సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో కూటమి శ్రేణులకు పదవులు కట్టబెట్టే వ్యూహం
26 జిల్లాల్లో సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ జారీ
నవంబర్ 27న పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ
సాక్షి, అమరావతి: సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలకు పదవులు పంచి పెట్టేలా 2018లో సవరించిన సాగు నీటి సంఘాల చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. ఈ మేరకు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా 2019 ఫిబ్రవరి 8న జారీ చేసిన ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నెంబరు 20)ను ఉపయోగించుకుంటోంది.
ఇందులో భాగంగా 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు (డబ్ల్యూయూఏ), 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి 26 జిల్లాల కలెక్టర్లు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నిక పేరుతో తాము ఎంపిక చేసిన నేతలు, కార్యకర్తలకే సాగు నీటి సంఘాల పదవులను టీడీపీ కూటమి పెద్దలు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల కింద 21,03,825 హెక్టార్లు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 1,85,804 హెక్టార్లు, చిన్న నీటి వనరుల విభాగంలో 5,55,056 హెక్టార్లు.. వెరసి 28,44,685 హెక్టార్ల ఆయకట్టు ఉంది.
నీటి వృథాకు అడ్డకట్ట వేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించి, దిగుబడులు పెంచాలన్న లక్ష్యంతో సాగు నీటి సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటికి 2014 వరకూ సాధారణ ఎన్నికల తరహాలోనే ఎన్నికలు నిర్వహించింది. ఆయకట్టు రైతులు తమ ఓటు ద్వారా ప్రాదేశిక నియోజకవర్గాల ప్రతినిధులు, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీల అధ్యక్షులను ఎన్నుకునేవారు.
కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం 2018లో ఆ విధానానికి స్వస్తి పలుకుతూ సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో తమ వారికే పదవులు కట్టబెట్టేలా చట్టాన్ని సవరించి, సాగునీటి సంఘాలను నీరుగార్చింది.
40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి
రాష్ట్రంలో 26 జిల్లాల్లో సాగు నీటి సంఘాల ఎన్నికలకు సోమవారం కలెక్టర్లు నోటిఫికేషన్‌లు జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. సంఘాల వారీగా ఓటర్ల జాబితా తయారు చేసేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఒకరు, జల వనరుల శాఖ నుంచి ఇంకో అధికారిని నియమించారు. ఎన్నికల సిబ్బంది నియామకం ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ 40 రోజుల్లో అంటే నవంబర్ 27తో పూర్తవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment