
వీఆర్‌ఓపై ఫిర్యాదు చేస్తున్న రైతు
సాక్షి, జోగిపేట(అందోల్): ‘సార్ వీఆర్‌ఓకు డబ్బులిచ్చాను.. అయినా పని చేయడం లేదు సార్’ అంటూ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఒక రైతు అనడంతో సభలో కొద్దిసేపు కలకలం ఏర్పడింది. బుధవారం జోగిపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని అనడంతో అక్కడే కూర్చున్న నేరడిగుంట గ్రామానికి చెందిన రైతు తాను వీఆర్‌ఓకు డబ్బులు ఇచ్చానని, అయినా ఇప్పటివరకు పని కాలేదని అనడంతో ఎమ్మెల్యే ఆ రైతును దగ్గరకు పిలిచి ఏం జరిగిందని అడిగి తెలుసుకొన్నాడు. ఈ విషయం ఏదో తేల్చాలని పక్కనే ఉన్న తహసీల్దార్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా రైతులంతా పాత పాసుబుక్కులు తీసుకొని వేదిక వద్దకు వచ్చారు. సార్ ఇంకా నాకు పాసు పుస్తకాలు రాలేదు.. రోజూ తిరుగుతున్నాం అంటూ ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరి దరఖాస్తులను స్వీకరించేలా ఒకరిని నియమించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో సిబ్బంది ద్వారా వారి దరఖాస్తులు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment