
కోరుట్లరూరల్: ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా.. ఎక్కడి నుంచో వచ్చిన శునకం అతడి శవయాత్రలో నడిచి వచ్చి చితిపక్కన పడుకొని ఏడ్చింది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత బంధువులతో కలిసి ఇంటికి చేరుకుని అక్కడ కూడా ఏడ్వడం ఆ గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని యెఖీన్‌పూర్‌కు చెందిన గాంధారి కిశోర్ (42) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు.
అప్పటివరకూ గ్రామంలో కనిపించని ఓ శునకం అకస్మాత్తుగా కిశోర్ శవయాత్రలో దారిపొడువునా నడిచింది. అతడి చితిపక్కన పడుకొని కొద్దిసేపు ఏడ్చింది. అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి వరకు వెళ్లి కిశోర్ మృతదేహాన్ని ఉంచిన స్థలం వద్ద పడుకొని ఏడ్వటం ఆశ్చర్యానికి గురి చేసింది. కిశోర్ 14ఏళ్ల వయసులో అతడి తండ్రి మృతి చెందాడు. ఇప్పుడు కిశోర్ కుమారుడికి కూడా 14 ఏళ్లే. కిశోర్ తండ్రి హన్మాండ్లు ఆత్మ శునకం రూపంలో వచ్చి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకున్నారు.