
గోదావరి స్నానానికి వెళ్లి ఐదుగురు యువకుల దుర్మరణం
శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో దిగిన తండ్రి, కొడుకు మృతి
కొవ్వూరు/తాళ్లపూడి/శ్రీశైలం ప్రాజెక్ట్/కొళ్లికూళ్ల (పెనుగంచిప్రోలు): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నదీ స్నానాలకు వెళ్లిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకులు కాగా, ఇద్దరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తండ్రి, కుమారుడు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన 12 మంది యువకులు బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మోటారు సైకిళ్లపై సమీపంలోని చింతలపూడి పంప్‌హౌస్ వద్ద గోదావరి నదిలో స్నానాలకు వెళ్లారు. అక్కడి ఇసుక ర్యాంపు వద్ద నీరు మూడు అడుగులే ఉండటంతో స్నానాలకు దిగారు.
కేరింతలు కొడుతూ ఉత్సాహంగా స్నానాలు చేస్తూ నీరు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లేసరికి ప్రవాహం పెరగడంతో తిరుమలశెట్టి సాయిపవన్ (17), పడాల దుర్గాప్రసాద్ (19), అనిశెట్టి పవన్ గణేష్ (18), పడాల దేవదత్త సాయి (19), గర్రే ఆకాశ్ (19) కొట్టుకుపోయారు. వెంటనే స్థానిక జాలర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు పడవలతో గాలించారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారే.
జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు.
శ్రీశైలం వద్ద తండ్రి, కుమారుడు మృతి
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల గ్రామానికి చెందిన పెరుగు చిన్న గురవయ్య (35), ఆయన కుమారుడు వాసు (11) శ్రీశైలం లింగాలగట్టు వద్ద కృష్ణా నదిలో మునిగి మరణించారు. శివ దీక్ష తీసుకున్న గురవయ్య, భార్య తిరుపతమ్మ, కుమారుడు వాసు, ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు మంగళవారం బస్సులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. బుధవారం ఉదయం స్నానాలు చేసేందుకు లింగాలగట్టు వద్దకు వెళ్లారు.
కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా వాసు కాలు జారి నీటిలో పడిపోయాడు. కుమారుడిని కాపాడబోయిన చిన్న గురవయ్య కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న తిరుపతమ్మ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని మత్స్యకారులు నదిలో దూకి వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురవయ్య, వాసు మృతదేహాలను పోలీసులు సున్నిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment