మరో రెండు.. కొత్త ఫ్లైఓవర్లు | Another Two Steel Bridge Constructions Soon in Hyderabad | Sakshi
Sakshi News home page

కోర్‌ సిటీలో.. కొత్త ఫ్లైఓవర్లు

Published Fri, Jul 10 2020 10:13 AM | Last Updated on Fri, Jul 10 2020 10:13 AM

Another Two Steel Bridge Constructions Soon in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సినిమా హాళ్ల జంక్షన్‌గా ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దానికి కొద్ది దూరంలోని వీఎస్టీ జంక్షన్, రాంనగర్, బాగ్‌లింగంపల్లిలలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి రెండు స్టీల్‌బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో, ఫస్ట్‌ లేన్‌గా నిర్మించే నాలుగు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ అంచనా వ్యయం రూ.350 కోట్లు. రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు దాదాపు కిలోమీటరు పొడవున సెకండ్‌ లెవెల్‌లో రెండో దశలో  నిర్మించే ఫ్లైఓవర్‌ అంచనా వ్యయం రూ.76 కోట్లు. ఈ రెండింటికీ కలిపి మొత్తం రూ.426 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 11న శంకుస్థాపనచేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.

స్టీల్‌ బ్రిడ్జిల వివరాలు..
ఇందిరాపార్కు– వీఎస్‌టీ  ఎలివేటెడ్‌ కారిడార్‌
ఇందిరాపార్కు నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ మీదుగా వీఎస్టీ(ఆజామాబాద్‌) వరకు నిర్మించే ఎలివేటెడ్‌ కారిడార్‌ ఇది.
పొడవు: 2.6 కి.మీ.
లేన్లు : 4 (16.60 మీటర్లు), రెండు వైపులా ప్రయాణం.
వ్యయం : రూ.350 కోట్లు
డిజైన్‌ స్పీడ్‌ : 40 కేఎంపీహెచ్‌
పనులకు పట్టే సమయం: 2 సంవత్సరాలు.

ప్రయోజనాలు:
ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ జంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ చిక్కులుండవు.
ప్రయాణ సమయం తగ్గుతుంది.
హిందీ మహా విద్యాలయ, ఉస్మానియా యూనివర్సిటీల వైపు ట్రాఫిక్‌ సమస్య తొలగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు ఉపశమనం కలుగుతుంది.  
ఇందిరాపార్క్‌ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్‌ క్రాస్‌ రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బాగ్‌లింగంపల్లిల వద్ద  ట్రాఫిక్‌ ఇక్కట్లు తొలగుతాయి.

రాంనగర్‌– బాగ్‌లింగంపల్లి ఫ్లైఓవర్‌
సెకండ్‌ లెవెల్‌లో నిర్మించే ఫ్లైఓవర్‌ ఇది. రాంనగర్‌ నుంచి వయా వీఎస్టీ మీదుగా బాగ్‌లింగంపల్లి వరకు.
పొడవు: 0.850 కి.మీ.
లేన్లు: 3 లేన్లు (16.60 మీ), రెండు వైపులా ప్రయాణం
వ్యయం: రూ.76 కోట్లు
డిజైన్‌ స్పీడ్‌: 30 కేఎంపీహెచ్‌
పనుల పూర్తి: 2 సంవత్సరాలు.

ప్రయోజనాలు:
రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు ట్రాఫిక్‌ రద్దీ సమస్య తొలగి ట్రాఫిక్‌ ఫ్రీ ఫ్లోగా మారుతుంది.
బాగ్‌లింగంపల్లి, వీఎస్టీల వద్ద ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయి.
వాహనదారుల సమయం ఆదా అవుతుంది.

వాహనదారులకుఎంతో సదుపాయం
ఇందిరాపార్కు– వీఎస్‌టీ  ఎలివేటెడ్‌ కారిడార్‌ను మొదటి దశలో, రాంనగర్‌– బాగ్‌లింగంపల్లి ఫ్లై ఓవర్‌ను రెండో దశలో నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండూ అందుబాటులోకి వస్తే దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్‌ ప్రాంతాల నుంచి సచివాలయం, లక్డికాపూల్‌ల మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి రాకపోకలకు ఎంతో సదుపాయంగా ఉంటుందని అధికారులు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement