మహబూబ్‌నగర్–రాయచూరు హైవేపై కొత్త వంతెన
కృష్ణా నదిపై కర్ణాటక సరిహద్దులో నిర్మాణం
- రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే మొదలు
- బ్రిడ్జి బాధ్యతలు కర్ణాటకకు అప్పగించిన కేంద్రం
- నిజాం కాలం నాటి వంతెన కూల్చివేత..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణ–కర్ణాటకను అనుసంధానం చేస్తూ కొత్త వంతెన రూపుదిద్దుకోనుంది. మహబూబ్‌నగర్–రాయచూరు హైవేపై కృష్ణా మండలం చివరన వాసు నగర్ వద్ద రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు వరసలతో భారీ వంతెన నిర్మాణం జరగనుంది. 167వ నంబరు జాతీయ రహదారిపై ప్రస్తుతం ఉన్న వంతెన ఇరుకుగా మారటంతో దాన్ని తొలగించి కొత్తగా నాలుగు వరసలతో వంతెన నిర్మించనున్నారు. దాదాపు 87 ఏళ్ల క్రితం నిజాం జమానాలో రూపుదిద్దుకున్న ఈ వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. భారీ వాహనాల ధాటికి బాగా దెబ్బతింటోంది. దీంతో ఇటీవలే జాతీయ రహదారుల విభాగం దాదాపు రూ.4.7 కోట్లు వెచ్చించి తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసింది.
ఇప్పుడు జడ్చర్ల నుంచి మంత్రాలయం వరకు ఈ రోడ్డును నాలుగు వరసలుగా విస్తరిస్తుండటంతో కొత్త వంతెన నిర్మించాలని జాతీయ రహదారుల విభాగం నిర్ణయించింది. తెలంగాణ వైపు రోడ్డు విస్తరణను తెలంగాణ జాతీయ రహదారుల విభాగం, కర్ణాటక వైపు ఆ రాష్ట్ర విభాగం పర్యవేక్షిస్తుండగా, పొత్తులో ఉన్న ఈ వంతెన నిర్మాణ బాధ్యతను కేంద్ర జాతీయ రహదారుల విభాగం కర్ణాటకకు అప్పగించింది. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో దాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్త జాతీయ రహదారి ఏర్పాటుతో..
మహబూబ్‌నగర్–రాయచూరు 167వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పని మొదలైంది. జడ్చర్ల వరకే నాలుగు వరసలుగా ఉన్న ఈ రహదారి, అక్కడి నుంచి రాయచూరు వరకు మూడు వరసలుగా ఉంది. ఇందులో కొంతభాగమే జాతీయ రహదారిగా ఉండటంతో మిగతా రోడ్డు విస్తరణ జరగలేదు. గతేడాది మిగతా రోడ్డుకు కూడా జాతీయ రహదారి అర్హత రావటంతో ఇప్పు డు దాన్ని విస్తరించే పని ప్రారంభించారు. జడ్చర్ల నుంచి కర్ణాటక సరిహద్దు వరకు తెలంగాణ జాతీయ రహదారుల విభాగం రోడ్డు రెండు వైపులా 5 మీటర్లు చొప్పున విస్తరిస్తోంది. జడ్చర్ల నుంచి లాల్‌కోట వరకు మొదటి విడత పనులు జరగ్గా, అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రెండొ విడత పనులు మొదలయ్యాయి. ఈ రోడ్డులో భాగంగానే వంతెనను నిర్మిస్తారు.
తొలుత పాత వంతెనను అలాగే ఉంచి దానికి అనుబంధంగా రెండు వరసలతో కొత్త వంతెనను నిర్మించాలని భావించారు. కానీ ఉన్న వంతెన బాగా పాతబడి పెచ్చులూడుతున్నాయి. దీంతో పెద్ద వాహనాల ధాటికి ఎక్కువ కాలం ఉండదని భావించిన అధికారులు మొత్తం నాలుగు వరసలు కొత్తదే ఉండాలని తేల్చారు. ఈ నేపథ్యంలో పాత వంతెనను కూల్చి కొత్తది నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు పాత వంతెన నిజాం కాలం నాటిది కావడంతో దాన్ని అలాగే ఉంచి, పర్యాటక ప్రాంతంగా మార్చాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరుకు నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.