బీహార్‌లోని భాగల్పూర్‌లో ఒక తండ్రి తన మైనర్ కుమార్తెను వయసుమీరిన వ్యక్తికి ఇచ్చి, వివాహం చేసిన ఉదంతం సంచలనంగా మారింది. ఆ బాలికకు ఈ వివాహం ఏమాత్రం ఇష్టంలేకపోయినప్పటికీ, తండ్రి బలవంతంగా ఈ వివాహాన్ని జరిపించాడు. వివాహం అనంతరం బాధిత బాలిక ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్‌చేస్తూ, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది. ఆ 16 ఏళ్ల బాలిక తాను చదువుకోవాలనుకుంటున్నానని, తనకు న్యాయం చేయని పక్షంలో ప్రాణాలు తీసుకుంటానని పేర్కొంది.
బాలిక పుట్టింటివారు జార్ఖండ్‌లోని గోడ్డా జిల్లాలో ఉంటారు. ఈ వీడియోలో ఆ బాలిక తన తల్లి గత ఏడాది అంటే 2022 డిసెంబరులో మృతి చెందిందని తెలిపింది. తన తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. తన తండ్రిపై అప్పుల భారం ఉందని తెలిపింది. తన తండ్రికి రుణం ఇచ్చిన ఒక వ్యక్తి.. ఈ రుణం తీర్చేందుకు బదులుగా కుమార్తె(తన)తో వివాహం చేయించాలని కోరాడని తెలిపింది. దీనికి తన సవతి తల్లి వంతపాడిందని, తనకు ఈ వివాహం ఏమాత్రం ఇష్టం లేదని పేర్కొంది. అయితే గత జూలైలో బలవంతంగా ఆ వ్యక్తితో తనకు వివాహం జరిపించారని ఆమె పేర్కొంది.
పెళ్లి అయ్యాక తాను భాగల్‌పూర్ చేరుకున్నానని, తన భర్త తనను నిత్యం కొడుతుంటాడని, నిందిస్తుంటాడని బాధితురాలు తెలిపింది. తుపాకీ చూపించి, తనతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడని, ఈ వేధింపులను తాను భరించలేకపోతున్నానని ఆమె ఆ వీడియోలో పేర్కొంది.
కాగా ఆ బాలిక తన భర్త, తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, వారు ఎటువంటి సహాయం చేయకపోగా, ఇది తమ పరిధిలోని కేసు కాదని ఆమెను పంపించివేశారు. దీంతో బాధితురాలు డీఐజీ కార్యాలయానికి చేరుకుని, అక్కడి సిబ్బందికి తన ఆవేదన తెలియజేసినా వారు పట్టించుకోలేదు. దీంతో పూర్తిగా విసిగిపోయిన ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ ఒక వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో భాగల్‌పూర్ ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు.
ఇది కూడా చదవండి: అది రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట!
Comments
Please login to add a commentAdd a comment