
వైఎస్సార్‌సీపీ నాయకులు పాపిరెడ్డిపల్లికి వెళ్లకుండా ఎన్‌ఎస్ గేట్ వద్ద మోహరించిన పోలీసులు
నివాళులర్పించేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
హత్య చేయించి.. పరామర్శకు వస్తారా? అంటూ టీడీపీ ఎంపీ
బీకే పార్థసారథిపై లింగమయ్య కుమారుడు ఆగ్రహం
సాక్షి, పుట్టపర్తి/రామగిరి: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో దారుణహత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య (58) అంత్యక్రియలను పోలీసుల ఆంక్షల నడుమ ఆయన స్వగ్రామంలో సోమవారం నిర్వహించారు. పాపిరెడ్డిపల్లిలో స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు రమేష్, సురేష్, వారి కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే.
సోమవారం అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో లింగమయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు, కురుబ సంఘం నాయకులు ఆస్పత్రి వద్దకు వెళ్లి లింగమయ్య మృతదేహానికి నివాళులర్పించారు.
పోలీసు బందోబస్తుతో మృతదేహం తరలింపు
పోస్టుమార్టం అనంతరం లింగమయ్య మృతదేహాన్ని పోలీస్ బందోబస్తు మధ్య ఆయన స్వగ్రామం పాపిరెడ్డిపల్లికి తరలించారు. అనంతపురం నుంచి రామగిరి వెళ్లే మార్గంలోని రాప్తాడు, ఎన్‌ఎస్ గేట్, చెన్నేకొత్తపల్లి సర్కిళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. మృతుడి కుటుంబ సభ్యులను మాత్రమే పాపిరెడ్డిపల్లికి వెళ్లేలా అనుమతించారు.
లింగమయ్య మృతదేహం గ్రామానికి చేరిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని వెంటనే శ్మశానవాటికకు తరలింపజేశారు. మృతుడి భార్య రామాంజినమ్మ, కుమారులు మనోహర్, శ్రీనివాసులు, వారి కుటుంబ సభ్యుల చేత అంత్యక్రియలు త్వరత్వరగా పూర్తి చేయించారు.
వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అనంతపురంలోని ఆయన ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిని శ్రీ సత్యసాయి జిల్లాలోకి రాకుండా పోలీసులు కాపు కాశారు. దీంతో కేవలం మృతుడి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచి్చంది.
హత్య చేయించి.. పరామర్శకు వస్తారా?
టీడీపీ ఎంపీ బీకే పార్థసారథిపై కురుబ లింగమయ్య తనయుడు మనోహర్ ఆగ్రహం
‘పరిటాల సునీత మా నాన్నను హత్య చేయించారు. మీ (టీడీపీ) పార్టీ వాళ్లే హత్య చేయిస్తే... ఖండించకుండా పరామర్శకు ఎలా వస్తారు?’ అని హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథిని కురుబ లింగమయ్య కుమారుడు మనోహర్ నిలదీశారు. కురుబ లింగమయ్య మృతదేహాన్ని సోమవారం అనంతపురం నుంచి పాపిరెడ్డిపల్లికి తీసుకువెళుతుండగా మార్గంమధ్యలో ఎంపీ బీకే పార్థసారథి పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రిని హత్య చేసిన, చేయించిన టీడీపీలో ఉన్న పార్థసారథి తమను పరామర్శించేందుకు ఎలా వస్తారని మనోహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పరిటాల సునీత నుంచి మాకు హాని ఉంది
మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కురుబ మనోహర్ కోరారు. బీసీ కులాలకు చెందిన వారెవరూ రాజకీయంగా ఎదగకూడదన్న ఉద్దేశంతో పరిటాల కుటుంబం ఉందని చెప్పారు. అందువల్లే వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్న తమతో పరిటాల బంధువులు లేనిపోని గొడవలకు దిగి.. తన తండ్రిని హత్య చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.