జోగిపేట, న్యూస్‌లైన్: విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా అందిన మధ్యాగ్న భోజనంలో బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో విద్యార్థులు భోజనం చేసేందుకు నిరాకరించడంతో మళ్లీ భోజనం పంపిస్తామని హామీ ఇచ్చిన నిర్వాహకులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో చిన్నారులంతా ఆకలితో అలమటించారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ సంఘటన జోగిపేట ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.
విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం...జోగిపేట ఉర్దూ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పంపిణీ చేసే అక్షయపాత్ర నిర్వాహకులు ఎప్పటిలాగే సోమవారం ఉదయం 11 గంటలకు అన్నం, సాంబారు ఉన్న పాత్రలను పాఠశాలలో ఉంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం భోజనాన్ని పంపిణీ చేస్తున్న క్రమంలో బల్లి అవశేషాలు భోజనంలో కనిపించాయి. దీంతో ఉపాధ్యాయులు చిన్నారులకు భోజనాన్ని వడ్డించకుండా మానేశారు. ఈ విషయం సమీప ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు కూడా తెలియడంతో వారంతా అక్షయపాత్ర ద్వారా అందిన మధ్యాహ్న భోజనం చేసేందుకు నిరాకరించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కూడా భోజనం తినవద్దని చిన్నారులకు సూచించారు. వెంటనే ఉపాధ్యాయులు ఈ విషయాన్ని అక్షయపాత్ర నిర్వాహకులకు తెలిపారు. వెంటనే పరిశుభ్రమైన భోజనాన్ని మళ్లీ పంపాలని కోరారు. అయితే అందుకు అంగీకరించిన అక్షయపాత్ర నిర్వాహకులు సాయంత్రం 4 గంటల వరకూ భోజనం పంపలేదని హెచ్‌ఎం బిక్షపతి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దీంతో కొందరు విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లిపోగా, మిగతా వారంతా ఆకలితో అలమటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ఆగ్రహం
అక్షయప్రాత నిర్వాహకులు నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పంపిణీ చేసే ఆహారంలో నాణ్యతలోపంతో పాటు పురుగులు రావడంపై వారు ఆందోళన చెందారు. అన్నంలో బల్లి వచ్చిన విషయాన్ని చిన్నారులు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరించారు.
‘అక్షయపాత్ర ’ భోజనంలో బల్లి అవశేషాలు
Published Tue, Oct 29 2013 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement
Advertisement