కలసిసాగారు... నీరు పారించారు... | Farmers Clean crop Canal In Vizianagaram District | Sakshi
Sakshi News home page

కలసిసాగారు... నీరు పారించారు...

Published Mon, Aug 19 2019 10:16 AM | Last Updated on Mon, Aug 19 2019 10:43 AM

Farmers Clean crop Canal In Vizianagaram District - Sakshi

కాలువలు శుభ్రంగా ఉంటేనే పంట పొలాలకు సాగునీరందేది. ఏటా వాటి నిర్వహణ కోసం కొంత బడ్జెట్‌ కేటాయించడం పరిపాటి. ఆ నిధులు వెచ్చిస్తున్నట్టు రికార్డుల్లో కనిపిస్తున్నాయి. కానీ వెంగళరాయ సాగర్‌ పరిధిలోని 12 ఎల్, 10 ఆర్‌ కాలువల దుస్థితి మాత్రం అసలు వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. కాలువలన్నీ తుప్పలతో పూడుకుపోయాయి. సాగునీరు సక్రమంగా అందక 2500 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. చేసేది లేక నాలుగేళ్లుగా అక్కడి రైతులే వాటిని శ్రమదానంతో శుభ్రపరచుకుని నీరు పారించుకుంటున్నారు.

మక్కువ: వెంగళరాయసాగర్‌ ప్రాజెక్ట్‌ కాలువల ఆధునికీకరణకు కోట్లాది రూపాయిలు ఖర్చుచేశామని గత పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. కానీ శివారు గ్రామాల ప్రజలకు మాత్రం సాగు నీటి కష్టాలు తీరలేదు. గడచిన నాలుగేళ్లు ఈ కాలువలను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో మక్కువ మండలంలోని వెంక ట భైరిపురం గ్రామానికి చెందిన రైతులు గ్రామంలో కమీషన్‌ పాట(ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు అందించాల్సిన సొమ్ము) ద్వారా కొంతమొత్తం, రైతులు చందాలు ఎత్తుకొని మరికొంత వెచ్చించి, ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తొలగించుకొని పంటలు సాగుచేసుకుంటున్నారు.

9 గ్రామాలకు అందని సాగునీరు...
వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పరిధిలోని 12ఎల్‌ కాలువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట, మేళాపువలస, ములక్కాయవలస, పాపయ్యవలస, కాశీపట్నం, వెంకటభైరిపురం, కొయ్యానపేట, కొండరేజేరు గ్రామాల రైతులకు చెందిన సుమారు 2500 ఎకరాలున్నాయి. నాలుగేళ్లనుంచి కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో ఈ కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా కావడంలేదు. కాలువల్లో తూటికాడలు, నాచు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి నీరు పారడంలేదు. మండలంలోని కాశీపట్నం గ్రామం సమీపంలోని 10ఆర్‌ కాలువ వద్ద గతంలో ఏర్పాటుచేసిన మదుము, యూటీ శిథిలావస్థకు చేరుకోవడంతో కాలువ మధ్యలో పెద్దగొయ్యి ఏర్పడి నీరు పంటపొలాల మీదుగా సీతానగరం మండలం తామరఖండి గెడ్డలోకి వృథాగా పోతోంది. దిగువనున్న పాపయ్యవలస, కొయ్యానపేట, కొండరేజేరు, వెంకటభైరిపురం గ్రామాల పరిధిలోని కాలువలకు సాగునీరు అందట్లేదు. అయినా వాటిని చక్కదిద్దేందుకు ఇరిగేషన్‌ అధికారులు చొరవ చూపలేదు.

శ్రమదానంతో కాలువల నిర్వహణ..
అధికారులు కాలువల నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో రైతులు శ్రమదానంతో ఈ నెల 14వ తేదీ నుంచి కొండరేజేరు గ్రామానికి చెందిన రైతులు కన్నంపేట గ్రామం నుంచి కొండరేజేరు వరకు కాలువలో ఉన్న పూడికలను తొలగించుకున్నారు. కొయ్యానపేట గ్రామానికి చెందిన రైతులు 12ఎల్, ఆర్‌ కాలువలో పేరుకుపోయిన పూడికలను మూడురోజులపాటు తొలగించుకొని పంటపొలాలకు సాగునీరు సమకూర్చుకుంటున్నారు. శనివారం వెంకటభైరిపురం గ్రామానికి చెందిన సుమారు 150మంది పురుషులు, మహిళలు కలసికట్టుగా కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, తూటికాడలు తొలగిస్తున్నారు. సుమారు 7కిలోమీటర్ల పొడవునా తుప్పలు తొలగిస్తున్నారు. వెంకటభైరిపురం గ్రామానికి చెందిన రైతులు ఏటా రూ. లక్ష వరకు వెచ్చించి, కాలువలు నిర్వహించుకుంటున్నారు. ఎల్‌బీసీ పరిధిలోని 12ఎల్‌ కాలువ మొత్తం పూడికలతో నిండిపోవడంతో సరాయివలస, కొండబుచ్చమ్మపేట గ్రామాలకు చెందిన పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో, చందాలు ఎత్తుకొని పూడికలు తొలగించుకునేందుకు సమాయత్తమవుతున్నారు.

అదును దాటిపోతున్నా... జరగని ఉభాలు..
శివారు గ్రామాలైన వెంకటభైరిపురం, కొండరేజేరు, కొయ్యానపేట, సరాయివలస, గోపాలపురం గ్రామాల పంటపొలాలకు కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్‌సీజన్‌ సగం పూర్తయినా పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఉభాలు జరిపించలేకపోతున్నారు. దీనివల్ల నారుమడులు ముదిరిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా కాలువలు శుభ్రం చేసి నీటిని సమకూర్చుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిందే.

సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం..
నాలుగేళ్లుగా కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో సాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నాం. ఏటా రైతులు చందాలు ఎత్తుకొని, కాలువల్లో పూడికలు తొలగించుకుంటున్నాం. ఏటా ఖరీ ఫ్‌ సీజన్‌ ముగిసిన సమయంలో ఉభాలు జరి పిస్తుండటంతో దిగుబడులు రావడం లేదు. సాగు చేసినప్పటికి వచ్చిన దిగుబడులు పెట్టుబడులకే సరిపోతున్నాయి. ఏటా మేమే కాలు వ శుభ్రపరచుకుంటున్నా... ఇరిగేషన్‌ అధికా రులు పట్టించుకోవడం లేదు. 
– రెడ్డి శ్రీరాము, వెంకటభైరిపురం, రైతు 

సీజన్‌ పూర్తవుతున్నా  ఉభాలు జరగలేదు..
నాకు పదెకరాల పొలం ఉంది. అదంతా కాలువ పరిధిలోనే ఉన్నందున కాలువ ద్వారా నీరురాకపోవడంతో ఇంతవరకు ఉభా లు జరిపించలేకపోయాం. ఖరీఫ్‌సీజన్‌ ముగుస్తుండటంతో నారుమడులు ముదిరిపోతున్నా యి. ముదిరిన నారు నాటినా ప్రయోజనం ఉండదు. దిగుబడి శాతం తగ్గిపోతుంది. ప్రతి ఏటా ఇదేతంతు జరుగుతుంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 
– జాగాన తిరుపతినాయుడు, రైతు, వెంకటభైరిపురం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement