గుర్ల మండల కేంద్రంలో ఐదు రోజుల వ్యవధిలో ఏడుగురి మృతి
జెడ్పీ హైస్కూల్‌లో బెంచీలపైనే 50 మంది రోగులకు వైద్య సేవలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విజృంభిస్తోంది. మండల కేంద్రమైన గుర్లకు చెందిన బోడసింగి రాములమ్మ (67), కోటగండ్రేడు గ్రామానికి చెందిన మరడాన అప్పలనర్సయ్యమ్మ (57) గురువారం డయేరియాతో మృతి చెందారు. దీంతో గత ఐదు రోజుల్లో డయేరియాతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాములమ్మకు రెండ్రోజుల క్రితమే డయేరియా సోకింది. ఆమెకు గుర్లలోని వైద్య శిబిరంలో చికిత్స అందించడంతో రోగం తగ్గిపోయిందని బుధవారం ఆమెను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు.
గురువారం ఉదయం మళ్లీ వాంతులు, విరేచనాలు అవ్వడంతో ఆమె పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగానే మృతి చెందింది. అప్పలనర్సయ్యమ్మకు కూడా మూడు రోజుల క్రితమే డయేరియా సోకింది. ఆమెకు తొలుత గుర్ల పీహెచ్‌సీలో వైద్యం అందించారు. తర్వాత విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు అక్కడి వైద్యులు రిఫర్ చేశారు.
కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గుర్ల మండల కేంద్రంలో ఇప్పటికే 300 మంది ఈ రోగం బారినపడ్డారు. గురువారం కొత్తగా మరో 20 కేసులు నమోదయ్యాయి. గుర్లలోని జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ పద్మావతి సందర్శించారు.
పాఠశాలలో బెంచీలపైనే 50 మంది రోగులను పడుకోబెట్టి వైద్యసేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రికి, విశాఖలోని కేజీహెచ్‌కు పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment