సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఔటర్ రింగ్ రోడ్డు విభాగం అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. ఓఆర్‌ఆర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ కొన్నేళ్లుగా సర్వీసు రోడ్ల పనులు నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాల అవస్థలు పడుతున్నారు. ఫలితంగా రెండు, మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. 2012లోనే ఓఆర్‌ఆర్‌తో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణాలన్నీ పూర్తి కావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈదుల నాగులపల్లి, శంషాబాద్, ఘట్‌కేసర్, మేడ్చల్ సమీపంలో ఓఆర్‌ఆర్‌ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉండటంతో నరకం చూస్తున్నారు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతిచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఇబ్బందులు అప్పటి కమిషనర్ జనార్దన్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అయినా పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు.
ఇబ్బందులు పడుతున్నాం..
పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నాం.–సిద్దూ, ఘట్‌కేసర్ వాసి
రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి
మేడ్చల్ మండల పరిధిలో సుతారిగూడ నుంచి గౌడవెళ్ళి వరకు సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పాత జంక్షన్ సుతారిగూడ వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలిపెట్టారు. గౌడవెళ్ళి వద్ద రైల్వె ట్రాక్ ఉండటంతో అండర్‌పాస్ బ్రిడ్జి లేకపోవడంతో ఔటర్ ప్రయాణికులు గౌడవెళ్ళి మీదుగా మూడు కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ చౌరస్తా నుంచి దుండిగల్ వైపు వెళ్ళాల్సి వస్తోంది. సమస్యను రైల్వే అధికారులు, హెచ్‌ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. –సురేందర్ ముదిరాజ్, గౌడవెళ్లి సర్పంచ్
నిలిచిన సర్వీస్ రోడ్డు పనులు
శంషాబాద్: ఔటర్ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఈ దారి మధ్యలో ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను నిలిపివేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు రోడ్డులో శంషాబాద్ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్ సమీపంలో దారి మళ్లాల్సి వస్తుంది. చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం రెండు కిలోమీటర్ల దూరం వరకు సర్వీసు రోడ్డు పనులు నిలిచి పోవడంతో వాహదారులు హిమాయత్‌సాగర్ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండా వెళ్లాల్సి వస్తోంది.
వయా యంనంపేట్
ఘట్‌కేసర్: కీసర నుంచి ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో పెద్దఅంబర్‌పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్ గ్రామం మీదుగా ఘట్‌కేసర్ బైపాస్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డుకు చేరుకోవాలి. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా మూడు కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసి వస్తోంది.
3.5 కి.మీ. నరకం
మేడ్చల్: గౌడవెళ్లి రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో ఔటర్‌రింగు రోడ్డు సర్వీసు అసంపూర్తిగా ఉండటంతో సర్వీసు రోడ్డులో వెళుతున్న వాహనదారులు 3.5 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఘట్‌కేసర్ వైపు నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్‌చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెళ్ళి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ సమీపం వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో వాహనదారులు సుతారిగూడ టోల్ ప్లాజా నుండి గౌడవెళ్ళి గ్రామం మీదుగా 3.5 కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లాల్సి వస్తుంది. పటాన్‌చెరు వైపు నుంచి వచ్చే వాహనదారుల ఇదే పరిస్థితి.
పొలాలకు వెళ్లేందుకు దారి లేదు..
ఈదులనాగులపల్లి: రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదులనాగులపల్లి గ్రామ శివార్లలోని ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదులనాగులపల్లి, వెలమల శివార్లలో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగులపల్లి రావాలంటే కిలోమీటర్ చుట్టు తిరిగి రావాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment