భువనేశ్వర్ : కియోజంర్ జిల్లాలోని సలంది నదిపై బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు దశాబ్దాలుగా మొరపెట్టుకున్నా స్పందించలేదు. ఇక జిల్లా యంత్రాంగం పని మొదలు పెట్టి.. మధ్యలోనే నిలిపేసింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తానే నడుం బిగించాడు. తన పీఎఫ్ డబ్బులను వెచ్చించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. అదిప్పుడు చివరి దశకు చేరుకుంది. రూ. 10 లక్షలు ఖర్చు చేసి బ్రిడ్జిని నిర్మాణాన్ని చేపట్టానని వెటర్నరీ విభాగంలో పనిచేసి రిటైర్డ్ అయిన గంగాధర్ రావత్ చెప్పుకొచ్చారు. మరో రెండు లక్షలు ఖర్చుచేసి జూలై చివరి వరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘వర్షా కాలం వస్తే చాలు హటాదిది బ్లాక్‌తో నది ఇవతల ఉన్న పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. స్థానికులు వెదురు బొంగులతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక వంతెనపైనుంచే నడక సాగించాలి. అది ప్రమాదకరం. కాంక్రీట్ బ్రిడ్జి నిర్మించాలని రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. పదేళ్ల క్రితం జిల్లా అధికారులు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. మధ్యలోనే నిలిపేశారు. స్థానికంగా కూడా ఎలాంటి స్పందనా లేదు. ఇక లాభం లేదనుకుని బ్రిడ్జిని పూర్తి చేయడానికి నేనే పూనుకున్నాను. నా కుటుంబం కూడా నాకు అండగా నిలిచింది. గత మార్చి నుంచి నిర్మాణ పనులు సాగుతున్నాయి. మరో నెలలో బ్రిడ్జిని పూర్తి చేస్తా’ అని పెద్దాయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఈ వార్తపై జిల్లా కలెక్టర్ ఆశిస్థాకర్ స్పందించారు. బ్రిడ్జి పనులను తాము చేపడతామని వెల్లడించారు. అయితే, పూర్తి కావొచ్చిన బ్రిడ్జి నిర్మాణానికి సాయం చేసే బదులు.. వాహనాల రాకపోకలకు మరో రోడ్డు నిర్మించాలని గంగాధర్ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment