
బెంగళూరు: తల్లి చనిపోయిందనే బాధ కూడా వారికి లేదు. తమ వాటా డబ్బు ఇస్తేనే అంత్యక్రియలకు అంగీకరిస్తామని కర్కోటక కుమారులు అమానుషంగా వ్యవహరించారు. దీంతో మృతురాలి కుమార్తెల బిడ్డలు తమ అవ్వ మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తహసీల్దార్ జోక్యంతో అంత్యక్రియలు జరిగాయి. ఈ ఉదంతం చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరు తాలూకాలోని దొడ్డకురుగోడులో జరిగింది. గ్రామానికి చెందిన అనంతక్కకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
భర్త మృతితో అనంతక్క మధుగిరి తాలూకా కడగత్తూరులో ఉన్న కుమార్తెల వద్ద ఉంటోంది. భర్తద్వారా ఆమెకు సంక్రమించిన భూమిని ప్రభుత్వం పరిశ్రమల కోసం సేకరించి రూ.93 లక్షలు అందజేసింది. ఆ మొత్తంలో 40 లక్షలు కుమార్తెలు తీసుకున్నారు. ఈక్రమంలో వృద్ధాప్యం కారణంగా అనంతక్క మంగళవారం తన కుమార్తె ఇంటిలోనే మృతి చెందింది. భర్త సమాధి పక్కనే తనను ఖననం చేయాలని అనంతక్క గతంలోనే కుమార్తెకు తెలియజేసింది.
దీంతో మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకురాగా కుమారులు అడ్డుకున్నారు. తల్లి నుంచి కుమార్తెలు తీసుకున్న రూ.40లక్షలు తిరిగి ఇస్తేనే అంత్యక్రియలకు సహకరిస్తామని మొండికేశారు. దీంతో అనంతక్క మృతదేహాన్ని కుమార్తెలు, మనువరాండ్రు పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. రాత్రంతా మృతదేహం అక్కడే ఉంది. బుధవారం ఉదయం తహసీల్దార్ మహేపత్రి స్పందించి అనంతక్క కుమారులను పిలిపించి సర్ది చెప్పారు. అనంతరం మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment