గోదావరిపై కొత్త వంతెనలు | Telangana Likely To Construct Bridge On River Godavari | Sakshi
Sakshi News home page

గోదావరిపై కొత్త వంతెనలు

Published Mon, Aug 8 2022 2:03 AM | Last Updated on Mon, Aug 8 2022 3:28 PM

Telangana Likely To Construct Bridge On River Godavari - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలు జాతీయ రహదారులపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతకుముందు రెండు వరుస సంవత్సరాలు భారీ­వర్షాలు, పోటెత్తిన వరదలను తట్టుకున్నా, తాజా వర­దల తాకిడికి మాత్రం తాళలేకపో­యా­యి. ఇప్ప­టికిప్పుడు వాటి పూర్తిస్థాయి మర­మ్మ­తు­లకు రూ.38 కోట్లు కావాలంటూ జాతీయ రహదారుల విభాగం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల విభా­గానికి ప్రతిపాదించింది. అవి వచ్చే వరకు అధికారులు మట్టికట్టతో రోడ్లను పునరుద్ధరించారు. పెండింగ్‌లో ఉన్న కొత్త వంతెనల నిర్మాణం, పాత వంతెనల స్థాయి పెంపు ప్రతిపాదనలకు ఈసారైనా మోక్షం లభించవచ్చని భావిస్తున్నారు.

ఇక్కడే కొత్త వంతెనకు ప్రతిపాదన..: రోడ్డును గోదావరి అడ్డంగా చీల్చి ముందుకు పోటెత్తిన నేపథ్యంలో ఇక్కడ వంద మీటర్ల పొడవుతో కొత్త వంతెనను జాతీయ రహదారుల విభాగం తాజాగా ప్రతిపాదించింది. ఇక్కడ దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన తాజా వరదకు తట్టుకోలేకపోయింది. వంతెనకు ఓ వైపు మట్టి కొట్టుకుపోయి ఇలా రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఇప్పుడు పాత వంతెన కంటే కనీసం మూడు, నాలుగు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల పొడవుతో కొత్త వంతెనను దాని పక్కనే నిర్మించాలని అధికారులు తాజాగా నిర్ణయించారు.

దీనికి సంబంధించి త్వరలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. ఇదే రోడ్డు మీద తుపాకులగూడెం సమీపంలోని టేకులగూడెం వద్ద 125 మీటర్ల నుంచి 150 మీటర్ల పొడవుతో మరో వంతెనను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ కూడా గోదావరి ఎగిసి రోడ్డు మీదుగా వరద ప్రవహించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక్కడ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోనప్పటికీ, పక్కల భారీగా కోసుకుపోయింది. ఇక్కడ కూడా వెంటనే మట్టికట్ట వేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రసుతం ఆ తాత్కాలిక రోడ్డు మీదుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. 

పస్రా– తాడ్వాయి ప్రాంతంలో ట్రాఫిక్‌ రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మెటల్, మట్టి, ఇసుక బస్తాలతో ఇదిగో ఇలా తాత్కాలికంగా పునరుద్ధరించారు. ఆ తర్వాత భారీవర్షం, వరద వచ్చినా ఇది నిలబడింది. ఇంకోసారి వరద వస్తే మాత్రం ఇది తట్టుకునే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఈలోపు దీన్ని మరింత పటి­ష్టంగా పునరుద్ధరించాల్సి ఉంది. 

ఇది నిర్మల్‌–ఖానాపూర్‌ మధ్య ఉన్న దిమ్మతుర్తి గ్రామం వద్ద జాతీయ రహదారి. ఇక్కడ అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం వల్ల రోడ్డు విస్తరణ పనుల్లో దాదాపు రెండేళ్ల ఆలస్యం జరిగింది. అందు వల్లే ఇక్కడ ఆరు చిన్న వంతెనల నిర్మాణమూ జాప్యమైంది. అలా పూర్తికాని దిమ్మతుర్తి సమీపంలోని వంతెన వద్ద రోడ్డు ఇలా కొట్టుకుపోయి ట్రాఫిక్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. దీంతో తాత్కాలికంగా ఆ మళ్లింపు రోడ్డును పునరుద్ధరించి వాహనాలు నడిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement