జోగిపేట: జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ఐదు వేల పింఛన్ల పంపిణీ జరిగినట్లు సమాచారం. అయితే పింఛన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. పింఛన్ల కోసం దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా రావడం, మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో పాటు పాటు వివిధ కేటగిరీల కింద పలువురు దరఖాస్తు చేసుకున్నారు.
ఈనెల 6,7 తేదీల్లో అర్హుల జాబితాను ఎంపిక చేసి పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులు ప్రకటించారు. అయితే జాబితా సిద్ధం కాకపోవడంతో ఆ ఆదేశాలను చాలా వరకు సిబ్బంది పాటించలేదనే విమర్శలున్నాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు, గతంలో పెన్షన్లు పొందిన వారు మాత్రం తమకు పెన్షన్ వస్తుందో..రాదోననే ఆందోళనతో ఉన్నారు.
జిల్లాలో సుమారుగా 2.40 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ చే సేందుకు ఎంపిక చేశారని అధికార వర్గాలు తెలిపాయి. అందోలు మండలంలో నగర పంచాయతీ మినహా మిగతా గ్రామాల్లో 6,914 దరఖాస్తులు రాగా, 4374 పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. జోగిపేట-అందోలు నగర పంచాయతీ పెన్షన్ల విషయంలో కొంత అయోమయం నెలకొంది. పట్టణంలో పెన్షన్ దారులు, దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1,500 ఇస్తుండడంతో లబ్ధిదారులు కొత్త పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 8న అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ చేతుల మీదుగా సుమారు 600 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. అయితే చాలా మంది పేర్లు జాబితాలో కనిపించకపోవడం...వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో గ్రామాల్లో పంపిణీ చేస్తామని చెబుతున్నా, అది సాధ్యం కాదంటున్నారు. ప్రొసీడింగ్‌లను సిద్ధం చేసి కార్డులను సిద్ధం చేసి, జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టాల్సి ఉంది.
పెన్షన్.. టెన్షన్!
Published Mon, Nov 10 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement