రూ.9.90 లక్షలతో మరమ్మతులు పూర్తి
బైకులు సైతం నడవగలిగే స్థితికి కాలిబాట
త్వరలో రూ.4.55 కోట్లతో శాశ్వత వంతెన నిర్మాణం
గ్రామస్తుల ఆనందం.. ‘సాక్షి’కి కృతజ్ఞతలు
వజ్రపుకొత్తూరు : పూడిలంక కష్టం తీరింది. వారి కష్టాలు తీరే మార్గం తయారైంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రహదారి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించేది.. త్వరలోనే శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమమైంది. వజ్రపుకొత్తూరు మండలంలోని పూడిలంక జనప్రపంచానికి దూరంగా దీవిలా ఉంటూ మగ్గిపోయేది. చుట్టూ ఉన్న ఉప్పుటేరు చిన్న వర్షం వస్తే చాలు గ్రామానికి ఉన్న రెండు కిలోమీటర్ల కాలిబాటను ముంచెత్తేది. గ్రామం జలదగ్బంధంలో చిక్కుకునేది.
అలా వర్షాలు వరదలకు ఆ బాట శిథిలమై నడవడానికి కూడా వీల్లేని దుస్థితికి చేరింది. దీనిపై ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి మానవహక్కుల కమిషన్ స్పందించింది. తక్షణం పూడిలంకకు ఏదో ఒక మార్గం చూపాలని ప్రభుత్వానికి ఆదేశించింది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ చొరవతో కాలిబాట మరమ్మతులకు రూ.9.90 లక్షలు మంజూరయ్యాయి. అలాగే శాశ్వత వంతెన నిర్మాణానికి రూ.4.55 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు పూర్తి అయ్యాయి. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేవు.
గతంలో నడిచి వెళ్లేందుకు కూడా నరకయాతన అనుభవించిన తాము ఇప్పుడు బైక్‌పై 5 నిమిషాల్లో వంతెన దాటగలుగుతున్నామని చెప్పారు. శాశ్వత వంతెన పనులు కూడా చేపట్టి తొందరగా పూర్తి చేస్తే తమ కష్టాలు పూర్తిగా గట్టెక్కుతాయని ఆశగా చెప్పారు. వంతెన నిర్మాణానికి పర్యావరణ శాఖ అనుమతులు లభించాల్సి ఉందని, అవి లభించిన వెంటనే టెండర్లు పిలుస్తారని ఎమ్మెల్యే శివాజీ చెప్పారని సర్పంచ్ టి.పవిత్ర, గ్రామస్తులు ఢిల్లేశ్వరరావు, క్రిష్ణారావు తదితరులు చెప్పారు. తమ కష్టాన్ని ప్రపంచానికి తెలియజెప్పి, పరిష్కారం చూపిన ‘సాక్షి’ దిన పత్రికకు కృతజ్ఞతలు చెప్పారు.
పూడిలంకకు దారి దొరికింది
Published Sat, Feb 21 2015 1:22 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement