Bridge Construction
-
బిహార్‌లో కూలిన మూడో వంతెన
మోతీహారి: బిహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు కూలిపోగా, తాజాగా ఆదివారం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహారిలోని ఘోరాసహన్ బ్లాక్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన మరొకటి కూలిపోయింది. కాలువపై నిర్మిస్తున్న ఈ వంతెన అమ్వా గ్రామాన్ని బ్లాక్‌లోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. 16 మీటర్ల పొడవైన వంతెనను రూరల్ వర్క్స్ విభాగం రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించామని, అయితే కారణాలేమీ తెలియ రాలేదని ప్రభుత్వ అదనపు కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ తెలిపారు. -
‘బైరామల్ గూడ’ ఫ్లై ఓవర్‌తో.. రయ్ రయ్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్ రింగ్‌రోడ్, బైరామల్‌గూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, అది వెలువడేలోగా దాదాపు వారం రోజుల్లో ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం మేరకు ఈ నెల 8న ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపుల నుంచి విజయవాడ(చింతలకుంట వైపు), నాగార్జునసాగర్ (బీఎన్ రెడ్డి నగర్ వైపు)ల వైపు ఈ ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ జంజాటం లేకుండా వెళ్లవచ్చు. ఈ ఫ్లై ఓవర్లతోపాటు రెండు లూప్‌లు కూడా అందుబాటులోకి వస్తే ఎడమవైపు లూప్ నుంచి నాగార్జునసాగర్, చింతలకుంట వైపుల నుంచి ఎల్బీనగర్, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లే వారికి సదుపాయం కలుగుతుంది. అలాగే కుడివైపు లూప్ అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్ నుంచి కర్మాన్‌ఘాట్, ఐఎస్ సదన్ల వైపు వెళ్లే వారికి సౌలభ్యంగా ఉంటుంది. తద్వారా ప్రయాణ సమయం కలిసి రావడంతోపాటు వాహనదారులకు ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ ప్యానెల్స్ వంటి వాటికి ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించారు. ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే నగరంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగించడం తెలిసిందే. బైరామల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఇలా.. నిర్మాణ వ్యయం: రూ.148.05 కోట్లు, పొడవు: 1.78 కి.మీ, వెడల్పు ఓవైసీ వైపు (ర్యాంప్1): 12 మీటర్లు, 3లేన్. నాగార్జునసాగర్ వైపు(ర్యాంప్2): 8.5మీటర్లు, 2 లేన్. చింతల్‌కుంట వైపు(ర్యాంప్3): 8.5 మీటర్లు, 2 లేన్. ప్రయాణ మార్గం.. ఒకవైపు సిద్ధమైన బైరామల్‌గూడ ఫ్లైఓవర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద మొదటి, రెండవ లెవెల్ ఫ్లై ఓవర్లు, లూప్స్ వినియోగంలోకి వస్తే బైరామల్‌గూడ జంక్షన్‌వద్ద 95 శాతం, నాగార్జునసాగర్ రింగ్‌రోడ్ వద్ద 43 శాతం ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
తండ్రి అంతిమ సంస్కారాలకు అయ్యే ఖర్చుతో.. బ్రిడ్జ్ నిర్మాణం..
మన చుట్టూ నిత్యం ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు స్తంబాలని ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ నాయకులనో తిట్టుకుంటూ కూర్చొంటారు. కొంతమంది కాస్త ముందడుగు వేసి ప్రభుత్వానికి తెలియజేసేలా చేయడం వంటివి చేస్తారు. ఆ తర్వాత షరామాములే! ఆ పని ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులు. కానీ ఇక్కడొక వ్యక్తి అన్ని రకాలుగా యత్నించి అవ్వకపోయినా వెనుదిరగక..వ్యక్తిగత ప్రయత్నంతో తమ ఊరికి ఎదురైన సమస్యకు చెక్‌పెట్టి శభాష్ అనిపించుకున్నాడు సుధీర్ ఝా. తండ్రి అంత్యక్రియలకు అయ్యే ఖర్చును ప్రజల మేలు కోసం ఉపయోగించి ఆ సమస్యను చాలా చక్కగా పరిష్కరించాడు. వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని మధుబని జిల్లా కలువహి మండలంలోని నారార్ పంచాయతీ నుంచి ఓ కాలువ వెళ్తుంది. ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలంటే.. ఆ కాలువను దాటే వెళ్లాలి. వర్షాకాలంలో కాలువ ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో గ్రామస్తులు ఊరి దాటి బయటకు వెళ్లేందుకు భయపడుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఆపద వచ్చినా అంతే పరిస్థితి. అక్కడ బ్రిడ్జి వస్తే వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వర్షాకాలంలో సైతం ఎలాంటి ఇబ్బందులు పడకుండా హాయిగా ఉండొచ్చు. కానీ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వంతెన మంజూరు కాలేదు. దీంతో పెద్దాయన మహదేవ్ ఝూ తమ గ్రామ పరిస్థితిని చూసి చలించిపోయి ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అయినా ఎటువంటి ఫలితం దక్కలేదు. ఆ ఊరికి ఎలాగైనా వంతెనను నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు మహాదేవ్. జీవిత చరమాంకంలో ఉన్న ఆయనకు తనవల్ల ఇది సాధ్యం కాదని తెలుసు. తన సంకల్పం ఎలగైనా నెరవేరాలి. తన ఊరికి మంచి జరగాలి ఇదే ఆ పెద్దాయన ఆశయం. దీంతో మహదేవ్ .. "ఒకవేళ నేను చనిపోతే.. నా అంత్యక్రియలకు, దశదినకర్మలకు అయ్యే ఖర్చుతో బ్రిడ్జిని నిర్మించాలి" అని కుటుంబ సభ్యులను కోరాడు. అది తన కల .. చివరి కోరిక అని వారికి చెప్పాడు. మహాదేవ్ అ్నట్లుగానే కొన్నాళ్లకు అనారోగ్య సమస్యలతో 2020లో మహదేవ్ ఝా మరణించాడు. కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యం.. అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన మహదేవ్ ఝూ అతడి భార్య మహేశ్వరి దేవి, కుమారుడు విజరుప్రకాష్ ఝా అలియాస్ సుధీర్ ఝాకు బాగా తెలుసు. ఆ డబ్బుతో గ్రామంలో ఉన్న కాల్వపై వంతెనను నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి, కాల్వపై వంతెనను నిర్మించారు. అయితే కరోనా కారణంగా వంతెన నిర్మాణంలో రెండేళ్లు ఆలస్యం అయ్యింది. అయినా లెక్కచేయక దీక్షతో ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి..ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కలను సాకారం చేశారు. తమ సమస్య తీరడంతో గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వంతెన ద్వారా దాదాపు రెండు వేల మంది గ్రామస్తులు తేలికగా గ్రామం ఇటువైపు నుంచి అటువైపుకు రాకపోకలు చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు జరిగిందని మహదేవ్ ఝా సోదరుడు మహవీర్ ఝా తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి తిడుతూ కూర్చొకుండా..వ్యక్తిగత ప్రయత్నాలతో కూడా సమస్యను పరిష్కరించవచ్చని మహదేవ్ ఝా, అతడి కుటుంబ సభ్యులు నిరూపించారు. ఒక ఉపాధ్యాయుడిగా మహదేవ్ ఈ సమాజానికి ఓ గొప్ప పాఠాన్ని నేర్పారు. (చదవండి: ఈ కాలు నాదే..ఆ కాలు నాదే అని కాలుపై కాలు వేసుకుని కూర్చొన్నారో.. అంతే సంగతి!) -
హుస్సేన్‌సాగర్.. వేలాడే వంతెన ఏది?
సాక్షి, హైదరాబాద్: వేలాడే వంతెన పనులు వెక్కిరిస్తున్నాయి. మూడేళ్ల క్రితం హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం నెలకొంది. రష్యా రాజధాని మాస్కోలోని మోస్క్వా నదిపై ‘యు’ ఆకారంలో నిర్మించిన తరహాలో పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా హుస్సేన్‌సాగర్‌లో వేలాడే వంతెనను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఇది ఓ కొలిక్కి రాలేదు. మొదట్లో కొత్త సంవత్సరంలో ఈ వంతెనను అందుబాటులోకి తేవాలని భావించారు. కానీ మరో ఏడాది గడిచినా ఈ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు నత్తనడకన సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలలపై నడక.. - పీవీ ఘాట్‌కు, పీపుల్స్ ప్లాజాకు మధ్యలో ఉన్న స్థలంలో ఎకో పార్కు (లేక్‌వ్యూ)ను అభివృద్ధి చేసి ఇందులోంచి వంతెన మీదుగా సాగర్‌లోకి నడిచే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పారదర్శకమైన గాజు ఫలకలతో దీన్ని రూపొందించడం వల్ల హుస్సేన్‌సాగర్ అలలపై నడు స్తున్న అనుభూతి కలుగుతుంది. ఒకవైపు లుంబినీ పార్కు, మరోవైపు ఎన్టీఆర్ గార్డెన్తో పాటు హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు కోసం ప్రతి రోజు వేలాది మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. శని, ఆదివారాలు, సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. - ఇలా వచ్చేవారు ఎకో పార్కుతో పాటు, వేలాడే వంతెనను కూడా సందర్శిస్తారనే ఉద్దేశంతో దీన్ని చేపట్టారు. ఈ వంతెన పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతిని కలుగజేస్తుంది. మరోవైపు ఇటీవల ఇండియన్ రేసింగ్ లీగ్‌తో నెక్లెస్ రోడ్డు ప్రాధాన్యం మరింత పెరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా– ఈ రేస్ దృష్ట్యా అప్పటి వరకు పూర్తి చేసే విధంగా అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారక స్తూపం, సెక్రటేరియట్ నిర్మాణ పనులు చకచకా కొనసాగుతుండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వంతెన పనుల్లో జాప్యం నెలకొనడం గమనార్హం. రూ.25 కోట్లకు చేరిన భారం.. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు రూ.10 కోట్లతో అంచనాలు రూపొందించారు. కానీ నిర్మాణంలో తీవ్రమైన ఆలస్యం కారణంగా ఇప్పుడు ఏకంగా రూ.25 కోట్లకు చేరినట్లు తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో వెచి్చంచినా పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయనే విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడం గమనార్హం. -
గోదావరిపై కొత్త వంతెనలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు జాతీయ రహదారులపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతకుముందు రెండు వరుస సంవత్సరాలు భారీవర్షాలు, పోటెత్తిన వరదలను తట్టుకున్నా, తాజా వరదల తాకిడికి మాత్రం తాళలేకపోయాయి. ఇప్పటికిప్పుడు వాటి పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.38 కోట్లు కావాలంటూ జాతీయ రహదారుల విభాగం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల విభాగానికి ప్రతిపాదించింది. అవి వచ్చే వరకు అధికారులు మట్టికట్టతో రోడ్లను పునరుద్ధరించారు. పెండింగ్‌లో ఉన్న కొత్త వంతెనల నిర్మాణం, పాత వంతెనల స్థాయి పెంపు ప్రతిపాదనలకు ఈసారైనా మోక్షం లభించవచ్చని భావిస్తున్నారు. ఇక్కడే కొత్త వంతెనకు ప్రతిపాదన..: రోడ్డును గోదావరి అడ్డంగా చీల్చి ముందుకు పోటెత్తిన నేపథ్యంలో ఇక్కడ వంద మీటర్ల పొడవుతో కొత్త వంతెనను జాతీయ రహదారుల విభాగం తాజాగా ప్రతిపాదించింది. ఇక్కడ దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన తాజా వరదకు తట్టుకోలేకపోయింది. వంతెనకు ఓ వైపు మట్టి కొట్టుకుపోయి ఇలా రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఇప్పుడు పాత వంతెన కంటే కనీసం మూడు, నాలుగు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల పొడవుతో కొత్త వంతెనను దాని పక్కనే నిర్మించాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. ఇదే రోడ్డు మీద తుపాకులగూడెం సమీపంలోని టేకులగూడెం వద్ద 125 మీటర్ల నుంచి 150 మీటర్ల పొడవుతో మరో వంతెనను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ కూడా గోదావరి ఎగిసి రోడ్డు మీదుగా వరద ప్రవహించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక్కడ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోనప్పటికీ, పక్కల భారీగా కోసుకుపోయింది. ఇక్కడ కూడా వెంటనే మట్టికట్ట వేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రసుతం ఆ తాత్కాలిక రోడ్డు మీదుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. పస్రా– తాడ్వాయి ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మెటల్, మట్టి, ఇసుక బస్తాలతో ఇదిగో ఇలా తాత్కాలికంగా పునరుద్ధరించారు. ఆ తర్వాత భారీవర్షం, వరద వచ్చినా ఇది నిలబడింది. ఇంకోసారి వరద వస్తే మాత్రం ఇది తట్టుకునే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఈలోపు దీన్ని మరింత పటిష్టంగా పునరుద్ధరించాల్సి ఉంది. ఇది నిర్మల్–ఖానాపూర్ మధ్య ఉన్న దిమ్మతుర్తి గ్రామం వద్ద జాతీయ రహదారి. ఇక్కడ అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం వల్ల రోడ్డు విస్తరణ పనుల్లో దాదాపు రెండేళ్ల ఆలస్యం జరిగింది. అందు వల్లే ఇక్కడ ఆరు చిన్న వంతెనల నిర్మాణమూ జాప్యమైంది. అలా పూర్తికాని దిమ్మతుర్తి సమీపంలోని వంతెన వద్ద రోడ్డు ఇలా కొట్టుకుపోయి ట్రాఫిక్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. దీంతో తాత్కాలికంగా ఆ మళ్లింపు రోడ్డును పునరుద్ధరించి వాహనాలు నడిపారు. -
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
ముషీరాబాద్: నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తో వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీఎస్టీ రోడ్డులోని నాగమయ్యకుంట వద్ద, నల్లకుంట కూరగాయల మార్కెట్ రోడ్డులో హెరిటేజ్ బిల్డింగ్ వద్ద రూ.12 కోట్ల వ్యయంతో బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రెండు బ్రిడ్జిల నిర్మాణ పనులను హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్ సి.సునిత ప్రకాష్‌గౌడ్‌లతో కలిసి మంత్రి తలసాని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా వర్షాకాలంలో నాగమయ్యకుంట, సాయిచరణ్ కాలనీ, పద్మాకాలనీ, అచ్చయ్యనగర్ తదితర కాలనీలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. సమస్యకు ప్రధాన కారణమైన ఇరుకు బ్రిడ్జిలను తొలగించి ఆ స్థానంలో విశాలమైన బ్రిడ్జిలు నిరి్మస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 8వేల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందన్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూ.6వేల 700 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జితో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. హుస్సేన్‌సాగర్ నుంచి అంబర్‌పేట మీదుగా మూసీ వరకు ఉన్న హుస్సేన్‌సాగర్ నాలాకు 2020లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని మంత్రి తలసాని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిరి్మంచడానికి పూనుకున్నట్లు తెలిపారు. ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు రూ.426 కోట్లతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సీఈ కిషన్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎంసీ హరికృష్ణ, వాటర్ వర్క్స్ జీఎం సుబ్బారాయుడు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు, ముఠా జైసింహా, మాజీ కార్పొరేటర్ బి.హేమలత, బి.శ్రీనివాస్‌రెడ్డి, కె.మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జి పనులను ప్రారంభిస్తున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ సునీత తదితరులు -
పాకాల ఏటిపై వంతెన నిర్మించాలి
గార: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధి పాకాల ఏటిపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ కాన్వాయ్‌లను మండల అఖిలపక్షం నాయకులు ఆదివారం గార్లచెక్ డ్యాం వద్ద అడ్డుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వంతెన నిర్మాణం హామీ నెరవేర్చాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అఖిలపక్ష నాయకులతో చర్చలు జరిపారు. వంతెన నిర్మాణానికి రూ.24 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, త్వరలో నిధులు విడుదల కాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. అయినా వారు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. -
వంతెన నిర్మాణం చేపట్టండి.. ఏడు గ్రామాల ప్రజల విజ్ఞప్తి
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో కనిమెల సమితి, చింతాలవడా గ్రామపంచాయితీలోని చింతాలవాడ వంతెన నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ పదయమాడి అధికారులను కోరారు. ఏడేళ్లుగా ఇక్కడి సగం విరిగిపోయిన వంతెన మీదుగా ప్రమాదకరమైన ప్రయాణాలు సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో వంతెన విరిగిపోయిన భాగాలు నీటిలో ఎక్కడున్నాయో తెలియకపోవడంతో ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారని వాపోయారు. ఇదే మార్గం గుండా సిందిగుఢ, కోపలకొండ, పేడకొండ, పులిమెట్ల, తటిగుఢ, ఎంవీ–13, గుముక, మందపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి, వంతెన పునర్నిర్మాణానికి సహకరించాలని ఆమె కోరారు. -
మరో రెండు.. కొత్త ఫ్లైఓవర్లు
సాక్షి, సిటీబ్యూరో: సినిమా హాళ్ల జంక్షన్‌గా ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దానికి కొద్ది దూరంలోని వీఎస్టీ జంక్షన్, రాంనగర్, బాగ్‌లింగంపల్లిలలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రెండు స్టీల్‌బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో, ఫస్ట్ లేన్‌గా నిర్మించే నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం రూ.350 కోట్లు. రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు దాదాపు కిలోమీటరు పొడవున సెకండ్ లెవెల్లో రెండో దశలో నిర్మించే ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.76 కోట్లు. ఈ రెండింటికీ కలిపి మొత్తం రూ.426 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ నెల 11న శంకుస్థాపనచేయనున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. స్టీల్ బ్రిడ్జిల వివరాలు.. ♦ ఇందిరాపార్కు– వీఎస్టీ ఎలివేటెడ్ కారిడార్ ♦ ఇందిరాపార్కు నుంచి ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ(ఆజామాబాద్) వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ఇది. పొడవు: 2.6 కి.మీ. లేన్లు : 4 (16.60 మీటర్లు), రెండు వైపులా ప్రయాణం. వ్యయం : రూ.350 కోట్లు డిజైన్ స్పీడ్ : 40 కేఎంపీహెచ్ పనులకు పట్టే సమయం: 2 సంవత్సరాలు. ప్రయోజనాలు: ♦ ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ జంక్షన్ వరకు ట్రాఫిక్ చిక్కులుండవు. ♦ ప్రయాణ సమయం తగ్గుతుంది. ♦ హిందీ మహా విద్యాలయ, ఉస్మానియా యూనివర్సిటీల వైపు ట్రాఫిక్ సమస్య తొలగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. ♦ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ జంక్షన్లో ట్రాఫిక్‌కు ఉపశమనం కలుగుతుంది. ♦ ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బాగ్‌లింగంపల్లిల వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు తొలగుతాయి. రాంనగర్– బాగ్‌లింగంపల్లి ఫ్లైఓవర్ ♦ సెకండ్ లెవెల్లో నిర్మించే ఫ్లైఓవర్ ఇది. రాంనగర్ నుంచి వయా వీఎస్టీ మీదుగా బాగ్‌లింగంపల్లి వరకు. పొడవు: 0.850 కి.మీ. లేన్లు: 3 లేన్లు (16.60 మీ), రెండు వైపులా ప్రయాణం వ్యయం: రూ.76 కోట్లు డిజైన్ స్పీడ్: 30 కేఎంపీహెచ్ పనుల పూర్తి: 2 సంవత్సరాలు. ప్రయోజనాలు: ♦ రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు ట్రాఫిక్ రద్దీ సమస్య తొలగి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా మారుతుంది. ♦ బాగ్‌లింగంపల్లి, వీఎస్టీల వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ♦ వాహనదారుల సమయం ఆదా అవుతుంది. వాహనదారులకుఎంతో సదుపాయం ఇందిరాపార్కు– వీఎస్టీ ఎలివేటెడ్ కారిడార్‌ను మొదటి దశలో, రాంనగర్– బాగ్‌లింగంపల్లి ఫ్లై ఓవర్‌ను రెండో దశలో నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండూ అందుబాటులోకి వస్తే దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి సచివాలయం, లక్డికాపూల్‌ల మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి రాకపోకలకు ఎంతో సదుపాయంగా ఉంటుందని అధికారులు తెలిపారు. -
రూ. కోటితో వంతెన నిర్మాణం.. ఇప్పటికైనా
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూసి మోసపోకుమా అన్నాడో ఓ కవి. ఆ మాటలను అక్షరాలా నిజం చేసి చూపించారు అసోంలోని కమ్రప్ జిల్లా వాసులు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా... డబ్బు పోగేసుకుని స్వయంగా వంతెన నిర్మించుకున్నారు. ఐకమత్యంతో కష్టాల కడలిని ఎదురీది అందరికీ ఆదర్శంగా నిలిచారు. భారత్‌లో వరదల ప్రభావానికి గురవుతున్న రాష్ట్రాల్లో అసోం కూడా ఒకటి. వర్షం పడిందంటే చాలు ఈ ఈశాన్య రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో 40 శాతం ప్రాంతం నీట మునుగుతుంది. ఇందులో కమ్రప్ జిల్లా కూడా ఒకటి. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాలను విడదీస్తున్న జల్‌జలీ నది వర్షాకాలంలో పొంగిపొర్లడంతో రాకపోకలు వీలుకాక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (‘కరోనా అన్ని వర్గాలను ఒక్కటిగా నిలిపింది’) స్కూలుకు వెళ్లాలన్నా.. ఆస్పత్రికి వెళ్లాలనే వారికి నాటు పడవలే గతి. దీంతో తమ సమస్యలను వివరిస్తూ నదిపై వంతెన నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. కానీ అధికారులు వీరి విజ్ఞప్తిని పెడచెవిన పెట్టడంతో.. విసిగి పోయి రూ. కోటితో చెక్క వంతెన నిర్మించుకున్నారు. కాగా పది గ్రామాల్లోని 7 వేల మంది ప్రజలు 335 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 2018లో ప్రారంభించిన వంతెన నిర్మాణం పూర్తికావడంతో ఇటీవలే దానిని ప్రారంభించారు. చెక్క వంతెనతో తమ కష్టాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయగలిగామని.. కాంక్రీట్ బ్రిడ్జి నిర్మిస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.(పైలట్ కోసం సిక్కుల ఔదార్యం) -
‘దేవాడ’కు రోడ్డేశారు
సాక్షి, నిజాంసాగర్: బాన్సువాడ– బిచ్కుంద ప్రధాన రహదారిపై ఉన్న దేవాడ వాగుపై అధికారులు తాత్కాలిక వంతెన నిర్మించారు. దీంతో ప్రజల రవాణా కష్టాలు తీరాయి. ఇటీవల కురిసిన వర్షాలకు దేవాడ వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో 15 రోజులకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గినా తాత్కాలిక వంతెన వేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై శుక్రవారం ‘తాత్కాలిక రోడ్డైనా వేయరూ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆదేశాలతో ఆర్అండ్బీ అధికారులు కదిలారు. వేగంగా తాత్కాలిక వంతెన పనులు పూర్తి చేయించారు. సాయంత్రమే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దారి కష్టాలు తీరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘ట్రాక్’లోకి వచ్చేదెలా.!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఔటర్ రింగ్ రోడ్డు విభాగం అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. ఓఆర్ఆర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ కొన్నేళ్లుగా సర్వీసు రోడ్ల పనులు నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాల అవస్థలు పడుతున్నారు. ఫలితంగా రెండు, మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. 2012లోనే ఓఆర్ఆర్తో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణాలన్నీ పూర్తి కావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈదుల నాగులపల్లి, శంషాబాద్, ఘట్కేసర్, మేడ్చల్ సమీపంలో ఓఆర్ఆర్ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉండటంతో నరకం చూస్తున్నారు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతిచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఇబ్బందులు అప్పటి కమిషనర్ జనార్దన్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అయినా పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. ఇబ్బందులు పడుతున్నాం.. పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నాం.–సిద్దూ, ఘట్కేసర్ వాసి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి మేడ్చల్ మండల పరిధిలో సుతారిగూడ నుంచి గౌడవెళ్ళి వరకు సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పాత జంక్షన్ సుతారిగూడ వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలిపెట్టారు. గౌడవెళ్ళి వద్ద రైల్వె ట్రాక్ ఉండటంతో అండర్‌పాస్ బ్రిడ్జి లేకపోవడంతో ఔటర్ ప్రయాణికులు గౌడవెళ్ళి మీదుగా మూడు కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ చౌరస్తా నుంచి దుండిగల్ వైపు వెళ్ళాల్సి వస్తోంది. సమస్యను రైల్వే అధికారులు, హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. –సురేందర్ ముదిరాజ్, గౌడవెళ్లి సర్పంచ్ నిలిచిన సర్వీస్ రోడ్డు పనులు శంషాబాద్: ఔటర్ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఈ దారి మధ్యలో ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను నిలిపివేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు రోడ్డులో శంషాబాద్ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్ సమీపంలో దారి మళ్లాల్సి వస్తుంది. చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం రెండు కిలోమీటర్ల దూరం వరకు సర్వీసు రోడ్డు పనులు నిలిచి పోవడంతో వాహదారులు హిమాయత్‌సాగర్ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండా వెళ్లాల్సి వస్తోంది. వయా యంనంపేట్ ఘట్కేసర్: కీసర నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పెద్దఅంబర్‌పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్ గ్రామం మీదుగా ఘట్కేసర్ బైపాస్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డుకు చేరుకోవాలి. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా మూడు కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసి వస్తోంది. 3.5 కి.మీ. నరకం మేడ్చల్: గౌడవెళ్లి రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో ఔటర్‌రింగు రోడ్డు సర్వీసు అసంపూర్తిగా ఉండటంతో సర్వీసు రోడ్డులో వెళుతున్న వాహనదారులు 3.5 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఘట్కేసర్ వైపు నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెళ్ళి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ సమీపం వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో వాహనదారులు సుతారిగూడ టోల్ ప్లాజా నుండి గౌడవెళ్ళి గ్రామం మీదుగా 3.5 కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లాల్సి వస్తుంది. పటాన్చెరు వైపు నుంచి వచ్చే వాహనదారుల ఇదే పరిస్థితి. పొలాలకు వెళ్లేందుకు దారి లేదు.. ఈదులనాగులపల్లి: రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదులనాగులపల్లి గ్రామ శివార్లలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదులనాగులపల్లి, వెలమల శివార్లలో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగులపల్లి రావాలంటే కిలోమీటర్ చుట్టు తిరిగి రావాల్సి వస్తోంది. -
అర్థిస్తే ఆలకించలేదు.. తానే రంగంలోకి దిగాడు..!
భువనేశ్వర్ : కియోజంర్ జిల్లాలోని సలంది నదిపై బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు దశాబ్దాలుగా మొరపెట్టుకున్నా స్పందించలేదు. ఇక జిల్లా యంత్రాంగం పని మొదలు పెట్టి.. మధ్యలోనే నిలిపేసింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తానే నడుం బిగించాడు. తన పీఎఫ్ డబ్బులను వెచ్చించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. అదిప్పుడు చివరి దశకు చేరుకుంది. రూ. 10 లక్షలు ఖర్చు చేసి బ్రిడ్జిని నిర్మాణాన్ని చేపట్టానని వెటర్నరీ విభాగంలో పనిచేసి రిటైర్డ్ అయిన గంగాధర్ రావత్ చెప్పుకొచ్చారు. మరో రెండు లక్షలు ఖర్చుచేసి జూలై చివరి వరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘వర్షా కాలం వస్తే చాలు హటాదిది బ్లాక్‌తో నది ఇవతల ఉన్న పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. స్థానికులు వెదురు బొంగులతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక వంతెనపైనుంచే నడక సాగించాలి. అది ప్రమాదకరం. కాంక్రీట్ బ్రిడ్జి నిర్మించాలని రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. పదేళ్ల క్రితం జిల్లా అధికారులు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. మధ్యలోనే నిలిపేశారు. స్థానికంగా కూడా ఎలాంటి స్పందనా లేదు. ఇక లాభం లేదనుకుని బ్రిడ్జిని పూర్తి చేయడానికి నేనే పూనుకున్నాను. నా కుటుంబం కూడా నాకు అండగా నిలిచింది. గత మార్చి నుంచి నిర్మాణ పనులు సాగుతున్నాయి. మరో నెలలో బ్రిడ్జిని పూర్తి చేస్తా’ అని పెద్దాయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఈ వార్తపై జిల్లా కలెక్టర్ ఆశిస్థాకర్ స్పందించారు. బ్రిడ్జి పనులను తాము చేపడతామని వెల్లడించారు. అయితే, పూర్తి కావొచ్చిన బ్రిడ్జి నిర్మాణానికి సాయం చేసే బదులు.. వాహనాల రాకపోకలకు మరో రోడ్డు నిర్మించాలని గంగాధర్ కోరుతున్నారు. -
నేటి వారధికి..సారథి ఆయనే..
సాక్షి, పెడన : కడలి సుడులలో కొట్టుకుంటూ బాహ్య ప్రపంచంతో బంధం లేని దీవికి వారధి రూపంలో దారి కల్పించిన దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇసుక తిన్నెలనే రహదారిగా చేసుకుని అలసిన పాదాల కష్టాలకు విరామాన్నిస్తూ సొగసైన రహదారి నిర్మాణం ఆయన సొంతం. గుక్కెడు నీటి కోసం అలమటించి పోతున్న వేల గొంతుల దాహం తీర్చే ఆలోచన చేసిన అపరభగీరథుడు. రెండు జిల్లాలను వంతెనతో అనుసంధానం చేసిన మహోన్నతుడు. అభివృద్ధికి ఆయన చిరునామా..పేదవాడి కష్టం తెలిసిన ప్రేమమూర్తి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి. పెడన నియోజకవర్గంలోనే అరుదైన అభివృద్ధి సొంతం చేసుకున్న ఘనత ఆయనది. తీరప్రాంతమే కాక జిల్లాకు శివారునున్న కృత్తివెన్ను మండలానికి 2007 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రాకతో అభివృద్ధికి బీజం పడింది. నాడు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉప్పుటేరుపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి వైఎస్సార్ వచ్చారు. బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధం లేని చినగొల్లపాలెం దీవి వంతెనకు శంకుస్థాపన చేశారు. దీవిలో దారి.. ఇసుక తిన్నెలపై ప్రయాణంతో నిత్యం ప్రత్యక్ష నరకం చూస్తున్న దీవి వాసుల కోసం ఎంతో వ్యయ ప్రయాసలైన పడవలపై ఇసుక, కంకర తరలించి రహదారి నిర్మాణానికి కృషి చేసిన ఘనత ఆయనదే. -
ఉత్తుత్తి వాగ్దానాల బాబు !
సాక్షి,అవనిగడ్డ : సాగర సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ‘ఏటిమొగ – ఎదురుమొండి మధ్య కృష్ణా నదిలో రూ.74 కోట్లుతో వారధి నిర్మిస్తాం.. చుక్కల భూములు, కండిషన్ పట్టాల భూముల సమస్య పరిష్కరిస్తాం.. ఇలా దివిసీమ వాసులకు ఇచ్చిన మరెన్నో హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపై రాతలుగా మార్చేశారు. ప్రతి సారీ మాట తప్పి నిన్ను నమ్మం బాబు అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎదురుమొండి వారధి ఏమైంది? గత ఏడాది నవంబర్ 21వ తేదీ ఉల్లిపాలెం, చల్ల పల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.74 కోట్లు కేటాయించామని, టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మూడు నెలల సమయం ఉన్నా ఈ విషయంలో.. ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం పట్ల దీవుల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2008లో రూ.45 కోట్లతో వారధి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నిధుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన మరణం అనంతరం వీటిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 19వ తేదీ అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురుమొండి వారధి నిర్మిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. పర్యాటక అభివృద్ధి శూన్యం పవిత్ర కృష్ణా నది సముద్రంలో కలిసే సాగర సంగమం ప్రాంతం చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది. 2017లో నిర్వహించిన కృష్ణా పుష్కరాలు సందర్భంగా సాగర సంగమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో నెలకొన్న అడ్డంకులను తొలగించి సాగర సంగమాన్ని ప్రత్యేక సందర్శన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, కూచిపూడి, శ్రీకాకుళం, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, హంసలదీవిలను కలుపుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవు. చుక్కలు చూపిస్తున్నారు దివిసీమలోని పలు మండలాల్లో కండిషన్ పట్టా భూములు రైతులకు చుక్కలు చూపిస్తున్నా పాలకులు స్పందించకపోవడంపై దివి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో కండిషన్ పట్టా (సీపీ పట్టా), చుక్కల భూములు 34 వేల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములన్నీ ఐదారు తరాల నుంచి రిజిస్ట్రేషన్ అవుతున్న భూములే అయినప్పటికీ కండిషన్ పట్టా లిస్టులో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో పొలాలను అమ్ముకునేందుకు వీలు పడక, అప్పుల పాలవుతున్నారు. రక్షణ కేంద్రం ఏర్పాటయ్యేనా? దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. అప్పటి నుంచి పలు అవరోధాలు వల్ల ప్రాజెక్టు జాప్యం అవుతూ వస్తోంది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ అంటకాగిన నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోగా, టీడీపీ కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాక పలు అనుమతులు రావడం కొసమెరుపు సీఎం దివిసీమకు ఇచ్చిన హామీలు కోడూరు పీహెచ్‌సీని 24 గంటల వైద్యశాలగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరచిపోయారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో లింగన్నకోడు, ఇరాలి, రత్నకోడుపై చెక్‌డ్యాంలు (రబ్బర్ డ్యాంలు) నిర్మిస్తామని చెప్పారు. ఉత్తుత్తి హామీ చేశారు. విజయవాడ – మచిలీపట్నం నాలుగులైన్లకు ఉల్లిపాలెం వారధిని అనుసంధానం చేస్తామన్నారు. ఆ ఊసే మరిచారు. కేరళను తలదన్నే ప్రకృతి సుందర ప్రదేశమున్న దివిసీమను రాజధానిలో గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ తర్వాత పట్టించుకున్న పాపానపోలేదు. రూపాయి బోనస్ ఇవ్వలేదు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఆరు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట నీట మునిగి దెబ్బతింది. మొక్కజొన్న తడిసిందని క్వింటాల్‌కు రూ.150 తగ్గించి కొన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.6 వేలు నష్టపోయాం. క్వింటాల్‌కు రూ.200 బోనస్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఏడాది అయినా ఇంతవరకూ ఒక్క రైతుకు రూపాయి బోనస్ ఇవ్వలేదు. – గాజుల రాంబాబు, రైతు, బందలాయిచెరువు -
ఖనిజ సంపద దోచేందుకే..
మల్కన్‌గిరి : మన్యం నుంచి ఖనిజ సంపద దోచేందుకే ఆంధ్రా–ఒడిశా ప్రభుత్వాలు గురుప్రియ వంతెన నిర్మిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలపై ప్రేమతో దీనికి శ్రీకారం చుట్టలేదని చిత్రకొండ కటాఫ్ ఏరియా దళ అధినేత సుధీర్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే వనరులు, ఖనిజ సందను ఇక్కడ నుంచి యథేచ్ఛగా తరలించేందుకే రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నారని తెలిపారు. పెట్టుబడిదారీ వర్గాలకు, పారిశ్రామిక వేత్తలకు ప్రజాప్రతినిధులు, అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల అభ్యున్నతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి కనీస సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వాపోయారు. మల్కన్‌గిరి జిల్లాలో చిత్రకొండ సమితి కటాఫ్ ఏరియాలోని పనాస్‌పుట్ పంచా యతీలో మావోయిస్టులు ఆదివారం భారీ మేళా నిర్వహించారు. మావోయిస్టుల ఉనికిని కాపాడుకునేందుకు గత వారం రోజులుగా మావో వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా చివరి రోజు చిత్రకొండ కటాఫ్ ఏరియా దళ అధినేత సుధీర్ నేతృత్వంలో పనాస్‌పుట్ పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులను అణచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. మావోయిస్టుల అణచివేత ఎప్పటికీ జరగదన్నారు. మావోలు కేవలం ఆదివాసీల కోసమే పోరాటం చేసి వారికి మేలు చేస్తారన్నారు. వారి అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఎంతవరకైనా పోరాడుతారన్నారు. దానికి కోసం ఎంతమంది అయినా ప్రాణాలు త్యాగాలు చేస్తామని అక్కడ నూతనంగా నిర్మించిన స్థూపంపై ప్రమాణం చేశారు. ముందుగా అమరులైన మావోయిస్టుల కోసం నూతన స్థూపం నిర్మించి మావోయిస్టులు, గిరిజనులు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన చుట్టుపక్కల గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు విప్లవ గీతాలను ఆలపించారు. -
పరిహారం చెల్లించకుండానే నిర్మాణాలు
ముత్తారం(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ2 విస్తరణకు చేపట్టిన భూసేకరణలో నష్టపరిహారం చెల్లించకుండానే ఎస్సారెస్పీ ఎల్6 కాలువ మళ్లింపు పనుల్లో భాగంగా తమ భూముల్లో దౌర్జన్యంగా అధికారులు వంతెన నిర్మాణం చేపడుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం లద్నాపూర్ పంచాయతీ పరిధి రాజాపూర్‌లో బాధిత రైతులు మాట్లాడుతూ.. గ్రామశివారులోని 193, 200లో ప్రభుత్వం సుమారు 60 ఏళ్ల క్రితం భూపంపిణీలో భాగంగా గ్రామంలోని నిరుపేదలకు 25.18 ఎకరాల భూమిని పంపిణీచేసి పట్టాలు జారీచేసిందన్నారు. తమకు పంపిణీ చేసిన భూములకు నష్టపరిహారం చెల్లించకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు ఫిర్యాదుచేస్తే నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. -
మహబూబ్‌నగర్–రాయచూరు హైవేపై కొత్త వంతెన
కృష్ణా నదిపై కర్ణాటక సరిహద్దులో నిర్మాణం - రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే మొదలు - బ్రిడ్జి బాధ్యతలు కర్ణాటకకు అప్పగించిన కేంద్రం - నిజాం కాలం నాటి వంతెన కూల్చివేత..! సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణ–కర్ణాటకను అనుసంధానం చేస్తూ కొత్త వంతెన రూపుదిద్దుకోనుంది. మహబూబ్‌నగర్–రాయచూరు హైవేపై కృష్ణా మండలం చివరన వాసు నగర్ వద్ద రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు వరసలతో భారీ వంతెన నిర్మాణం జరగనుంది. 167వ నంబరు జాతీయ రహదారిపై ప్రస్తుతం ఉన్న వంతెన ఇరుకుగా మారటంతో దాన్ని తొలగించి కొత్తగా నాలుగు వరసలతో వంతెన నిర్మించనున్నారు. దాదాపు 87 ఏళ్ల క్రితం నిజాం జమానాలో రూపుదిద్దుకున్న ఈ వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. భారీ వాహనాల ధాటికి బాగా దెబ్బతింటోంది. దీంతో ఇటీవలే జాతీయ రహదారుల విభాగం దాదాపు రూ.4.7 కోట్లు వెచ్చించి తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసింది. ఇప్పుడు జడ్చర్ల నుంచి మంత్రాలయం వరకు ఈ రోడ్డును నాలుగు వరసలుగా విస్తరిస్తుండటంతో కొత్త వంతెన నిర్మించాలని జాతీయ రహదారుల విభాగం నిర్ణయించింది. తెలంగాణ వైపు రోడ్డు విస్తరణను తెలంగాణ జాతీయ రహదారుల విభాగం, కర్ణాటక వైపు ఆ రాష్ట్ర విభాగం పర్యవేక్షిస్తుండగా, పొత్తులో ఉన్న ఈ వంతెన నిర్మాణ బాధ్యతను కేంద్ర జాతీయ రహదారుల విభాగం కర్ణాటకకు అప్పగించింది. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో దాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త జాతీయ రహదారి ఏర్పాటుతో.. మహబూబ్‌నగర్–రాయచూరు 167వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పని మొదలైంది. జడ్చర్ల వరకే నాలుగు వరసలుగా ఉన్న ఈ రహదారి, అక్కడి నుంచి రాయచూరు వరకు మూడు వరసలుగా ఉంది. ఇందులో కొంతభాగమే జాతీయ రహదారిగా ఉండటంతో మిగతా రోడ్డు విస్తరణ జరగలేదు. గతేడాది మిగతా రోడ్డుకు కూడా జాతీయ రహదారి అర్హత రావటంతో ఇప్పు డు దాన్ని విస్తరించే పని ప్రారంభించారు. జడ్చర్ల నుంచి కర్ణాటక సరిహద్దు వరకు తెలంగాణ జాతీయ రహదారుల విభాగం రోడ్డు రెండు వైపులా 5 మీటర్లు చొప్పున విస్తరిస్తోంది. జడ్చర్ల నుంచి లాల్కోట వరకు మొదటి విడత పనులు జరగ్గా, అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రెండొ విడత పనులు మొదలయ్యాయి. ఈ రోడ్డులో భాగంగానే వంతెనను నిర్మిస్తారు. తొలుత పాత వంతెనను అలాగే ఉంచి దానికి అనుబంధంగా రెండు వరసలతో కొత్త వంతెనను నిర్మించాలని భావించారు. కానీ ఉన్న వంతెన బాగా పాతబడి పెచ్చులూడుతున్నాయి. దీంతో పెద్ద వాహనాల ధాటికి ఎక్కువ కాలం ఉండదని భావించిన అధికారులు మొత్తం నాలుగు వరసలు కొత్తదే ఉండాలని తేల్చారు. ఈ నేపథ్యంలో పాత వంతెనను కూల్చి కొత్తది నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు పాత వంతెన నిజాం కాలం నాటిది కావడంతో దాన్ని అలాగే ఉంచి, పర్యాటక ప్రాంతంగా మార్చాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరుకు నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలు
► నాడు పడవ ప్రయాణం.. ► గతంలో కాలినడక,ఎడ్లబండ్లే దిక్కు ► బలోపేతమవుతున్న ఇరు జిల్లాల ప్రజా సంబంధాలు ఖానాపూర్: నాడు పడవ ప్రయాణం.. ప్రస్తుతం బస్సు ద్వారా రాకపోకలు. ఖానాపూర్ మండలంలోని బాదన్‌కూర్తిలో 2009లో బ్రిడ్జి నిర్మా ణం చేపట్టి పూర్తవడంతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. బాదన్‌కూర్తి గ్రామం మీదుగా అంతర్జిల్లా రోడ్డు మార్గం ఉంది. ఈ రోడ్డుతో రెండు జిల్లాల (నిర్మల్, జగిత్యాల) ప్రయాణికులకు రవాణా సౌకర్యం ఉంది. ఎక్కడైన వెళ్లాలంటే రోడ్డు మార్గాన ద్వారా వెళ్తున్నారు. దీం తో ఇరు జిల్లాల ప్రజాసంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంలో కాలినడకన, ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవారు. 8 ఏళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణం పూర్తవడంతో ఇరువైపులా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్, బాదన్‌కూర్తి గ్రామాల మీదుగా జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం ఒగులాపూర్‌కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి గతంలో ఉన్న ప్రధాన రోడ్డు ద్వారా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లవచ్చు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఆయా గ్రామాల నుంచి ప్రతిరోజు బస్సులు వచ్చి వెళ్తున్నాయి. రెండు వైపులా జిల్లా సరిç ßæద్దు గ్రామాలు కావడంతో బంధుత్వాలు రెండు జిల్లాలో ఉన్నాయి. మండల కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ కంటే దగ్గరగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్పల్లి ప్రాంతానికి ఇటీవలకాలం అత్యధికంగా ఇక్కడి ప్రజలు ప్రయాణిస్తున్నారు. పెరుగుతున్న వ్యాపార లావాదేవీలు ఇరు జిల్లాలోని రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అటువైపు, ఇటువైపు మంచి మార్కెట్ కేంద్రాలు ఉన్నాయి. మెట్ పల్లి మార్కెట్‌కు చెందిన వ్యాపారులకు గతకొద్ది రోజులుగా ఖానాపూర్ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు చేపట్టారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్‌తోపాటు మంచి మార్కెట్ సౌకర్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం గతంలో రైతుల తమ పంట ఉత్పత్తులను ఎక్కడ గిట్టుబాటు ధరలు ఉంటే అక్క డ అమ్ముకోవచ్చని ఉన్న ఆంక్షలు ఎత్తేయడంతో గిట్టుబాటు ధర ఉన్న చోట అమ్ముకుంటున్నారు. అదేవిధంగా మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్‌పల్లికి వెళ్లి, ఆసుపత్రుల్లో చికిత్సలు సైతం చేయించుకుం టారు. ఖానాపూర్‌లో జరిగే వారసంతలో కూరగాయలు, బట్టలు మసాలా దినుసులను ఇతర వ్యాపార లావాదేవీలకు కోసం సమీప మండలాల్లోని వ్యాపారులు, ప్రజలు అధికసంఖ్యలో వచ్చి అమ్మకాలు, కొనుగోలు చేపడతారు. ప్రç Ü్తుతం ఆయా జిల్లాలకు చెందిన డిపోల నుంచి సైతం ప్రతిరోజు బస్సులు నడుస్తున్నాయి. నాడు అష్టకష్టాలు.. నేడు రాచమార్గం గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాలకు వెళ్లాలంటేనే ఎడ్లబండ్ల ద్వారా, కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. రవాణా మార్గం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరుజిల్లాల సరిహద్దు గ్రామాల్లో పిల్లలకు పెళ్లిల్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. దాంతో ఇరు జిల్లాల్లో బంధుత్వాలు ఎక్కువై ప్రజా సంబంధాలు బలపడుతున్నాయి. రవాణా సౌకర్యం మెరుగైన క్రమంలో మరిన్ని బస్సు ట్రిప్పులు ఆయా గ్రామాలకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
అంత్యక్రియలకు అరటిబోదెలే సాయం..
జి.పెదపూడి(పి.గన్నవరం): ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం నలుగురి సాయం కావాలంటారు. అయితే ఆ గ్రామంలో ఆ నలుగురితో పాటు అరటిబోదెల సాయం కూడా అవసరమే. ఎందుకంటే వాటి సాయం లేకుండా శవాన్ని శ్మశానానికి తరలించడం సాధ్యం కాదు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి శివారు ఉచ్చులవారిపేట వద్ద ప్రధాన పంట కాలువపై ఏడేళ్ల క్రితం చేపట్టిన వంతెన నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. దీంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే.. అరటి బోదెలతో తెప్పలు ఏర్పాటు చేసి, దానిపై పాడె లేదా శవపేటికను ఉంచి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కాలువలో ఈదుతూ మృతదేహాన్ని అవతలి ఒడ్డుకు చేర్చాల్సి వస్తోంది. ఆ సమయంలో పలువురు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. కాగా, ఆదివారం ఉచ్చులవారిపేటకు చెందిన గిడ్డి పల్లాలమ్మ(70) మరణించింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఎప్పటిలాగే అరటి బోదెల సహాయంతో కాలువ దాటించి అంత్యక్రియలు నిర్వహించారు. -
అసంపూర్తిగా వంతెన నిర్మాణం
► పదినెలలైనా పూర్తికాని వైనం ► ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు లక్ష్మణచాంద : మండల కేంద్రంలోని అంకెన చెరువు కింద దాదాపు 500 ఎకరాల ఆయకట్టు ఉంది. అంకెన చెరువు పూర్తిగా నిండినప్పుడు దీని నుంచి పొంగిన నీరు వాగులోకి చేరుతోంది. ఇలా వచ్చిన వాగు నీరు ఎక్కువై వాగు ఉదృతంగా ప్రవహించడంతో దాటడం ప్రజలకు కష్టమవుతుంది. దీనితో వాగుకు అవతలి వైపు పొలాలు గల రైతులు చాలా సంవత్సరాల నుంచి అనేక అవస్థలు పడుతున్నారు.దీంతో అంకెన చెరువు కింద ఆయకట్టు గల రైతులు అందరు కలిసి అనేక సార్లు ప్రజా ప్రతినిదలకు విన్నవించగా అప్పటి ప్రభుత్వం రైతుల కష్టాలకు కరగలేదు.అందువల్ల అక్కడ పొలాలు గల రైతులు ప్రతి సంవత్సరం ఇలాగే అనేక బాదలు పడేవారు. అనేకసార్లు ప్రమాదాలు.. వర్షాకాలం వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రతి సారి వాగు ఉదృతంగా పొంగటంతో పాటు అటువైపుగా వెళ్లే రైతులకు చెందిన పశువులు వరదకు కొట్టుకొని పోయాయి. అంతేగాకుండా రైతులు కూడా అనేకసార్లు గాయాలపాలయ్యారు.తమ పొలాలు నాటువేసే సమయంలో అటువైపు రమ్మంటేనే రైతులు భయపడుతున్నారని రైతులు వాపోతున్నారు.పంట పొలాలు వేసే సమయంలో ఎరువులు తీసుక వెళ్లడంకూడా కష్టంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మంత్రి ఐకేరెడ్డి చొరవతో.. మండల వాసుల రైతుల కష్టాలు తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ,దేవాదాయ,న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చొరవతో బ్రిడ్జి మంజూరి అయ్యింది. రూ.35 లక్షల రూపాయలతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతులమీదుగా బ్రిడ్జి నిర్మాణ పనులకు 04–03–2016 రోజున శంకుస్థాపన చేశారు. రైతులకు ఎటు వంటి కష్టం కలగకుండా త్వరగా బ్రిడ్డి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌నుమంత్రి ఐకేరెడ్డి ఆదేశించారు. పదినెలలైనా అసంపూర్తిగానే.. బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టి ఇప్పటికే పది నెలలు గడిచిన బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు.కాంట్రాక్టర్ అలసత్వం వల్ల సకాలంలో పూర్తి కావలసిన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇప్పటికి అసంపూర్తిగానే ఉన్నాయి.పిల్లర్లు వేసి పది నెలలు గడుస్తున్న స్లాబు మాత్రం వేయడం లేదు.దీనితో అంకెన చెరువు కింద ఆయకట్టు గల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాగు నీరు ఎక్కువగా రావడంతో అటువైపుగా వెళ్లడానికి మహిళ రైతులు భయపడుతున్నారు. -
కలలా వారధి
నేటికీ ప్రారంభంకాని కృష్ణానదిపై వంతెన పనులు వెంకటపాలెం నుంచి గొల్లపూడి వరకు నిర్మాణం రూ. 1940 కోట్ల వ్యయంతో టెండర్ అప్పగింత 30 నెలల్లో పూర్తి చేయాలని నిబంధనలు ఏడాది పూర్తవుతున్నా పునాదికి నోచని వైనం రెండు జిల్లాలకు వారధి.... మూడు కిలోమీటర్లకు పైగా వంతెన... దాదాపు రూ.1940 కోట్ల వ్యయం... టెండర్ అప్పగించి ఏడాది. నేటికీ పనులు ప్రారంభి ంచని సంస్థ...కిమ్మనని ప్రభుత్వం... రాజధాని ప్రాంతంలో ప్రజల ఎదురు తెన్నులు..నిర్మాణం పూర్తవుతుందా లేదా... ప్రారంభమే లేని చోట కార్యరూపం దాల్చ గలదా అనే సందేహం... చివరకు ప్రారంభానికి నోచని ప్రాజెక్టుగా మిగులుతుందా అనే అనుమానం..! తాడికొండ: అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు గత ఏడాది ప్రభుత్వం మంజూరు చేసిన కృష్ణానదిపై వంతెన నిర్మాణం నేటికీ ప్రారంభమే కాలేదు. గత ఏడాది సెప్టెంబరులో తుళ్లూరు మండలం వెంకటపాలెం 6/0 కిలోమీటరు వద్ద నుంచి కృష్ణాజిల్లా గొల్లపూడి వద్ద కృష్ణానదిపై 3 కిలోమీటర్ల 100 మీటర్ల పొడవ ునా వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1940 కోట్లతో టెండరు పిలిచింది. గామన్ఇండియా సంస్థ ఈ టెండరును దక్కించుకుంది. 30 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ నేటి వరకు పనులే ప్రారంభించలేదు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పనులు మొదలు పెట్టలేదని సమాచారం. దీనిపై నేషనల్హైవే అధికారులు సదరు సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా ఆస్ట్రేలియా కంపెనీతో కలసి త్వరలో పనులు ప్రారంభిస్తామని తిరుగు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఆస్ట్రేలియా కంపెనీ దేశంలో ఇప్పటికి 9 చోట్ల ఇటువంటి వంతెన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసింది. దీంతో ఆ కంపెనీతో కలసి పనిచేసేందుకు గామన్ ఇండియా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వంతెన నిర్మాణానికి కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు 90 శాతం భూములు కూడా ఇచ్చారు. నిర్మాణ వ్యయం రూ.1940 కోట్లలో రూ.300 కోట్లు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించారు. కొందరు రైతులు మాత్రం భూసమీ కరణను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. వారికి సంబంధించిన ప్యాకేజీ కూడా ఉన్నతాధికారుల వద్ద డిపాజిట్ చేశారు. అయితే నేటికీ వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. మాస్టర్ ప్లాన్‌లో మరో రెండు వంతెనలు అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా మరో రెండుచోట్ల కృష్ణానదిపై వంతెనలు నిర్మించేందుకు మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం నుంచి ఇబ్రహీంపట్నం వరకు, అమరావతి నుంచి చెవిటికల్లు వరకు వంతెన నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రభుత్వం వంతెన నిర్మాణాలు చేపడితే గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య పడవ ప్రయాణాలు తప్పుతాయి. -
తూర్పునకు వెళ్లే ‘బ్రిడ్జి’!
* ముల్లకట్ట వద్ద గోదావరిపై పూర్తికావచ్చిన 2 కి.మీ. హైలెవల్ బ్రిడ్జి * హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు.. 190 కిలోమీటర్లు తగ్గనున్న దూరం సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తూర్పు భారతదేశానికి వాణిజ్య కేంద్రంగా ఉన్న కోల్‌కతాకు రవాణా ఇక దగ్గర కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు, కోల్‌కతాకు ఉన్న రెండు రహదారి మార్గాల కంటే దూరం గణనీయంగా తగ్గనుంది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తికావస్తోంది. ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం మండలం పూసూరు-ముల్లకట్ట మధ్యలో 2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి పనులు చివరిదశకు వచ్చాయి. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు ఉన్న దూరం ఇప్పటికంటే 190 కిలోమీటర్లు తగ్గుతుందని జాతీయ రహదారుల శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లేందుకు ప్రస్తుతం రెండు రహదారులు ఉన్నాయి. హైదరాబాద్-భద్రాచలం-జగ్దల్పూర్-కోల్‌కతా రహదారి దూరం 1678 కిలోమీటర్లు. హైదరాబాద్- నుంచి ఏపీలోని విజయవాడ-విశాఖపట్నం-భువనేశ్వర్-కోల్‌కతా రహదారి దూరం 1504 కిలోమీటర్లు. ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. వరంగల్ మీదుగా కోల్‌కతా రహదారి దూరం 1488 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే వాహనాలు ప్రస్తుతం విజయవాడ మీదుగానే వెళ్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ ఒరిస్సా మీదుగా కోల్‌కతాకు వెళ్లే వాహనాలు భద్రాచలం మీదుగా వెళ్తున్నాయి. అయితే, ఈ రెండు మార్గాల్లోనూ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుండంతోపాటు, రోడ్డు ప్రమాద అవకాశాలూ ఎక్కువవడంతో సరుకు రవాణాదారులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ముల్లకట్ట వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పశ్చిమబెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లకు వీరంతా ఈ మార్గాన్నే ఎంచుకునే అవకాశం ఉంది. వరంగల్ మీదుగా కోల్‌కతా, ఛత్తీస్‌గఢ్‌లకు రవాణా వల్ల దూరం తగ్గి భారీగా ఇంధనం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి.. గోదావరి నదిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట వద్ద ప్రారంభమై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు-జగన్నాథపురం గ్రామాల మధ్య ముగుస్తుంది. ఈ బ్రిడ్జి, అప్రోచ్‌రోడ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా జాతీయ రహదారుల డివిజన్, మూడు సబ్ డివిజన్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీకుపల్లి వద్ద రాష్ట్ర సరిహద్దు ముగుస్తుంది. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ప్రారంభమవుతుంది. ఏటూరునాగారం నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు.. పూసూరు నుంచి చీకుపల్లి వరకు రహదారి నిర్మాణం పూర్తికావచ్చింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశారు. ప్రజా రవాణాకు కీలకమైన ఈ బ్రిడ్జికి అనుమతులు, నిధులు వచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిర్మాణ పరమైన ప్లానింగ్ పూర్తయ్యాక 2012 మార్చిలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులు చివరి దశలో.. ఛత్తీస్‌గఢ్ పరిధిలోని రహదారుల అభివృద్ధిని ఆ రాష్ట్ర అధికారులు మొదలుపెట్టారు. ఇవన్నీ పూర్తయితే, రవాణా మొదలై హైదరాబాద్‌కు తూర్పు తీరం 190 కిలోమీటర్లు దగ్గర కానుంది. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ హైదరాబాద్ నుంచి భూపాలపట్నం రోడ్డును జాతీయ రహదారి (163)గా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1998లో నిర్ణయించింది. గతంలో 202 జాతీయ రహదారి ఉంది. ఇటీవల హైవే నం. 163గా మార్చారు. ఈ రహదారిని మొదటి దశలో రెండు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖ నిధులను కేటాయించింది. 2002లో హైదరాబాద్-వరంగల్ల మధ్య రెండులైన్ల రోడ్డుగా అభివృద్ధి చేశారు. వరంగల్-పస్రా రోడ్డు అభివృద్ధి పనులు 2004 నాటికి పూర్తిచేశారు. పస్రా-ఏటూరునాగారం మధ్య రెండులైన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. అటవీశాఖ అనుమతులు జాప్యం కావడంతో రహదారి అభివృద్ధి ఇంకా సాగుతూనే ఉంది. ములుగు-ఏటూరునాగారం మధ్యలో 28 కిలోమీటర్ల మేరకు ఈ జాతీయ రహదారి ఇంకా సింగిల్‌లైన్‌గానే ఉంది. హైదరాబాద్-కోల్‌కతా రహదారులు 1488 కిలోమీటర్లు హైదరాబాద్-వరంగల్-ఏటూరునాగారం-పూసూరు- భూపాలపట్నం-బీజాపూర్-దంతెవాడ-జగ్దల్పూర్-నౌరంగ్పూర్-భవానీపట్న-కుసూర్-బాలాగిర్-బల్లం- కియోంజ-ఖర్గూర్-కోల్‌కతా. 1504 కిలోమీటర్లు హైదరాబాద్-సూర్యాపేట-విజయవాడ-విశాఖపట్నం- బరంపురం-భువనేశ్వర్-కటక్-బాలాసోర్-ఖరగ్‌పూర్-కోల్‌కతా. 1678 కిలోమీటర్లు హైదరాబాద్-సూర్యాపేట-ఖమ్మం-భద్రాచలం-సీలేరు- కుసూర్-బాలాగిర్-బల్లం-కియోంజ -ఖరగ్‌పూర్-కోల్‌కతా. -
పూడిలంకకు దారి దొరికింది
రూ.9.90 లక్షలతో మరమ్మతులు పూర్తి బైకులు సైతం నడవగలిగే స్థితికి కాలిబాట త్వరలో రూ.4.55 కోట్లతో శాశ్వత వంతెన నిర్మాణం గ్రామస్తుల ఆనందం.. ‘సాక్షి’కి కృతజ్ఞతలు వజ్రపుకొత్తూరు : పూడిలంక కష్టం తీరింది. వారి కష్టాలు తీరే మార్గం తయారైంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రహదారి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించేది.. త్వరలోనే శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమమైంది. వజ్రపుకొత్తూరు మండలంలోని పూడిలంక జనప్రపంచానికి దూరంగా దీవిలా ఉంటూ మగ్గిపోయేది. చుట్టూ ఉన్న ఉప్పుటేరు చిన్న వర్షం వస్తే చాలు గ్రామానికి ఉన్న రెండు కిలోమీటర్ల కాలిబాటను ముంచెత్తేది. గ్రామం జలదగ్బంధంలో చిక్కుకునేది. అలా వర్షాలు వరదలకు ఆ బాట శిథిలమై నడవడానికి కూడా వీల్లేని దుస్థితికి చేరింది. దీనిపై ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి మానవహక్కుల కమిషన్ స్పందించింది. తక్షణం పూడిలంకకు ఏదో ఒక మార్గం చూపాలని ప్రభుత్వానికి ఆదేశించింది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ చొరవతో కాలిబాట మరమ్మతులకు రూ.9.90 లక్షలు మంజూరయ్యాయి. అలాగే శాశ్వత వంతెన నిర్మాణానికి రూ.4.55 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు పూర్తి అయ్యాయి. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేవు. గతంలో నడిచి వెళ్లేందుకు కూడా నరకయాతన అనుభవించిన తాము ఇప్పుడు బైక్‌పై 5 నిమిషాల్లో వంతెన దాటగలుగుతున్నామని చెప్పారు. శాశ్వత వంతెన పనులు కూడా చేపట్టి తొందరగా పూర్తి చేస్తే తమ కష్టాలు పూర్తిగా గట్టెక్కుతాయని ఆశగా చెప్పారు. వంతెన నిర్మాణానికి పర్యావరణ శాఖ అనుమతులు లభించాల్సి ఉందని, అవి లభించిన వెంటనే టెండర్లు పిలుస్తారని ఎమ్మెల్యే శివాజీ చెప్పారని సర్పంచ్ టి.పవిత్ర, గ్రామస్తులు ఢిల్లేశ్వరరావు, క్రిష్ణారావు తదితరులు చెప్పారు. తమ కష్టాన్ని ప్రపంచానికి తెలియజెప్పి, పరిష్కారం చూపిన ‘సాక్షి’ దిన పత్రికకు కృతజ్ఞతలు చెప్పారు. -
భద్రాచలం వద్ద గోదారిపై రెండో వంతెన
* నిర్మాణానికి రూ.80 కోట్లు * ఇప్పటికే ప్రారంభమైన పనులు * రెండేళ్లలో అందుబాటులోకి.. భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి నదిపై మరో బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. భద్రాచలంలో జరిగే ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో.. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు రెండో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరు చేయగా, ఇటీవలే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి ఆనుకొని ఎగువ ప్రాంతంలో మరో వంతెన నిర్మిస్తున్నారు. ఇప్పట్లో గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం లేకపోవటంతో వచ్చే మార్చివరకు పనులు చేసేందుకు ఎన్‌హెచ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గోదావరిలో పిల్లర్ల నిర్మాణానికి ప్రస్తుతం బ్రిడ్జికి ఇరువైపులా ర్యాంప్ నిర్మిస్తున్నారు. పటిష్ట నిర్మాణానికి అనుగుణంగా ఉండేందుకుగోదావరి ఇవతలి ఒడ్డు నుంచి సార పాక అవతలి ఒడ్డు వరకు మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. గతంలో ఉన్న బ్రిడ్జి మాదిరిగానే 37 పిల్లర్లు నిర్మిస్తున్నట్లు ఎన్‌హెచ్ ఈఈ చంద్రశేఖర్ తెలిపారు. పాదచారులకు సౌకర్యంగా ఉండేందుకు కొత్తగా నిర్మించే బ్రిడ్జికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2016 డిసెంబర్ నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే శంకుస్థాపన.. గోదావరి నదిపై నిర్మించే రెండో బ్రిడ్జి నిర్మాణం చరిత్రాత్మకంగా నిలిచిపోయే అవకాశం ఉన్నందున దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతోగానీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతోగానీ శంకుస్థాపన చేయించేందుకు ఎన్‌హెచ్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. వచ్చే నెలలో కేసీఆర్ భద్రాచలం వచ్చే అవకాశం ఉందని, అదే రోజు ఈ శంకుస్థాపన ఉండొచ్చని సమాచారం. అయితే వెంకయ్యనాయుడుతో శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. నాడు రూ.70 లక్షలు.. నేడు రూ.80 కోట్లు భద్రాచలం వద్ద గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిని రూ.70 లక్షల వ్యయంతో పూర్తి చేశారు. 1959 డిసెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయగా, 1965 జులై 13న రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. 3934 అడుగుల పొడవు, 37 పిల్లర్లు, ఒక్కో పిల్లర్ మధ్య 106.6 అడుగుల దూరంతో బ్రిడ్జి నిర్మించారు. ఇప్పటికీ ఇది పటిష్టంగానే ఉన్నప్పటికీ ఇది జాతీయ రహదారి అయినందున భవిష్యత్‌లో రవాణా అవసరాల దృష్ట్యా మరో బ్రిడ్జి నిర్మించాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపడంతో కేంద్రం నిధులు మంజూరు చేయగా, పనులు మొదలయ్యాయి.