Karnataka border
-
తమిళనాడు-కర్ణాటక బోర్డర్లో భారీ పేలుడు.. 10 మంది మృతి
సాక్షి, తమిళనాడు: కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో దాదాపు 10 మందికిపైగా మృత్యువాతపడ్డినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన అత్తిపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అత్తిపల్లిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు సమాచారం. అయితే, పేలుడు సంభవించిన సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 30 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యల పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, పేలుడు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. Fire accident in Crackers shop in TN/KA border. Guess who was the rest responder? Tamilnadu!! Fire truck from Karnataka came an hour late, though it happened on their side pic.twitter.com/v9Wg3JDAx2 — Nikel Reddy (@Nikel11860559) October 7, 2023 #Breaking in #Bengaluru A major #fire breaks out at a #cracker shop/godown near #Attibele (#Anekal area) on #Hosur Road near #Karnataka-#TamilNadu border. #Traffic crawls on the #highway.@NammaBengaluroo @WFRising @TOIBengaluru @0RRCA @ECityRising @ELCITA_IN pic.twitter.com/qtwXw0yIIs — Rakesh Prakash (@rakeshprakash1) October 7, 2023 -
మళ్లీ సరిహద్దు రగడ
బెంగళూరు/ముంబై/బెళగావి: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తంగా మారుతోంది. బెళగావి నగరంలో మంగళవారం ఇరు రాష్ట్రాల అనుకూలవాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వాహనాలపై పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాలను పోలీసులు అదుపులోకితీసుకున్నారు. మహారాష్ట్ర మంత్రులు, నేతలు తలపెట్టిన బెళగావి పర్యటనను నిరసిస్తూ కన్నడ సంఘాల సభ్యులు రోడ్లపైకి వచ్చారు. ప్లకార్డులు, బ్యానర్లు, పోస్టర్లు, కన్నడ జెండాలను ప్రదర్శిస్తూ మహారాష్ట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెళగావిలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్‌తో తిరుగుతున్న వాహనాలను అడ్డుకున్నారు. వాటి నెంబర్ ప్లేట్లపై నల్లరంగు పూశారు. కన్నడ సంఘాల నిరసనల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ‘కర్ణాటక రక్షణ వేదిక’ ప్రకటించింది. మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభూరాజ్ దేశాయ్ మంగళవారం బెళగావిలో పర్యటించి, మహారాష్ట్ర ఏకీకరణ సమితి సభ్యులకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు. కొన్ని కారణాలతో వారి పర్యటన వాయిదా పడింది. శివసేన నాయకులు కూడా బెళగావి పర్యటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. బెళగావి జిల్లా కలెక్టర్ నగరంలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని పుణేలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన కార్యకర్తలు కర్ణాటక వాహనాలపై రంగు చల్లారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కన్నడిగుల ప్రయోజనాలు కాపాడుతాం: సీఎం బొమ్మై మహారాష్ట్ర, కర్ణాటక ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయొద్దని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కోరారు. కన్నడిగులు ఎక్కడున్నా సరే వారి ప్రయోజాలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సరిహద్దు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, న్యాయ పోరాటంలో తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా దాడులు ఆపాలి: పవార్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై కారణమని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే వాహనాలపై దాడులను 24 గంటల్లోగా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతిభద్రతలు దిగజారాయని, ఇందుకు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు. తమ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నా కేంద్రం, మహారాష్ట్ర సర్కారు నోరుమెదపడం లేదని పవార్ మండిపడ్డారు. బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆక్షేపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారం రాత్రి ఫోన్‌ద్వారా మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు. ఏమిటీ వివాదం? రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం 1957 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావితోపాటు మరాఠా భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు స్వాతంత్య్రం కంటే ముందు అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. బెళగావి నగరాన్ని, 814 గ్రామాలను కర్ణాటకలో 1957లో విలీనం చేశారు. కానీ, అవి తమవేనని మహారాష్ట్ర వాదిస్తోంది. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెళగావి తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదిస్తోంది. అంతేకాదు అక్కడ బెంగళూరులోని విధాన సౌధను పోలిన సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఏడాదికోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. -
బోర్డర్లో ‘బూడిద’ లొల్లి! 400 లారీల నిలుపుదల.. ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బూడిద లారీలను నిలిపివేయడం ఆందోళనకు దారితీసింది. రెండు రోజులుగా 400కుపైగా లారీలను ఆపేయడం.. డ్రైవర్ల నిరసనతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. లారీలను వదలాలంటే డబ్బులు చెల్లించాలని ఓ ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. ఓవర్ లోడ్‌తో వెళ్తుండటంతో ఆపేశామని పోలీసులు చెప్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం జరిమానా వేసి వదిలేయాల్సి ఉన్నా.. రెండ్రోజులు ఆపడం, డ్రైవర్లు నిరసనకు దిగేవరకూ చూడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగింది? రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలానికి కర్ణాటకతో సరిహద్దు ఉంది. ఆ రాష్ట్రంలోని కర్ణాటక పవర్ కార్పొరేషన్ (కేపీసీ) విద్యుత్ కేంద్రంలో వెలువడిన బూడిద (యాష్).. ఈ సరిహద్దు మీదుగానే రాష్ట్రంలోని ఇటుక బట్టీలకు సరఫరా అవుతుంది. నారాయణపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీల్లో లైట్ వెయిట్ బ్రిక్స్ తయారీకి ఈ బూడిదను వినియోగిస్తారు. అయితే ఈ బూడిదను రవాణాచేసే లారీలను కృష్ణా చెక్‌పోస్టు వద్ద రవాణా, పోలీస్ అధికారులు గురువారం నుంచి నిలిపివేశారు. సుమారు 400కుపైగా వాహనాలు రెండు రోజులుగా రోడ్డు పక్కనే నిలిచిపోయాయి. లారీలను పంపాలని, తిండికి కూడా ఇబ్బంది పడుతున్నామని డ్రైవర్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని.. వారికి మద్దతుగా రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఓవర్‌లోడ్‌తో వస్తే జరిమానా వేసి, మరోసారి ఓవర్ లోడ్‌తో రావొద్దని చెప్పాలే తప్ప.. ఇలా నిలిపేసి ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దీనితో పోలీసు, రవాణా అధికారులు లారీలను వదిలేశారు. ముందు ఓ ఎమ్మెల్యే.. తర్వాత మరో ఎమ్మెల్యే.. బూడిద లారీలను వదిలేయాలంటే ఒక్కోలారీకి రూ.10వేలు ఇవ్వాలని నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్టుగా శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఓ డ్రైవర్ అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మిమ్మల్ని తిప్పలు పెట్టాలని కాదు. ఓవర్ లోడ్‌తో రోడ్లు దెబ్బతింటున్నయ్.. లెక్క ప్రకారం బూడిదను ట్యాంకర్ వాహనాల ద్వారా సరఫరా చేయాలి. ఓపెన్ లారీల్లో లెవల్‌కు మించి వేయడంతో గాలికి లేచి కళ్లల్లో పడుతోంది. పరిగికి చెందిన ఓ నాయకుడిది ఓవర్ లోడై ఉంది. అక్కడి పోలీస్ నాటకం చేస్తున్నడు. పైసలు తీసుకుని వదిలిపెడ్తున్నడు. చూస్తున్నా.. ఖతం పెట్టాలని చూస్తున్నా. మీరు దందా చేసి బతకాలి.. నాది గట్లే ఉంటది.. కొంచెం సిస్టంగా రావాలని చూస్తున్నా..’’ అని సంభాషణలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. లారీల విషయంలో ఇలా ఇద్దరు ఎమ్మెల్యేల జోక్యం, ఆరోపణలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
వారు తెలుగువారే.. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు!
అమరాపురం: వారు తెలుగువారే. అయినా కన్నడ మాట్లాడతారు. కన్నడ మాధ్యమంలో చదువుకుంటారు. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు. అంతేనా.. వివాహ, వ్యాపార సంబంధాలు సైతం కన్నడిగులతోనే. రాష్ట్రాలు వేరైనా ఇరు ప్రాంతాల వారూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఆచార, వ్యవహారాలు కూడా ఒకే విధంగా పాటిస్తున్నారు. ఇదీ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాల పరిస్థితి. మడకశిర నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. మడకశిర మినహా మిగిలిన అమరాపురం, అగళి, రొళ్ల, గుడిబండ మండలాల్లో ప్రజల మాతృభాష కన్నడ. ఇంటిలోనే కాదు ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాలు ఎక్కడైనా సరే కన్నడంలోనే మాట్లాడుతారు. అమరాపురం మండల కేంద్రానికి ఏడు కిలో మీర్ల దూరంలో నిద్రగట్ట పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని హెచ్బీఎన్ కాలనీ కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉంది. పక్కనే కర్ణాటకలోని లక్కనహళ్లి గ్రామం ఉంది. రాష్ట్రాలు, భాషలు వేరైన ఈ రెండు గ్రామాలకు మధ్యన సరిహద్దుగా రోడ్డు ఉంది. కేవలం మూడు అడుగులే దూరం. రోడ్డుకు ఒకపైపు ఆంధ్రప్రదేశ్.. మరొక వైపు కర్ణాటక రాష్ట్రం ఉంటాయి. నిద్రగట్ట పంచాయతీ పరిధిలో నిద్రగట్ట, ఎన్.గొల్లహట్టి, యర్రగుంటపల్లి, హెచ్బీఎన్ కాలనీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని విద్యార్థులు కర్ణాటకలోని లక్కనహళ్లి పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వాసులే అయినప్పటికీ వీరి మాతృభాష మాత్రం కన్నడే. తెలుగు పాఠశాలల్లో చదివినా.. అక్కడ వారు మాట్లాడేది కన్నడ భాషే. దీంతో హెచ్బీఎన్కాలనీ, కెంపక్కనహట్టి గ్రామాల్లో రెండు కన్నడ పాఠశాలలు ఉన్నాయి. బెంగళూరు, తుమకూరు, దావణగెర పట్టణాల్లో కూడా మన తెలుగువారు చదువుకుంటున్నారు. శిర, హిరియూరు, తుమకూరు, పావగడ, మధుగిరి, తదితర ప్రాంతాల్లో తమ పిల్లలకు వివాహాలు కుదుర్చుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాలు, స్థలాలు, పొలాలు సైతం రెండు ప్రాంతాల వారివీ అటు – ఇటు కొనసాగుతున్నాయి. అన్నదమ్ముల్లా ఉంటాం రాష్ట్రాలు వేరైనా గ్రామం వేరైనా ఒకేభాష మాట్లాడుకుంటూ అన్నదమ్ములా కలిసిమెలసి ఉంటున్నాం. మాకు రెండు భాషలు వస్తాయి. తెలుగుతో పాటు కన్నడను అనర్గళంగా మాట్లాడుతాము. నా కూతురు కర్ణాటకలోని మైసూరు యూనివర్సిటిలో చదివించా. పిహెచ్డీ చేయించా. మాకు చాలా అనుకూలమైన ప్రాంతం. దీంతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మూడడుగులు వేస్తే కర్ణాటక లక్కనహళ్లిలో ఉంటాము. రెండు గ్రామాల్లో ఏ శుభకార్యాలు జరిగినా కలిసిమెలసి జరుపుకుంటాం. –రాజన్న, హెచ్బీఎన్ కాలనీ, అమరాపురం మండలం పరస్పర సహకారం మాకు రాష్ట్రాలు అనే భేద భావం లేదు. అన్నదమ్ముల్లా కలసి ఉంటాం. ఆంధ్ర ప్రాంత ప్రజలు మా గ్రామాల్లో పని చేయడానికి కూలికి వస్తారు. మేము పని ఉంటే ఆంధ్రాకు వెళతాం. హెచ్బీఎన్ కాలనీ ప్రజలు తెలుగు, కన్నడ బాగా మాట్లాడుతారు. మాకు తెలుగు రాదు. అయినా అర్థం చేసుకుని కన్నడలో మాట్లాడుతాం. –రవికుమార్, లక్కనహళ్లి, కర్ణాటక రాష్ట్రం సంబంధాలు బలపడుతన్నాయి పొరుగునే కర్ణాటక రాష్ట్రం ఉండడంతో తమ సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఆ రాష్ట్రంలోనే జరుపుతున్నాం. పిల్లల్ని కూడా అక్కడే చదివిస్తున్నాం. పెళ్లిళ్లు ఎక్కువగా కర్ణాటకలోనే చేస్తున్నాం. ఆచార వ్యవహరాలు, భోజనం తదితర అన్నీ ఒక్కటిగానే ఉంటాయి. ఇక్కడ ప్రధాన వంటకం రాగి ముద్ద. –నాగన్న, హెచ్బీఎన్ కాలనీ, అమరాపురం మండలం చక్కగా మాట్లాడుతారు లక్కనహళ్లిలోని కన్నడ పాఠశాలకు నిద్రగట్ట పంచాయతీ నుంచి అధిక మంది విద్యార్థులు వస్తున్నారు. చక్కగా చదువుకుంటున్నారు. నేను కన్నడ బోధిస్తా. మా కన్నడిగుల కంటే తెలుగు ప్రాంత విద్యార్థులకే అధిక మార్కులు వస్తున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు బెంగళూరు, మైసూరు తదితర ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులుగా స్థిర పడ్డారు. –జయరామ్, కన్నడ టీచర్, లక్కనహళ్లి ఉన్నత పాఠశాల ఏపీలో ఉద్యోగావకాశాలు కల్పించాలి నేను ఒకటో తరగతి నుంచి కన్నడ పాఠశాలలోనే చదువుకున్నా. ప్రస్తుతం సెకెండ్ పీయూసీ చేస్తున్నా. మాకు ఆంద్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాలు వచ్చేలా చూడాలి. నా సొంత మండలం అమరాపురం. అయితే చదువు కర్ణాటకలో ఉండడం వలన మాకు నాన్‌లోకల్‌గా గుర్తిస్తారు. మండలాన్ని బేస్ చేసుకుని లోకల్‌గా పరిగణించాలి. –నయన, విద్యార్థి సెకెండ్ పీయూసీ, యర్రగుంటపల్లి, అమరాపురం మండలం. రెండు భాషలు నేర్చుకోవచ్చు హెచ్బీఎన్ కాలనీ కన్నడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇక్కడ తెలుగు, కన్నడ భాషలు రెండు నేర్చుకోవచ్చు. నాది రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహళ్ మండలం. ఆంధ్ర సర్కారు గడినాడు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలు నిర్వహించడం మాలాంటి వారికి ఎంతో ఉపయోగం. –సోమశేఖర్, ఉపాధ్యాయుడు, హెచ్బీఎన్ కాలనీ, కన్నడ పాఠశాల ఆంధ్రలో పథకాలు బాగున్నాయి మా రాష్ట్రంలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు పింఛన్ ఇక్కడ రూ.600 ఇస్తారు. అదే హెచ్బీఎన్ కాలనీ మా ఇంటికి ఆరడుగుల దూరంలో ఉంది. అక్కడ నా స్నేహితురాలు నరసమ్మకు పింఛన్ రూ.2250 ఇస్తున్నారు. అంతేకాదు 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.18,750 ఆర్థికసాయం అందిస్తున్నారు. –లక్ష్మక్క, లక్కనహళ్లి కర్ణాటక రాష్ట్రం -
ఏడు ఊర్లు కలసి హాల్వి.. దీనికో చరిత్ర ఉంది!
సాక్షి, మంత్రాలయం: పూర్వం ఆహారాన్వేషణ క్రమంలో నదీతీరం, కొండ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకుని జీవించిన ప్రజలు కాలక్రమేణా అక్కడి నుంచి వలస పోవడంతో ఊర్లు శిథిలమై కనుమరుగయ్యాయి. ఇలాంటి గ్రామాలు కాలగర్భంలో ఎన్నో కలసిపోయాయి. రికార్డుల్లో పేర్లు ఉన్నా.. కనిపించని ఊర్లు కర్నూలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. కర్ణాటక సరిహద్దులోని హాల్వి గ్రామానికో విశిష్టత ఉంది. ఏడు ఊర్లు ఒక్కటిగా ఏర్పడి ప్రత్యేకతల నిలయంగా విరాజిల్లుతోంది. మంత్రాలయం నియోజకవర్గంలో మండల కేంద్రమైన కౌతాళానికి 14 కి.మీ. దూరంలో హాల్వి గ్రామం ఉంది. కొండ అంచున ఈశాన్య దిశగా గ్రామం ఏర్పడింది. ప్రస్తుతం గ్రామ జనాభా 5,114 ఉండగా స్త్రీలు 2,613, పురుషులు 2,501 ఉన్నారు. ఓటర్లు 3,314 కాగా స్త్రీలు 1,705, పురుషులు 1,609. గ్రామంలో 5,789 హెక్టార్ల సాగుభూమి ఉంది. ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. పూర్వం హాల్వి ఏడు గ్రామాలు కలిసి ఏర్పడిందని అక్కడ ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. కోట, పేట, నంతాపుర, సిద్దాపురం, హాల్వి, కొరవ దుద్ది, నాగలాపురం గ్రామాలు ఏకమై హాల్వి గ్రామంగా ఏర్పడినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఏడేసి బావులు, బొడ్రాయిలు, గ్రామ చావిడిలు, ఆంజనేయస్వామి ఆలయాలు, పీర్ల మసీదులు నిలిచాయి. రామక్కమ్మ, కోనపుర, ఈర, కోటల, రెడ్డి, పక్కీరు, సిద్దేశ్వర పేర్లపై ఏడు బావులు ఉన్నాయి. మూడు తరాల క్రితమే ఈ ఊళ్లు హాల్విలో భాగమై పోయాయని పెద్దలు చెబుతున్నారు. పూర్వం కొండ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్న ఓ ముని భార్య ఆలియా పేరు మీదనే హాల్వి ఏర్పడిందని కథనం ప్రాచుర్యంలో ఉంది. ‘భావి’తరాలకు సాక్ష్యంగా.. గ్రామంలో బ్రాహ్మణ కులానికి చెందిన దేశాయ్ వంశీకులకు ప్రత్యేకత ఉంది. నేటికీ గ్రామంలో జాతర జరిగితే ఆ ఇంటి అరుగుపై సిద్ధేశ్వరస్వామి పల్లకీ పూజలు నిర్వహించిన తర్వాతనే వేడుకకు అంకురార్పణ పలుకుతారు. దేశాయ్ వంశీకులు అప్పట్లో గ్రామంలో దాహం తీర్చేందుకు బావులు తవ్వించినట్లు తెలుస్తోంది. వారి సేవలను గుర్తించి అప్పటి ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్.. దేశాయ్ బిరుదు ఇచ్చినట్లు ఆ వంశీకుడు శ్రీపాద దేశాయ్ చెబుతున్నారు. గ్రామంలో కోనపుర, ఈర, కోటల బావులు వారు నిర్మించినవే. బావుల తవ్వకాలు, కట్టడం అద్భుతంగా ఉంటుంది. దేశాయ్ ఇంటిని ఆనుకుని ఈశాన్య దిశలో కోటల బావి, ఊరి తూర్పు దిక్కున ఈర బావి.. ఆదోనిలోని వెంకన్న బావి తరహాలో నిర్మించారు. శిల్ప కళ ఉట్టిపడుతుంది. సింహాలు, తోరణాలు, దేవతామూర్తుల ఆకృతులు బావుల చుట్టూ ఆకట్టుకుంటున్నాయి. ఆగ్నేయ దిశలో ఉన్న రామక్కమ్మ బావి చాలా ఏళ్లు గ్రామస్తులు దాహం తీర్చింది. చెక్కు చెదరని ‘కోట’.. సమీపంలోని కొండ పైభాగంలో పూర్వం కోట నిర్మించారు. కోటలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. బ్రిటీష్ కాలంలో కోటలోనే ఊరు ఉండేదని, ఊరు పేరు సైతం కోటగా పిలువ బడేదని తెలుస్తోంది. ఊరి కంతా ఒకటే గ్రామ వాకిలి ఉన్నట్లు ఆనవాళ్లు తెలుస్తున్నాయి. నేటికీ రాతి కోట పదిలంగా ఉంది. కాలానుగుణంగా అక్కడ ఉన్న కోట వాసులు కొండ కిందకు తరలివచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. ఐక్యతకు నిలయం మా ఊరు ఐక్యతకు నిలయం. ఏడు గ్రామాలు కలిసి హాల్విగా ఏర్పడిందని మా పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ అందరూ కలిసిమెలసి ఉంటారు. ఊర్లో బొడ్రాయిలు, గ్రామ చావిడిలు, ఆంజనేయస్వామి ఆలయాలు, బావులు, పీర్ల మసీదులు ఏడేసి ఉన్నాయి. ఇవే నాటి గ్రామాలకు ఆనవాళ్లుగా నిలిచాయి. – లింగన్న, హాల్వి ప్రత్యేకతల నెలవు గ్రామంలో చూడ చక్కని ప్రదేశాలు చాలా ఉన్నాయి. సిద్ధేశ్వరస్వామి ఆలయంతో పాటు శిల్ప కళ ఉట్టిపడే బావులు ఉన్నాయి. ఈర బావి చూడ ముచ్చటగా ఉంటుంది. ఇప్పట్లో ఇలాంటి బావులు కట్టడం సాధ్యం కాదు. అప్పట్లో ఈర బావి చుట్టూ సాయంత్రం వరకు మహిళలు దుస్తులు ఉతుకుతూ ఉండేవారు. రెండు మోటార్ల ద్వారా ఈ బావి నీటిని పొలాలకు పెట్టే వాళ్లు. – హనుమంతు, హాల్వి -
కళ్లల్లో కారం చల్లి.. ఇనుప రాడ్‌తో కొట్టి
పరిగి: అనంతపురం జిల్లా గొరవనహళ్లికి చెందిన ఇద్దరు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పరిగి ఎస్ఐ శ్రీనివాసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గొరవనహళ్లికి చెందిన దాసరి నక్కల వెంకటస్వామి కుమారుడు దాసరి మురళి(32) ఆటో నడుపుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నాడు. వరుసకు మామ అయిన దాసరి ఈశ్వరప్ప(52)తో కలిసి సోమవారం సాయంత్రం కర్ణాటక ప్రాంతం విట్లాపురానికి వెళ్లి మద్యం సేవించి స్వగ్రామానికి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై తిరుగు పయనమయ్యారు. రాత్రి సమయంలో మోదా గ్రామం దాటిన తరువాత.. అప్పటికే గ్రామ శివారులో పొంచి ఉన్న కొందరు దుండగులు వీరి ద్విచక్రవాహనాన్ని అడ్డగించారు. కళ్లల్లో కారంపొడి చల్లి ఇనుపరాడ్డుతో ఇద్దరిపై దాడి చేశారు. తలలపై బాదడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఎలాంటి ఆధారాలు చిక్కకుండా చనిపోయిన ప్రాంతంలో మృతదేహాలపై, ఈడ్చుకెళ్లిన ప్రదేశం అంతటా కారంపొడి చల్లి దుండగులు పరారయ్యారు. ఉదయం మృతదేహాలను కనుగొన్న స్థానికులు.. మంగళవారం ఉదయం ఆనందపాళ్యం గ్రామ రైతు పొలంలో రెండు మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పరిగి పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ ధరణి కిషోర్, ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. డీఎస్పీ మహబూబ్ బాష నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మహబూబ్‌నగర్–రాయచూరు హైవేపై కొత్త వంతెన
కృష్ణా నదిపై కర్ణాటక సరిహద్దులో నిర్మాణం - రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే మొదలు - బ్రిడ్జి బాధ్యతలు కర్ణాటకకు అప్పగించిన కేంద్రం - నిజాం కాలం నాటి వంతెన కూల్చివేత..! సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణ–కర్ణాటకను అనుసంధానం చేస్తూ కొత్త వంతెన రూపుదిద్దుకోనుంది. మహబూబ్‌నగర్–రాయచూరు హైవేపై కృష్ణా మండలం చివరన వాసు నగర్ వద్ద రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు వరసలతో భారీ వంతెన నిర్మాణం జరగనుంది. 167వ నంబరు జాతీయ రహదారిపై ప్రస్తుతం ఉన్న వంతెన ఇరుకుగా మారటంతో దాన్ని తొలగించి కొత్తగా నాలుగు వరసలతో వంతెన నిర్మించనున్నారు. దాదాపు 87 ఏళ్ల క్రితం నిజాం జమానాలో రూపుదిద్దుకున్న ఈ వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. భారీ వాహనాల ధాటికి బాగా దెబ్బతింటోంది. దీంతో ఇటీవలే జాతీయ రహదారుల విభాగం దాదాపు రూ.4.7 కోట్లు వెచ్చించి తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసింది. ఇప్పుడు జడ్చర్ల నుంచి మంత్రాలయం వరకు ఈ రోడ్డును నాలుగు వరసలుగా విస్తరిస్తుండటంతో కొత్త వంతెన నిర్మించాలని జాతీయ రహదారుల విభాగం నిర్ణయించింది. తెలంగాణ వైపు రోడ్డు విస్తరణను తెలంగాణ జాతీయ రహదారుల విభాగం, కర్ణాటక వైపు ఆ రాష్ట్ర విభాగం పర్యవేక్షిస్తుండగా, పొత్తులో ఉన్న ఈ వంతెన నిర్మాణ బాధ్యతను కేంద్ర జాతీయ రహదారుల విభాగం కర్ణాటకకు అప్పగించింది. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో దాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త జాతీయ రహదారి ఏర్పాటుతో.. మహబూబ్‌నగర్–రాయచూరు 167వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పని మొదలైంది. జడ్చర్ల వరకే నాలుగు వరసలుగా ఉన్న ఈ రహదారి, అక్కడి నుంచి రాయచూరు వరకు మూడు వరసలుగా ఉంది. ఇందులో కొంతభాగమే జాతీయ రహదారిగా ఉండటంతో మిగతా రోడ్డు విస్తరణ జరగలేదు. గతేడాది మిగతా రోడ్డుకు కూడా జాతీయ రహదారి అర్హత రావటంతో ఇప్పు డు దాన్ని విస్తరించే పని ప్రారంభించారు. జడ్చర్ల నుంచి కర్ణాటక సరిహద్దు వరకు తెలంగాణ జాతీయ రహదారుల విభాగం రోడ్డు రెండు వైపులా 5 మీటర్లు చొప్పున విస్తరిస్తోంది. జడ్చర్ల నుంచి లాల్కోట వరకు మొదటి విడత పనులు జరగ్గా, అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రెండొ విడత పనులు మొదలయ్యాయి. ఈ రోడ్డులో భాగంగానే వంతెనను నిర్మిస్తారు. తొలుత పాత వంతెనను అలాగే ఉంచి దానికి అనుబంధంగా రెండు వరసలతో కొత్త వంతెనను నిర్మించాలని భావించారు. కానీ ఉన్న వంతెన బాగా పాతబడి పెచ్చులూడుతున్నాయి. దీంతో పెద్ద వాహనాల ధాటికి ఎక్కువ కాలం ఉండదని భావించిన అధికారులు మొత్తం నాలుగు వరసలు కొత్తదే ఉండాలని తేల్చారు. ఈ నేపథ్యంలో పాత వంతెనను కూల్చి కొత్తది నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు పాత వంతెన నిజాం కాలం నాటిది కావడంతో దాన్ని అలాగే ఉంచి, పర్యాటక ప్రాంతంగా మార్చాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరుకు నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కర్ణాటక సరిహద్దుల్లో ఘాతుకం
వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలం సమీపంలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఓ యువతిని దుండగులు కాల్చి చంపారు. హత్య చేసి కాల్చిచంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వి.కోట మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని సీతంపల్లి గ్రామ శివార్లలో ఈ ఘాతుకం జరిగింది. నెల క్రితం కూడా ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు ఇదే ప్రాంతంలో గొంతుకోసి హత్య చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వీడని గ్రహణం!
‘కాగ్నా’పై వంతెన నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం నాలుగేళ్ల క్రితం అసంపూర్తి దశలో నిలిచిపోయిన పనులు రూ.10 కోట్లు మంజూరు చేసిన ప్రస్తుత సర్కారు దిక్కూదివాణం లేని టెండర్ల ప్రక్రియ ఇరవై గ్రామాల ప్రజలకు తీరని కష్టాలు తాండూరు: కర్ణాటక సరిహద్దు బషీరాబాద్ మండలం జీవన్గీ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. సరిహద్దులో అంతర్రాష్ట్ర రహదారితో లింకు ఏర్పడే ఈ బ్రిడ్జి నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. ఏలికల చిన్నచూపుతో ఇరవై గ్రామా ల ప్రజల రాకపోకల కష్టాలు తీరని పరిస్థితి నెలకొంది. గతంలో అరకొర పనులు చేసిన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చందమే అయ్యాయి. జీవన్గీ గ్రా మంలో కాగ్నా నదిపై ఈ వంతెన నిర్మించాల్సి ఉంది. సరిహద్దులోని కర్ణాటకతో పాటు తాండూరుకు రాకపోకలు సుగమమవుతాయి. అప్పటి మంత్రి ఇంద్రారెడ్డి హ యాంలో ఇక్కడ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కానీ పునాదుల దశలోనే పనులు ఆగిపోయాయి. నాలుగేళ్ల క్రితం పనులు చేపట్టినా అసంపూర్తిగా వదిలేశారు. తాజాగా తెలంగాణ సర్కారుకు ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. కానీ టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. ఫలితంగా బ్రిడ్జి పనులకు మోక్షం కలగటం లేదు. 12 కి.మీ. దూరం తగ్గుతుంది.. బషీరాబాద్ నుంచి తాండూరుకు 30 కి.మీ.దూరం. జీవన్గీ వద్ద వంతెన నిర్మాణంతో కరన్‌కోట మీదుగా తాండూరుకు 18 కి.మీ. దూరం.దీంతో 12 కి.మీ. దూరం తగ్గుతుంది. బషీరాబాద్ నుంచి జీవన్గీతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరన్‌కోట్ మీదుగా కర్ణాటక పరిధిలోని చించొళి, గుల్బర్గా, సులేపేట్, ఉమ్మాబాద్ ప్రాంతాల రాకపోకలకు సులవుతుంది. లేనిపక్షంలో తాండూరుకు చేరుకొని ఆయా గ్రామాలకు వెళ్లడం దూరం పెరగటంతోపాటు సమయాభావం పడుతుంది. తాండూరు మండలంలో నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సిమెంట్ ఉత్పత్తుల లారీలు పెద్ద సంఖ్యలో కర్ణాటకు వెళ్తుంటాయి. ప్రస్తుతం వాహనాల రాకపోకలు ఇలా.. తాండూరు మండలంలోని నాలుగు సిమెంట్ కర్మాగారాల నుంచి సిమెంట్ లోడ్ లారీలు గౌతాపూర్, తాండూరు మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌కు చేరుకొని అక్కడి నుంచి కర్ణాటకు వెళుతుంటాయి. లారీలు తాండూరులోకి ప్రవేశించడం వల్ల ట్రాఫిక్ చిక్కులు ఉత్పన్నమవుతున్నాయి. రూ.60లక్షలు వృథా! సుమారు నాలుగేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. పిల్లర్ల వరకు పనులు చేపట్టారు. దాదాపు రూ.60 లక్షల పనులు జరిగాయి. ఆ తర్వాత కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. తెలంగాణ సర్కారు ఏర్పడిన అనంతరం అధికారులు కొత్త అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించారు. సాంకేతిక అనుమతులు వస్తేనే.. జీవన్గీలో వంతెన నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరయ్యాయి. కాగ్నా నదిలో 250 మీటర్ల పొడవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.6కోట్లు, బషీరాబాద్ వైపు 2 కి.మీ.,కరన్‌కోట్ వైపు 2.5కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. సాంకేతిక అనుమతి ఉత్వర్వులు వస్తే టెండర్లు నిర్వహించి పనులు మొదలుపెడతాం. - జానకిరాములు, ఆర్అండ్బీ, డీఈఈ -
సరిహద్దులో తనిఖీలు చేయండి
బంట్వారం: కర్ణాటక సరిహద్దులోని తొర్మామిడి శివారులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పీ రాజకుమారి పోలీసులకు సూచించారు. శుక్రవారం ఆమె బంట్వారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెండింగ్ రికార్డులను, ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి విలేకరులతో మాట్లాడారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే పీఎస్‌ను సందర్శించినట్లు తెలిపారు. బంట్వారం ఠాణా పరిధిలో 2012లో 86 కేసులు నమోదవగా 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతేడాది 109 కేసులకు గాను 11 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈఏడాది ఇప్పటివరకు 92 కేసులు నమోదవగా 32 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. 22 కేసులు లోక్‌అదాలత్‌లో పరిష్కారమయ్యాయని తెలిపారు. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉన్న తొర్మామిడి శివారులో మఫ్టీలో నిత్యం వాహనాల తనిఖీలు చేయాలని ఎస్పీ ఈసందర్భంగా మోమిన్‌పేట సీఐ రంగాను ఆదేశించారు. వాహనాల తనిఖీలతో చోరీలను నివారించవచ్చని చెప్పారు. గతేడాదితో పోలిస్తే బంట్వారం పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాలు, ఆత్మహత్యలు, రోడ్డుప్రమాదాలు తగ్గిపోయాయని ఆమె వివరించారు. రాంపూర్, తొర్మామిడి, మోత్కుపల్లి, బార్వాద్ తదితర గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీకి సంబంధించి 4 కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయని తెలిపారు. ఓ గ్యాంగ్ ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్నట్లు తాము గుర్తించామని ఎస్పీ రాజకుమారి చెప్పారు. సదరు గ్యాంగ్ ఆట కట్టించేందుకు ఓ పోలీస్ బృందం దర్యాప్తు చేస్తోందన్నారు. సిబ్బంది కొరతతో కొంత ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్‌లో మంచి నీటి సమస్య ఉన్నట్లు గుర్తించామని ఆమె అన్నారు. బోరు వేయడానికి కావల్సిన బడ్జెట్ కోసం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఎస్పీ వివరించారు. స్థానిక సిబ్బంది పనితీరుపై బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎస్పీ రాజకుమారి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీఎస్పీ స్వామి, సీఐ రంగా, స్థానిక ఎస్ఐ రవీందర్ సిబ్బంది ఉన్నారు. -
కర్ణాటక సరిహద్దులో.. కలగా మారిన జీవన్గి బ్రిడ్జి!
తాండూరు: కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలం జీవన్గిలో బ్రిడ్జి నిర్మాణం కలగానే మారింది. ఏళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి చేస్తున్న ప్రతిపాదనలు బుట్టదాఖలవుతూనే ఉన్నాయి. దీంతో బషీరాబాద్ మండలంలోని సుమారు ఇరవై గ్రామాల ప్రజల నిరీక్షణ ఫలించడం లేదు. రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రారెడ్డి హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అప్పట్లో శంకుస్థాపన జరిగింది. పనులు పునాది దశలోనే ఆగిపోయాయి. పదేళ్ల క్రితం మరోసారి పనులు మొదలుపెట్టినా అంతలోనే ఆపేశారు. తాజాగా ఆర్అండ్బీ అధికారులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి మళ్లీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడంతో స్థానకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దూరం తగ్గుతుంది బషీరాబాద్ నుంచి తాండూరుకు రావడానికి సుమారు 30 కి.మీ.దూరం అవుతుంది. అయితే ఈ బ్రిడ్జి నిర్మిస్తే జీవన్గీ నుంచి కరన్‌కోట మీదుగా తాండూరుకు వచ్చే అవకాశం ఉండటంతో 12 కి.మీ. దూరం తగ్గుతుంది. బషీరాబాద్ నుంచి జీవన్గీతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరన్‌కోట్ మీదుగా కర్ణాటకలోని సులేపేట్, చించొళి, గుల్బర్గా, ఉమ్మాబాద్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఆ గ్రామాల ప్రజలు తాండూరుకు వచ్చి కర్ణాటకలోని గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. కరన్‌కోట్ నుంచి సేడం హైవేకు... తాండూరు మండలంలో నాలుగు సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. ఆయా సిమెంట్ కర్మాగారాల నుంచి సిమెంట్ ఉత్పత్తుల లారీలు పెద్ద సంఖ్యలో కర్ణాటకు వెళుతుంటాయి. ఈ బ్రిడ్జి అందుబాటోకి వస్తే ఈ లారీల రాకపోకలకు కూడా దూరం కలిసొచ్చే అవకాశం ఉంది. కర్ణాటకకు వెళ్లే సిమెంట్ లారీలన్నీ గౌతాపూర్, తాండూరు మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మీదుగా కర్ణాటకు వెళుతుంటాయి. భారీ వాహనాలు తాండూరులోకి ప్రవేశించడం వల్ల ట్రాఫిక్ సమస్యలూ తలెత్తుతున్నాయి. కాగ్నాపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే సిమెంట్ లారీలు తాండూరులోకి ప్రవేశించకుండానే నేరుగా కరన్‌కోట్ నుంచి జీవన్గీ, మైల్వార్, ఆడ్కి మీదుగా కర్ణాటకలోని సేడం హైవేకు వెళ్లొచ్చు. దీనివల్ల దూరం తగ్గుతుంది. సరిహద్దులో అంతరాష్ట్ర రవాదారితో లింకు ఏర్పడే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇటీవల తాండూరు ఆర్‌అంబీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి కూడా ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు. మరి ఈసారైనా బ్రిడ్జి నిర్మాణానికి నోచుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే. రూ.6 కోట్లతో ప్రతిపాదనలు: డీఈఈ జానకిరాములు జీవన్గీలో కాగ్నా నది(వాగు)పై బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవలనే రూ.6కోట్లతో ప్రతిపాదనలు పంపించామని డీఈఈ జానకీరాములు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. -
జయకు మద్దతుగా 90 కిలోమీటర్ల మానవహారం
సిఫ్‌కాట్/ హొసూరు/ క్రిష్ణగిరి:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం హొసూరు పారిశ్రామికవాడ సమీపంలోని కర్ణాటక సరిహద్దు అత్తిపల్లి నుంచి బర్గూరు వరకు సుమారు 90 కిలోమీటర్లు మానవహారం నిర్వహించారు. అత్తిపల్లి వద్ద హొసూరు మున్సిపాలిటి 1వ వార్డు కౌన్సిలర్ అశోక్‌కుమార్ అధ్యక్షతన అన్నా కార్మిక సంఘ అధ్యక్షుడు మాదేవ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు దర్గావరకు మానవహారం నిర్వహించారు. జయలలితను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు త్యాగరాజరెడ్డి, నందకుమార్, నాయకులు లజపతిరెడ్డి, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హొసూరులో... : జయలలితను జైలు శిక్ష నుంచి విముక్తి కలిగించాలని మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో బాగలూరు రోడ్డు నుంచి రెండో సిఫ్‌కాట్ వరకు జాతీయ రహదారిలో మానవహారం నిర్వహించారు. అన్నాడీఎంకే నాయకులు వైస్ చైర్మన్ రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ నంజుండస్వామి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. సూళగిరిలో... సూళగిరిలో అన్నాడీఎంకే చైర్మన్ హేమనాథ్ (మధు ) నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. అదేవిధంగా స్వరకాయపల్లి గ్రామానికి చెందిన తిమ్మరాజు (22), కళావతి(19)లకు ఆదివారం ఉదయం సూళగిరిలోని చెన్నరాయశెట్టి కల్యాణ మంటపంలో వివాహం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులు కూడా మానవహారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకరన్, కార్యదర్శి తాయప్ప, రాఘవ న్, కుమార్, నాగరాజు, పార్టీ కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. క్రిష్ణగిరిలో... : క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో క్రిష్ణగిరి ఎంపి అశోక్‌కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కర్ణాటక సరిహద్దులో విషాదం
కేఎస్ ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీ 14 మంది మృతి, నలుగురి పరిస్థితి విషమం కోలారు, బెంగళూరు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు మృతుల్లో ఆంధ్ర, కర్ణాటకవాసులు పలమనేరు: పలమనేరు సమీపంలోని కర్ణాటక సరిహద్దులో సోమవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ముల్బాగల్ సమీపంలోని కప్పలమడుగు, శ్రీరంగపురం గ్రామాల సమీపంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై కేఎస్ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొన్న ఘటనలో 14 మంది మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురి మృతదేహాలు చెల్లాచెదురై గుర్తు పట్టలేని విధంగా మారాయి. మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం దద్దరిల్లింది. మృతుల్లో ఆంధ్ర, కర్ణాటకవాసులు.. మృతుల్లో కోలారు జిల్లా గద్దేకల్లూరుకు చెందిన నా గేష్, బెంగళూరు కోడిహళ్లికి చెందిన నాగమణి, బెంగళూరు సిటీకి చెందిన నారాయణమ్మ, తుమ్కూరుకు చెందిన బస్సుడ్రైవర్ గంగాధరయ్య, ముల్బాగల్కు చెందిన విజయమ్మ, బెంగళూరుకు చెందిన భారతి బ్రహ్మచారి, కర్ణాటకకు చెందిన నితీష్‌కుమార్(2), ఆంధ్రాకు చెందిన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లె మండలం చిక్కనపల్లెకు చెందిన రాజశేఖర్, పలమనేరు పట్టణానికి చెందిన లిఖిత్‌కుమార్ (3), శాంతాభాయి(55), తిరుపతికి చెందిన పార్వతమ్మ ఉన్నారు. మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. పలు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు.. ఈ ప్రమాదంలో గాయపడిన 13 మందిని ముల్బాగల్, కోలార్, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో బెంగళూరుకు చెందిన సోమశేఖర్, తుంకూరుకు చెందిన కేఎస్ఆర్టీసీ కండక్టర్ నరసింహరాజు, గౌరీబీదునూర్కు చెందిన లక్ష్మీపతి, సుబ్రమణ్యమాచారి, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం.. బెంగళూరు వైపు వేగంగా వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు వాహనాలు వేగంగా ఢీకొనడంతోనే ఇంత ఘోరం జరిగిందని తెలుస్తోంది. సింగిల్ రోడ్డుపై వస్తున్న బస్సు కుడివైపు పూర్తిగా దూసుకుపోయేలా లారీ ఢీకొంది. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు.. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే డె ప్యూటీ కమిషనర్ రవి, కోలారు జిల్లా ఎస్పీ అజయ్ విలోరి, డీఎస్పీ సిద్ధ్దేశ్వర్, సీఐ కృష్ణప్ప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ప్ప, నంగిలి ఎస్ఐ అంబరేష్ గౌడ, ముల్బాగల్ ఎమ్మెల్యే మంజునాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్, పీడబ్ల్యూడీ విభాగానికి చెందిన పలువురు అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మృతుల కుటుంబాలకు కేఎస్ఆర్టీసీ రూ.2.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.