతలి ఒడ్డుకు చేర్చాల్సి వస్తోంది. ఆ సమయంలో పలువురు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. కాగా, ఆదివారం ఉచ్చులవారిపేటకు చెందిన గిడ్డి పల్లాలమ్మ(70) మరణించింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఎప్పటిలాగే అరటి బోదెల సహాయంతో కాలువ దాటించి అంత్యక్రియలు నిర్వహించారు.