మన చుట్టూ నిత్యం ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు స్తంబాలని ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ నాయకులనో తిట్టుకుంటూ కూర్చొంటారు. కొంతమంది కాస్త ముందడుగు వేసి ప్రభుత్వానికి తెలియజేసేలా చేయడం వంటివి చేస్తారు. ఆ తర్వాత షరామాములే! ఆ పని ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులు. కానీ ఇక్కడొక వ్యక్తి అన్ని రకాలుగా యత్నించి అవ్వకపోయినా వెనుదిరగక..వ్యక్తిగత ప్రయత్నంతో తమ ఊరికి ఎదురైన సమస్యకు చెక్‌పెట్టి శభాష్ అనిపించుకున్నాడు సుధీర్ ఝా. తండ్రి అంత్యక్రియలకు అయ్యే ఖర్చును ప్రజల మేలు కోసం ఉపయోగించి ఆ సమస్యను చాలా చక్కగా పరిష్కరించాడు.
వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని మధుబని జిల్లా కలువహి మండలంలోని నారార్ పంచాయతీ నుంచి ఓ కాలువ వెళ్తుంది. ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలంటే.. ఆ కాలువను దాటే వెళ్లాలి. వర్షాకాలంలో కాలువ ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో గ్రామస్తులు ఊరి దాటి బయటకు వెళ్లేందుకు భయపడుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఆపద వచ్చినా అంతే పరిస్థితి. అక్కడ బ్రిడ్జి వస్తే వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వర్షాకాలంలో సైతం ఎలాంటి ఇబ్బందులు పడకుండా హాయిగా ఉండొచ్చు. కానీ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా వంతెన మంజూరు కాలేదు. దీంతో పెద్దాయన మహదేవ్ ఝూ తమ గ్రామ పరిస్థితిని చూసి చలించిపోయి ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అయినా ఎటువంటి ఫలితం దక్కలేదు. ఆ ఊరికి ఎలాగైనా వంతెనను నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు మహాదేవ్. జీవిత చరమాంకంలో ఉన్న ఆయనకు తనవల్ల ఇది సాధ్యం కాదని తెలుసు. తన సంకల్పం ఎలగైనా నెరవేరాలి. తన ఊరికి మంచి జరగాలి ఇదే ఆ పెద్దాయన ఆశయం. దీంతో మహదేవ్ .. "ఒకవేళ నేను చనిపోతే.. నా అంత్యక్రియలకు, దశదినకర్మలకు అయ్యే ఖర్చుతో బ్రిడ్జిని నిర్మించాలి" అని కుటుంబ సభ్యులను కోరాడు. అది తన కల .. చివరి కోరిక అని వారికి చెప్పాడు. మహాదేవ్ అ‍్నట్లుగానే కొన్నాళ్లకు అనారోగ్య సమస్యలతో 2020లో మహదేవ్ ఝా మరణించాడు.
కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యం..
అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన మహదేవ్ ఝూ అతడి భార్య మహేశ్వరి దేవి, కుమారుడు విజరుప్రకాష్ ఝా అలియాస్ సుధీర్ ఝాకు బాగా తెలుసు. ఆ డబ్బుతో గ్రామంలో ఉన్న కాల్వపై వంతెనను నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి, కాల్వపై వంతెనను నిర్మించారు. అయితే కరోనా కారణంగా వంతెన నిర్మాణంలో రెండేళ్లు ఆలస్యం అయ్యింది. అయినా లెక్కచేయక దీక్షతో ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి..ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కలను సాకారం చేశారు.
తమ సమస్య తీరడంతో గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వంతెన ద్వారా దాదాపు రెండు వేల మంది గ్రామస్తులు తేలికగా గ్రామం ఇటువైపు నుంచి అటువైపుకు రాకపోకలు చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు జరిగిందని మహదేవ్ ఝా సోదరుడు మహవీర్ ఝా తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి తిడుతూ కూర్చొకుండా..వ్యక్తిగత ప్రయత్నాలతో కూడా సమస్యను పరిష్కరించవచ్చని మహదేవ్ ఝా, అతడి కుటుంబ సభ్యులు నిరూపించారు. ఒక ఉపాధ్యాయుడిగా మహదేవ్ ఈ సమాజానికి ఓ గొప్ప పాఠాన్ని నేర్పారు.
(చదవండి: ఈ కాలు నాదే..ఆ కాలు నాదే అని కాలుపై కాలు వేసుకుని కూర్చొన్నారో.. అంతే సంగతి!)
Comments
Please login to add a commentAdd a comment