Chanti Kranthi Kiran
-
అందోల్‌లో వేడెక్కుతున్న రాజకీయం.. వ్యూహాలు ఫలించేనా?
తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన 2014 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించడం జరిగింది. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆభ్యర్థిగా జర్నలిస్ట్ నాయకుడు మలిదశ ఉద్యమకారుడు చంటి క్రాంతి కిరణ్ కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో అదే పార్టీ ప్రభుత్వం చేపడుతోంది. వేడెక్కుతున్న రాజకీయం.. అధికార పార్టీలో పోటీలు! రోజు రోజుకు అందోల్‌లో రాజకీయం వేడెక్కింది. పోటీలో ఉండే నాయకులు టికెట్ల కోసం వారి, వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటి సిఎం దామోదర్ రాజనర్సింహ పేరు ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి బాబూమోహన్ బరిలో నిలిచారు. ఈ సారి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమలంలో కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక అధికార పార్టీలో ఈసారి సిట్టింగ్‌లకే టికెటు దక్కడంతో మరోసారి అందోల్ నుంచి క్రాంతి కిరణ్ పోటీకి సై అంటున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య గ్రామీణ రోడ్ల సమస్య రైతులు పండించిన పంటలకు మద్దత్తు ధర లేకపోవడం పీజీ కళాశాలలో మౌళిక వసతుల లేమి మున్సిపల్‌కు సొంత భవనం లేకపోవడం రాజకీయ పార్టీల ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు: బీఆర్ఎస్ చంటి క్రాంతి కిరణ్ (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ బీజేపీ మాజీ మంత్రి పల్లి బాబుమోహన్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ బాలయ్య టికెట్ రేసులో ఉన్నారు. వృత్తి పరంగా ఓటర్లు: నియోజకవర్గంలో ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు రైతాంగంపైనే ఆధారపడి ఉన్నారు. కొంత శాతం మంది వ్యాపారంపై ఆధారపడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జోగిపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు: మంజీరా అత్యంత కీలకమైనది. మంజీరా నదిపై సింగూరు జలాశయం 30 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ప్రాజెక్టు జంట నగరాల దాహార్తి తిరుస్తూ సంగారెడ్డి మెదక్ జిల్లాల రైతులకు సాగునీటి అవసరాలు తిరుస్తుంది. ఒక్క అందోలు నియోజకవర్గంలో ఎడమ కాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. సింగూరు పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఆలయాలు: ఉత్తర తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన అందోలు మండలంలోని కిచ్చన్నపల్లిలో దేవాలయం కలదు. అల్లాదుర్గం మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం అదే విధంగా అక్కడే బేతాళ స్వామి ఆలయం అత్యంత ప్రతిష్ట గాంచినవి. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు అందోలు నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా మొదటి సారి జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి జోగిపేటకు చెందిన బసవ మామయ్య విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు విజయం సాధించగా టీడీపీ నాలుగు సార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక బీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. రాజకీయానికి సంబంధించి ఇతర అంశాలు : 1957 లో మొదటిసారిగా ఏర్పడిన అందోలు నియోజకవర్గం మొదటి రెండు పర్యయాలు జనరల్ స్థానంగా ఉండి 1967 లో ఎస్సి రీజర్వు స్థానంగా ఏర్పడింది. 1957 లో జోగిపేటకు చెందిన ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు బసవ మనయ్య కాంగ్రెస్ అభ్యర్ధి రూక్ ఎండి.రూక్ మోద్దీన్ పై విజయం సాధించడం జరిగింది. 1962 లో లక్షిదేవి గారు కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి బసవ మణయ్య పై విజయం సాధించారు. 1967 లో ఎస్సి రిజర్వుడ్ గా ఏర్పడిన తరువాత సిరారపు రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరప్ప పై విజయం సాధించారు. 1972 లో రాజనర్సింహ కాంగ్రెస్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి లక్మన్ కుమార్ పై విజయం సాధించారు. 1978 లో మరో మారు రాజనర్సింహ ఎమ్మెల్యేగా విజయం సాధించారు 1983 లో టిడిపి తరుపున ఆల్ దేకర్ లక్మన్ జి ఈశ్వరి భాయ్ పై విజయం సాధించడం జరిగింది 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ పై గెలుపొందడం జరిగింది. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరువున దామోదర రాజనర్సింహ పోటి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాల రాజయ్య పై విజయం సాదించారు. 1994 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై గెలుపొందారు. 1998 లో అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మాల్యాల రాజయ్య సిద్ధిపేట ఎంపీగా గెలుపొందడంతో జరిగిన బై ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా సినీ యాక్టర్ బాబుమోహాన్ గెలుపొందారు. 1999 లో జనరల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై మరోమారు గెలుపొందడం జరిగింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తెలుగుదేశం అభ్యర్థి బాబుమోహన్ పై రెండు సార్లు వరుసగా విజయం సాధించి ప్రాథమిక ఉన్న విద్యాశాఖలతో ఉప ముఖ్యమంత్రి గా కావడం జరిగింది. -
సభ్యసమాజం తలదించుకునేలా సంజయ్ మాటలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో తిరుగుబా ట్లు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని, ఆయన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని టీఆర్ఎస్ ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంజయ్‌కు తెలియకుండానే పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, అది తట్టుకోలేక తోచిన విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం బీజేపీ చేసిందేంటో సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. గూండాలు, రౌడీల తరహాలో సంజయ్ మాట్లాడుతున్నారని, వారసత్వ రాజకీయాలు బీజేపీలో లేవా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎప్పుడు సభ పెట్టాలో రాజగోపాల్ రెడ్డి చెప్తారా? అని మండిపడ్డారు. మునుగోడు ప్రజల కోసం రాజగోపాల్ రాజీనామా చేయలేదని, బీజేపీలో చేరేందుకే ఆయన రాజీనామా చేశార న్నారు. రాజగోపాల్‌రెడ్డికి దమ్ముంటే బీజేపీని గెలిపించాలని సవాల్ విసిరారు. -
ఎమ్మెల్యే క్రాంతి, మాజీ ఎమ్మెల్యేపై బీజేపీ దాడి
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలోని ఒక లాడ్జిలో బస చేసిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సోమవారం రాత్రి బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యే డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రధాన నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు తొగుట మండల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఆదివారం వరకు తొగుటలో ప్రచారం నిర్వహించిన క్రాంతి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలసి సిద్దిపేటలోని ఓ లాడ్జిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి మరో 30 మంది కార్యకర్తలతో కలసి క్రాంతి ఉండే గది తలుపు నెట్టారు. (చదవండి: సరిహద్దులు దాటి రయ్.. రయ్) లోపల ఉన్న క్రాంతి.. మీరు ఎవరు అని ప్రశ్నించగా.. మారు మాట్లాడకుండా తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లతో మూకుమ్మడిగా దాడికి దిగారు. ఎమ్మెల్యే క్రాంతిపై దాడి చేస్తుండగా పక్కనే ఉన్న డ్రైవర్ సైదులు అడ్డుకునేందుకు యతి్నంచాడు. దీంతో అతని చేతికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలతో గొడవకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన సైదులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఏసీపీ తెలిపారు. (చదవండి: ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి) ఏసీపీ విశ్వప్రసాద్‌కు ఘటన గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే క్రాంతి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓటమి భయంతోనే: మంత్రి హరీశ్‌రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ముందే ఓటమిని పసిగట్టిన బీజేపీ.. ఓర్వలేక తమ పార్టీ ఎమ్మెల్యే పై దాడికి దిగడం హేయమైన చర్య అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణ చూసిన బీజేపీ నాయకులు జీరి్ణంచుకోలేక పోతున్నారని, అందుకే భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వీరేశంపై దాడి చేయడం శోచనీయమని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత నియోజకవర్గంలో ఉండకూడదనే నిబంధన మేరకు క్రాంతి, వీరేశం సిద్దిపేటలో ఉన్నారని హరీశ్ తెలిపారు. ఒంటరిగా ఉన్న ఎమ్మెల్యేపై ఒకేసారి 30 మంది దాడి చేయడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, దాడులు చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న బీజేపీ నాయకులకు ప్రజలు తగిన విధంగా బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు. నాపైనే దాడి చేశారు.. సిద్దిపేట పట్టణంలోని ఓ లాడ్జికి రూం కోసం వెళ్లిన తనపైనే ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వీరేశంలు దాడికి పాల్పడ్డారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆరోపించా రు. ఆందోల్ ఎమ్మెల్యేకు సిద్దిపేటలో ఏం పని? అని ప్రశ్నించారు. నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు కూడా తన మీదే కేసు నమోదు చేశారని ఆక్షేపించారు. -
మళ్లీ నీ నటనతో నవ్వించు: ఎమ్మెల్యే
సాక్షి, సంగారెడ్డి: అంధోల్ మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుదని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని అంధోల్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోకు ఆకర్షితులై టీఆర్ఎస్ అభ్యర్థులను ఓటర్లు ఆదరించారన్నారు. గత పాలకుల పని తీరుకు విసిగిపోయిన ప్రజలు ఈసారి తమ ఓటు బలంతో అంధోల్‌ను అభివృద్ధి పరుచుకున్నారన్నారు. అంధోల్‌ను భ్రష్టు పట్టించిన మాజీ మంత్రి బాబుమోహన్‌కు టీఆర్ఎస్ నేతలపై మాట్లాడే నైతిక హక్కు లేదని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి తన సొంత నిధులను ఖర్చు చేయలేని దద్దమ్మ అని విమర్శించారు. అంధోల్ అభివృద్ధికి అడ్డుపడ్డ బాబుమోహన్, ఆర్థిక మంత్రి హరీష్ రావును విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇక సినిమాలో నవ్వించిన ఆయన మళ్లీ ఆ రంగంలో ఇన్నింగ్స్ మొదలు పెట్టమని, సేద తీరే సమయంలో ఆయన నటన చూసి నవ్వుకుంటామని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. -
సార్ వీఆర్ఓకు డబ్బులిచ్చినా పని చేయలేదు
సాక్షి, జోగిపేట(అందోల్): ‘సార్ వీఆర్ఓకు డబ్బులిచ్చాను.. అయినా పని చేయడం లేదు సార్’ అంటూ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఒక రైతు అనడంతో సభలో కొద్దిసేపు కలకలం ఏర్పడింది. బుధవారం జోగిపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని అనడంతో అక్కడే కూర్చున్న నేరడిగుంట గ్రామానికి చెందిన రైతు తాను వీఆర్ఓకు డబ్బులు ఇచ్చానని, అయినా ఇప్పటివరకు పని కాలేదని అనడంతో ఎమ్మెల్యే ఆ రైతును దగ్గరకు పిలిచి ఏం జరిగిందని అడిగి తెలుసుకొన్నాడు. ఈ విషయం ఏదో తేల్చాలని పక్కనే ఉన్న తహసీల్దార్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా రైతులంతా పాత పాసుబుక్కులు తీసుకొని వేదిక వద్దకు వచ్చారు. సార్ ఇంకా నాకు పాసు పుస్తకాలు రాలేదు.. రోజూ తిరుగుతున్నాం అంటూ ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరి దరఖాస్తులను స్వీకరించేలా ఒకరిని నియమించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో సిబ్బంది ద్వారా వారి దరఖాస్తులు స్వీకరించారు. -
మానవత్వాన్ని చాటుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, మెదక్: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త కాజా ఇటీవల విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. కాజా మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న క్రాంతికిరణ్ ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాజా కుంటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అతని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.