Akshaya Patra
-
నాడు–నేడుతో విద్యావ్యవస్థలో మహాయజ్ఞం
మంగళగిరి: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో నాడు–నేడుతో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి– తెనాలి రోడ్డులోని ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫాండేషన్‌కు దాతలు అందజేసిన మధ్యాహ్న భోజన రవాణా వాహనాలను గురువారం ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, జంగా కృష్ణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. వంటశాలను భోజనం తయారీ నాణ్యతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పోషకాహారాన్ని అందించేందుకు జగనన్న గోరుముద్ద పథకంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించడంలో అక్షయపాత్ర అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వైస్‌ప్రెసిడెంట్ వంశీధరదాసు మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో అక్షయపాత్రకు ప్రభుత్వంతో పాటు దాతలు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమన్నారు. దాతలు ఫ్రీడమ్ ఆయిల్, హెచ్‌పీ గ్యాస్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ సహకారంతో వాహనాలను అందించారు. అక్షయపాత్ర కో–ఆర్డినేటర్ విలాస విగ్రహదాస, ఐటీ చైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి, అగవతరప్పాడు సర్పంచ్ మురళీకృష్ణారెడ్డి అక్షయపాత్ర సిబ్బంది, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
అక్షయపాత్ర సిద్ధం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట వేడి వేడిగా నాణ్యమైన భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన అధునాతన వంటశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు గంటల్లో 50,000 మందికి భోజనం అందించేలా ఈ వంటశాలను నిర్మించారు. ఈ కేంద్రీకృత వంటశాలను ఆసాంతం పరిశీలించిన సీఎం జగన్.. బటన్ నొక్కి ప్రారంభించారు. హరేకృష్ణ హరేరామ మూమెంట్ నేషనల్ ప్రెసిడెంట్ (బెంగళూరు) మధు పండిట్ దాస్, ఆంధ్రా తెలంగాణా అధ్యక్షుడు సత్యగౌరి చందన దాస్‌లు ఈ వంటశాల పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం అక్కడ ఉన్న పాఠశాల విద్యార్థులను సీఎం ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో గ్రూపు ఫొటో దిగారు. ఈ విద్యార్థులకు ఆయన స్వయంగా వడ్డించడమే కాకుండా, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు అందించే చిక్కీలను రుచి చూశారు. ఈ వంటశాలలో తయారైన ఆహార పదార్థాలు వేడి తగ్గకుండా, నాణ్యత దెబ్బతినకుండా వేగంగా పాఠశాలలకు అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఎయిర్ ఇండియా సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ఈ కేంద్రీకృత వంటశాలను (సెంట్రలైజ్డ్ కిచెన్) అభివృద్ధి చేసింది. తిరునామంతో పార, పలుగు పట్టి.. తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలోనే అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. సుమారు ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన రూ.70 కోట్ల వ్యయంతో ఈ గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్షేత్రం కోసం కొలనుకొండలో దేవదాయ శాఖ భూమిని లీజుకు ఇచ్చారు. ఇందులో రాధాకృష్ణ, వెంకటేశ్వరస్వామి ఆలయాలు, కల్చరల్ ఎక్స్పో, సంస్కార హాల్, కృష్ణ లీలాస్, గోశాల, అన్నదానం హాల్, యోగా, ధ్యాన మందిరాలు, ఆశ్రమం, భగవద్గీత మ్యూజియం, యువత కోసం శిక్షణ కేంద్రం నిర్మించనున్నారు. ఈ క్షేత్ర భూమి పూజ కార్యక్రమం కోసం వచ్చిన ముఖ్యమంత్రికి ఇస్కాన్ ప్రతినిధులు నుదుటిపై తిరునామం దిద్ది స్వాగతం పలికారు. భూమి పూజ సందర్భంగా నిర్వహించిన భూ వరాహ స్వామి యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం గోపాలకృష్ణ ఆలయం నిర్మించే చోట గునపంతో మట్టిని తవ్వడం ద్వారా నిర్మాణ పనులను వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన బాల గోపాలకృష్ణుడు, రాధాకృష్ణులకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ హరేరామ మూమెంట్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఆధ్యాత్మిక గ్రంథాలను కానుకగా అందజేశారు. గుడి నిర్మాణ ఆకృతులు, ఇక్కడ ఏర్పాటు చేసే సౌకర్యాల గురించి వివరించారు. హరేకృష్ణ గోకుల క్షేతం నమూనా చిత్రాలను, శంకుస్థాపన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం దేవదాయ శాఖ రూపొందించిన క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
ఇస్కాన్ సంకల్పం
-
అక్షయపాత్ర వంటశాలను ప్రారంభించనున్న సీఎం జగన్
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో తెనాలి రోడ్డులో అక్షయపాత్ర వంటశాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు భోజనం అందిస్తున్న నేపథ్యంలో అధునాతమైన సాంకేతికతతో ఒకేసారి వేలాదిమందికి భోజనం వండేలా ఏర్పాటు చేసిన వంటగదుల భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, కొలనుకొండ వద్ద జాతీయరహదారి పక్కన ఇస్కాన్ నిర్మించనున్న ఆలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. -
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: మళ్లీ బడి గంటలు మోగడానికి వేళైంది. రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నాలుగు రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీన్ని పాఠశాల విద్యా శాఖ ఈసారి ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, పాఠశాలలను రోజంతా కాకుండా ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 15 వరకు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నందున రెండు పూటల కార్యక్రమాలను ఒక్కపూటకే సర్దుబాటు చేయాలని సూచించింది. పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 16 ఆదివారం కావడంతో తిరిగి పాఠశాలలు 17 నుంచి యధావిధిగా పూర్తిస్థాయిలో కొనసాగుతాయి. అమ్మఒడితో లక్షలాది మందికి మేలు కాగా.. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెల్లరేషన్ కార్డు ఉండి, తమ పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చేసిన ఎన్నికల హామీని అమల్లోకి తేవడానికి కార్యాచరణను కూడా నిర్దేశించారు. జనవరి 26 నుంచి అందించే అమ్మఒడి పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. రాష్ట్రంలో 630 ప్రభుత్వ స్కూళ్లు, 38,589 జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లు, 34 రెసిడెన్షియల్ స్కూళ్లు, 164 మోడల్ స్కూళ్లు, 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, 2,110 మున్సిపల్ స్కూళ్లు, ఇతర ప్రభుత్వ యాజమాన్య, ఆర్థిక సహకార స్కూళ్లు 3,163 ఉండగా, ప్రైవేటు యాజమాన్యంలో 17,021 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో మొత్తం 70,37,478 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు 55 శాతం మంది ఉండగా తక్కిన వారంతా ప్రైవేటు స్కూళ్ల విద్యార్ధులే. అమ్మఒడి పథకంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు మరింత పెరిగనున్నాయి. అదే సమయంలో డ్రాపౌట్లు, బడి బయటి పిల్లల సంఖ్య కూడా తగ్గనుంది. ప్రతి తల్లి తన పిల్లలను చదివించుకోవడానికి అమ్మఒడి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలను చదివించుకునే స్థోమత లేని తల్లిదండ్రులకు ఇది చేయూతగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మౌలిక సదుపాయాల అనంతరం పరిస్థితిని ఫొటోలు తీసి ప్రజలకు ముంగిటకు తీసుకురానున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులతోపాటు అకడమిక్ వ్యవహారాలపై నియంత్రణకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్న లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. అలాగే జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం.. ప్రతి ప్రైవేటు స్కూలులో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అపోహలు సరికాదు: వైఎస్సార్‌టీఎఫ్ అమ్మఒడి పథకంపై కొందరు అనవసర అపోహలు లేవనెత్తుతున్నారని, ఇది సరికాదని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వి.రెడ్డి శేఖరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద తల్లులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమమని అన్నారు. కాగా, ప్రస్తుతం సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తేలకపో వడంతో ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంపై సందిగ్ధంలో ఉన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ అయితే మళ్లీ కొత్త ప్రాంతంలో పిల్లలను చేర్పించడం ఇబ్బందిగా మారుతుందని వారంటున్నారు. తొలి రోజు స్వాగత సంబరం నేటి నుంచి రాష్ట్రంలో రాజన్న బడిబాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలి రోజు ‘స్వాగత సంబరం’ పేరిట కార్యక్రమాలుంటాయి. పాఠశాలలో పండుగ వాతావరణాన్ని కల్పించడం, పాఠశాలలో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించడం, బొమ్మలు గీయించడం, రంగు కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులను తయారుచేసి ప్రదర్శించడం చేయాలి. రెండో రోజు విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటిని దత్తత ఇవ్వడం, అభినయ గేయాలు, కథలు, పాటలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలి. మూడో రోజు ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, దాతల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. నాలుగో రోజు ప్రముఖులతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, బాలికల విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు, తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణ, ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం, సహపంక్తి భోజనాలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాఠశాల శాఖ అధికారులతో సమీక్ష చేయడంతోపాటు మంగళవారం అన్ని జిల్లాల విద్యాధికారులు, సర్వశిక్ష అభియాన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ఉత్తమ విద్యా ప్రమాణాలు నెలకొల్పడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. వైఎస్సార్ అక్షయపాత్ర ద్వారా పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులను ఆదేశించారు. అమ్మఒడి పథకం.. పాఠశాలలకు సంబంధించిన కార్యక్రమం కాదని, పేద తల్లుల గౌరవానికి ముఖ్యమంత్రి ప్రకటించిన పథకమని తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 26 నుంచి అమలవుతుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే రూపొందించనున్నామని చెప్పారు. -
‘అక్షయ పాత్ర’లో అల్లం వెల్లుల్లి గొడవ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘అక్షయ పాత్ర’ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంపై మరోసారి వివాదం రాజుకుంది. గతంలో ఒడిశా రాష్ట్రంలో తలెత్తిన వివాదానికి ప్రధాన మీడియా ప్రాధాన్యత ఇవ్వగా, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న వివాదానికి ట్విట్టర్ వేదికగా మారింది. మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తోన్న కూరలు మసాలా దినుసుల వాసనలు లేకుండా చప్పగా ఉంటున్నాయని, విద్యార్థులు వాటిని తినలేక బోరుమంటున్నారంటూ ముందుగా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దానిపై ట్విటర్లో వాదోపవాదాలు రాజుకున్నాయి. అక్షయపాత్ర వంటకాలు అలా ఉండడానికి కారణం వారు వంటల్లో అల్లం–వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉపయోగించకపోవడం. వాటిని ఉపయోగించడానికి వారు విరుద్ధం. ఎందుకంటే అది వారి తాత్విక చింతనకు వ్యతిరేకం. వాటిని తినడం వల్ల మనుషుల్లో కామ, క్రోదాలు ప్రకోపిస్తాయనడానికన్నా ఆధ్యాత్మిక చింతన తగ్గుతుందన్నది ఆ సంస్థ వాదన. మరి వారు పూజిస్తోన్న శ్రీకృష్ణుడు ఇవేమీ తినకుండానే వెయ్యి మంది గోపికలతో శృంగార లీలలు ఎలా నెరపారబ్బ!... ట్విటర్లో ఓ గడుగ్గాయి కొంటె ప్రశ్న. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును తప్పకుండా సరఫరా చేయాలంటూ భారత జాతీయ పోషకాల ప్రమాణాల సంస్థ ఆదేశాలను కూడా ఇస్కాన్ సంస్థ అమలు చేయడం లేదు. తాము శాకాహారానికి నిబద్ధులమని, కోడిగుడ్డు మాంసాహారం కనుక తాము సరఫరా చేయమన్నది వారి వాదన. అవసరమైతే తాము ఈ పథకం నుంచి తప్పుకుంటాంగానీ సరఫరా చేయమని వారు మొండికేశారు. ఒడిశాలో సామరస్య పరిష్కారం ఒడిశాలో కూడా అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థే అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పిన గుడ్డును సరఫరా చేయడానికి సంస్థ నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వారానికి మూడు సార్లు గుడ్లను ఉడకబెట్టి విద్యార్థులకు వడ్డించే బాధ్యతను పాఠశాలల హెడ్మాస్టర్లకు అప్పగించింది, ఆ మేరకయ్యే ఖర్చును ఇస్కాన్ సంస్థ నుంచే రాబట్టుకోవాలని సూచించింది. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ విషయంలో మాత్రం ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేక వదిలేసింది. కర్ణాటకలోను ఉత్తర్వులు జాతీయ పోషక ప్రమాణాల సంస్థ సిఫార్సు మేరకు కూరల్లో అల్లం వెల్లులి, ఉల్లిపాయలను తప్పనిసరిగా వినియోగించాలంటూ 2018, నవంబర్ నెలలో కర్ణాటక రాష్ట్ర విద్యా శాఖ అధికారికంగా ఇస్కాన్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి బదులు తాము ఈ పథకం నుంచి తప్పుకుంటామని బెదిరించడమే కాకుండా తమ వంటకాల్లో విద్యార్థులకు అవసరమైన పోషకాలు ఉంటున్నాయని వాదించింది. ఈ విషయంలో ‘ఆహారం ప్రాథమిక హక్కు’ కార్యకర్తలు జాతీయ పోషక ప్రమాణాల సంస్థకు కేసును నివేదించగా వారు కూడా పోషకాలు ఉన్నాయంటూ సమర్థించారు. విద్యార్థులకు సరఫరా చేస్తోన్న ఆహారం ఎంత?, అందులో వారు వృధా చేస్తున్నది ఎంత? ఎలా మీరు శాంపిల్‌ను తనిఖీ చేశారంటూ ఎన్జీవోలు సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదు. అక్షయ పాత్ర భోజనం ఉచితం కాదు ఇస్కాన్ సంస్థ వెబ్సైట్లో ఉన్న వివరాలు ప్రకారం ఈ సంస్థ దేశంలోని 12 రాష్ట్రాల్లోని 15,024 ప్రభుత్వం, ప్రభుత్వ ఆర్థిక సహాయ పాఠశాలల్లో 17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తుంటే ఇది కావాలి, అది కావాలంటూ డిమాండ్ పెడతారా?’ అంటూ కొందరు అమాయకంగా ట్వీట్లు పెట్టారు. ఎంతమాత్రం ఈ సంస్థ ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి భోజనానికి ఐదున్నర రూపాయల చొప్పున చెల్లించడంతోపాటు భారత ఆహార సంస్థ నుంచి ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ పథకం కింద ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి దేశవ్యాప్తంగా 11.6 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని 9.40 కోట్ల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. అయినా చాలడం లేదంటున్న ఇస్కాన్ అక్షయ పాత్ర కింద తాము ఖర్చు పెడుతున్న మొత్తంలో 60 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తోందని, 12 రాష్ట్రాల్లో 43 వంటశాలలను సొంత ఖర్చుతో నిర్మించామని, 5,500 మంది ఉద్యోగులకు తామే జీతాలు చెల్లిస్తున్నామని అక్షయ పాత్ర పర్యవేక్షకుల్లో ఒకరైన మోహన్‌దాస్ పాయ్ వివరించారు. ఇతర ఎన్జీవో సంస్థలకన్నా ఉన్నంతలో శుభ్రంగా విద్యార్థులకు భోజనాన్ని అందిస్తోందన్న కారణంగా అక్షయ పాత్ర సేవలను వదులు కోవడానికి పలు రాష్ట్రాలు సిద్ధంగా లేవు. అసలు ఈ పథకం ఎలా పుట్టింది? 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ నిమ్న వర్గాల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ స్వాతంత్య్రానంతరం తమిళనాడు ముఖ్యమంత్రులుగా ఉన్న కే. కామరాజ్, ఎంజీ రామచంద్రన్ అన్ని వర్గాల విద్యార్థులకు దీన్ని విస్తరించి పథకాన్ని మెరగుపర్చారు. 1995లో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుంది. పిల్లలను బడికి ఆకర్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావించింది. 2001లో సుప్రీం కోర్టు ‘ఆహారం ప్రాథమిక హక్కు’కు సంబంధించిన ఓ కేసులో అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఈ పథకాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
అక్షయపాత్ర భోజనాలు జాప్యం!
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): అంగన్వాడీ కేంద్రాల్లో అక్షయపాత్ర భోజనాలు పంపిణీ మరింత జాప్యం కానుంది. ఆహార పదార్థాల తయారు చేయడానికి అవసరమ్యే కిచెన్ సిద్ధం కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి జూన్ ఒకటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో అక్షయపాత్ర భోజనాలు పెట్టడానికి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటివరకు అక్షయపాత్ర సంస్థ కిచెన్ ఏర్పాటు చేయకపోవడంతో మరో రెండు నెలలు వాయిదా తప్పేలాలేదు. ప్రస్తుతం కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అక్షయపాత్ర వంటశాల వుంది. దాని సామర్థ్యం సరిపోకపోవడంతో కొత్త కిచెన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భోజనాలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలు, అన్నక్యాంటీన్లకు భోజనాలు అందజేస్తున్న అక్షయపాత్ర సంస్థ భీమిలిలోని అంగన్వాడీ కేంద్రాలకు మే ఒకటి నుంచి మధ్యాహ్న భోజనాలు సమకూరుస్తుంది. భీమిలి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 232 అంగన్వాడీ కేంద్రాలకు తొలివిడతగా అక్షయపాత్ర భోజనాల సరఫరా ప్రారంభించారు. అక్కడ 5712 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల్లో అన్న అమృతహస్తం పథకం కింద సిబ్బంది వంటలు చేసి మధ్యాహ్నభోజనాలు పెట్టడం తెలిసిందే. రేషన్‌డిపోల ద్వారా బియ్యం, కందిపప్పు, వంటనూనె సరఫరా చేసేవారు. ఇక కూరగాయలు బయట కొనుగోలు చేసి వండేవారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేళ్లలోపు వయసు గల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రోజూ ఆయా కేంద్రాల్లో మధ్యాహ్నం భోజనాలు వడ్డిస్తున్నారు. తాజాగా నగరంలో పిఠాపురం కాలనీలో గల అర్బన్–2, మర్రిపాలెంలో గల అర్బన్–1 ఐసీడీఎస్ ప్రాజెక్డుల పరిధిలో ఆగస్టు నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. పాలు, గుడ్ల సరఫరా అంగన్వాడీ లబ్ధిదారులకు ప్రస్తుతం ఇస్తున్న పాలు, గుడ్ల సరఫరా యథావిధిగా కొనసాగుతుందని జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు వారంలో నాలుగుసార్లు, పిల్లలకు రెండుసార్లు గడ్లు ఇస్తున్నారు. ఇక గర్భిణులు, బాలింతలకు, శామ్ (తక్కువ బరువు)పిల్లలకు రోజుకు 200మిల్లీలీటర్ల వంతున పాలు ఇస్తున్నారు. రూ.7కే భోజనం అక్షయపాత్ర సంస్థకు లబ్ధిదారునికి భోజనానికి రూ.7వంతున చెల్లించాలని నిర్ణయించారు. రోజూ అన్నం, నాలుగు రోజులు పప్పు, రెండు రోజులు సాంబారు, రెండు రోజులు ఆకుకూర మెనూ కింద నిర్ణయించారు. ఇక రోజూ సాయంత్రం చిరుతిండ్లు కూడా అక్షయపాత్ర సంస్థ ద్వారా సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో కేంద్రంలో లబ్ధిదారునికి రూ.20తో పాలు, గుడ్లు, మధ్యాహ్నం భోజనాలు అందజేస్తున్నారు. -
నమ్మించారు.. డబ్బు కొట్టేశారు
నెల్లూరు, గూడూరు: అక్షయపాత్ర ఉందంటూ ముగ్గురు వ్యక్తులను నలుగురు సభ్యుల ముఠా ట్రాప్ చేసింది. వారి నుంచి నగదు కొట్టేసేందుకు నిందితుల్లో ఇద్దరు కొనుగోలుదారులుగా నటించారు. డమ్మీ పోలీసులను పిలిపించి డ్రామా ఆడారు. ఇద్దరు నగదుతో పరారు కావడం.. నగదు ఇచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. దీంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ♦ సోమవారం స్థానిక రూరల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ వంశీధర్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వైజాగ్‌కు చెందిన రమేష్, విజయనగరానికి చెందిన దేవుడుబాబు అలియాస్ సూరిబాబు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం బహదూర్‌పేట గ్రామానికి చెందిన వికాస్, అదే మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్‌లు సులువుగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ వద్ద ఎంతో మహిమ గల అక్షయపాత్ర ఉందని, దీనిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తే రూ.కోట్లు వస్తుందని ఎవరినైనా నమ్మించి భారీ మొత్తంలో నగదు సంపాదించాలనే పథకం రచించారు. అక్షయపాత్రను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత ఉన్న వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. రమేష్‌కు నెల్లూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎం.ప్రసాద్‌రెడ్డి సోదరుడితో పరిచయమైంది. రమేష్ అతనితో మాటల సందర్భంలో విజయనగరానికి చెందిన దేవుడుబాబు వద్ద రూ.కోట్లు విలువ చేసే అక్షయపాత్ర ఉందని, దానిని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఈ విషయం సోదరుడి ద్వారా ప్రసాద్‌రెడ్డికి తెలిసింది. అయితే అతనికి గతంలోనే శ్రీకాళహస్తి చెందిన వికాస్, సుభాష్‌లతో పరిచయం ఉంది. కాగా ప్రసాద్‌రెడ్డికి రమేష్‌కు, వికాస్‌లకు పరిచయం ఉన్నట్లు తెలియదు. అలాగే వారు కూడా తమకు పరిచయం లేనట్లే ప్రవర్తించారు. మహిమలు తెలుసని.. ఈ నేపథ్యంలో రమేష్ ప్రసాద్‌రెడ్డిని కలిసి ‘తనకు అక్షయపాత్ర మహిమల గురించి బాగా తెలుసు. తాను చేసే పరీక్షల్లో మహిమలు ఉన్నట్లుగా నిర్ధారణ అయితేనే కొనుగోలు చేద్దామని నమ్మించాడు. దేవుడుబాబు వద్ద ఉన్న అక్షయపాత్రలో ఉండాల్సిన మోతాదు కంటే కూడా ఎక్కువ పవర్ ఉంది. దానిని రసాయనాలతో శుద్ధి చేయాలి. అందుకు పెద్దమొత్తంలో నగదు కావాలని చెప్పాడు. దీంతో ప్రసాద్‌రెడ్డి తన స్నేహితుడైన హైదరాబాద్‌కు చెందిన కోళ్ల శేషగిరి అనే వ్యక్తికి విషయం చెప్పాడు. అతను సుమారు రూ.కోటి విడతలవారీగా వారికి అందజేశాడు. మళ్లీ వారు అక్షయపాత్రను కొనుగోలు చేసేందుకు రూ.కోటి అవసరమని చెప్పారు. అయితే శేషగిరి తన వద్ద అంతమొత్తం లేదని, కొంత మొత్తం మాత్రమే తీసుకురాగలని చెప్పాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌రెడ్డి తనకు పరిచయం ఉన్న చిల్లకూరు మండలానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి ఈ విషయాన్ని వివరించాడు. ఈ మేరకు అందరూ కలిసి నగదు తీసుకెళ్లి ఆ అక్షయపాత్రను తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నమ్మించేందుకు నగదు తెచ్చారు ప్రసాద్‌రెడ్డి, ప్రవీణ్, శేషగిరిని నమ్మించేందుకు రమేష్, వికాస్ కూడా నగదు సిద్ధం చేశారు. రమేష్ రూ.24 లక్షలు, వికాస్ రూ.10 లక్షలు, శేషగిరి రూ.23 లక్షలు, ప్రవీణ్ రూ.30 లక్షలు తీసుకుని గతేడాది డిసెంబర్ 20వ తేదీన అందరూ కలిసి విజయనగరానికి బయలుదేరారు. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రసాద్‌రెడ్డి, ప్రవీణ్, శేషగిరి అక్షయపాత్రను చూడాలని కోరారు. రమేష్ కల్పించుకుని దానిని చూస్తే పవర్ పోతుందని నమ్మించాడు. వారంతా తమ వెంట తీసుకెళ్లిన రూ.87 లక్షలను దేవుడుబాబుకు అందజేశారు. అతను అక్షయపాత్ర ఖరీదు రూ.90 లక్షలని చెప్పాడు. దీంతో రమేష్ రూ.3 లక్షలు తాను వైజాగ్‌లో ఇస్తానని చెప్పాడు. అందరూ కలిసి కారులో వైజాగ్‌కు బయలుదేరారు. నకిలీ పోలీసులను పెట్టి.. నిందితులు నగదు తీసుకుని పారిపోయేందుకు నకిలీ పోలీసులను ఏర్పాటు చేశారు. వారు ఓ చోట కారును ఆపి తనిఖీ చేస్తున్నట్లు నటిస్తుండగా దేవుడుబాబు, వికాస్‌లు నగదు తీసుకుని పరారయ్యారు. దీంతో ప్రసాద్‌రెడ్డి, శేషగిరి, ప్రవీణ్‌లకు అనుమానం వచ్చింది. వారు వెంటనే చిల్లకూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై బాబీ, హెడ్ కానిస్టేబుల్ చిరంజీవులు, కానిస్టేబుళ్లు నరేష్, భాస్కర్, ఆదినారాయణ, మాధవరావులు సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అందిన సమాచారంతో శ్రీకాళహస్త్రిలోని మిట్టకండ్రిగ వద్ద వికాస్, సుభాష్‌లను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.26 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో రూ.25 లక్షలను బాధితుని అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశారని సీఐ వంశీ«ధర్ తెలిపారు. దేవుడుబాబు, రమేష్‌ల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అంతర్జాతీయ స్థాయికి ‘అక్షయపాత్ర’
సంగారెడ్డి రూరల్: దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రపంచ స్థాయికి ఎదిగిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కందిలో ఇన్ఫోసిస్ సామాజిక సేవ విభాగం, ఫౌండేషన్ భాగస్వామ్యంతో నిర్మించిన మెగా సెంట్రలైజ్ అక్షయపాత్ర కిచెన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..ఆకలితో ఉన్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి మెగా కిచెన్ ఏర్పాటుకు రూ.18.50 కోట్లను అందించిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మెన్ సుధామూర్తిని అభినందించారు. ఈ కిచెన్‌కు లక్ష మంది పాఠశాల విద్యార్థులకు సరిపడే మధ్యాహ్న భోజనం తయారు చేసే సామార్థ్యం ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అంధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.550 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరూ తమ చేతనైన సహాయం అందిస్తూ పేద విద్యార్థులకు చేయూత నివ్వాలని కోరారు. బడికి వెళ్లే విద్యార్థులు ఆకలితో విద్యకు దూరం కాకుండా అక్షయపాత్ర పని చేస్తోందన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ..అక్షయపాత్ర మెగా కిచెన్ ఏర్పాటుతో సంగారెడ్డి ప్రాంతంలో విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..మెగా కిచెన్‌ను ఏర్పాటు చేసి రోజుకు లక్ష మంది విద్యార్థులకు భోజనం అందించడంతో బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. అనంతరం అక్షయపాత్రపై ప్రముఖ గాయకుడు కారుణ్య ఆలపించిన సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌడ చంద్రదాస, వైస్ చైర్మెన్ చంచలపతిదాస, జెడ్పీ చైర్మెన్ రాజమణీ మురళీ యాదవ్, సర్పంచ్ ఉమారాణి శంకర్‌గౌడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజేంద్రబోయి, రిజినల్ ఆర్గనైజర్ లక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మెన్ విజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలా«ధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో ‘అక్షయపాత్ర’ ప్రారంభం
కొత్తగూడెంరూరల్ : పట్టణంలోని మేదర్‌బస్తీ ప్రభుత్వ పాఠశాలో అక్షయపాత్ర మధ్యాహ్నభోజనం పథకాన్ని తహసీల్దార్ అశోక్‌చక్రవర్తి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నభోజనాన్ని అక్షయపాత్ర వారు వడ్డిస్తారని తెలిపారు. విద్యార్శులు కష్టపడి చదువుకోవాలన్నారు. అనంతరం డీపీఆర్వో శ్రీనివాస్, ఎంఈఓ వెంకటరామయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం పాల్గొన్నారు. పాల్వంచలో... పాల్వంచ : పట్టణంలోని వికలాంగుల కాలనీ, వెంగళరావుకాలనీ పాఠశాలలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజనాన్ని కార్మికులు శుక్రవారం అడ్డుకున్నారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. సంఘం జిల్లా నాయకులు అప్పారావు, కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా కష్టనష్టాలకు ఓర్చి విద్యార్థులకు భోజనం వండి పెట్టిన కార్మికులను అర్ధాంతరంగా మాన్పించడం అన్యాయం అన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ సుబ్బరావు అక్కడికి చేరుకుని ఆందోళన సద్దుమణిపించారు. కార్యక్రమంలో దొడ్డా రవికుమార్, రాజు, కార్మికులు పాల్గొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం.. కొత్తగూడెం : అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేయనున్నట్లు లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ వశ్యానాయక్ అన్నారు. ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో మ«ధ్యాహ్న భోజన పంపిణీకు పూజలు చేశారు. సర్పంచ్, డీపీఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ దీని ద్వారా మారుమూల ప్రాంతాల విద్యార్థులకు సైతం పౌష్టికాహారం అందుతుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం మేకల జ్యోతిరాణి, ఎస్ఎంసీ చైర్మన్ ఏ.అనిల్, అంగన్వాడీ టీచర్లు విజయ, పుష్ప, సిబ్బంది ఇన్నయ్య, అరుణ పాల్గొన్నారు. సుజాతనగర్లో.. సుజాతనగర్ : మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు భోజనం అందించే అక్షయపాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక పాఠశాలల్లో సర్పంచ్ లింగం పుష్పావతి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కృషి ద్వారా పిల్లలకు అక్షయపాత్రతో నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేములపల్లి సత్యనారాయణ, ఆర్ఐ నాగమణి, పంచాయతీ సెక్రటరీ జి.హరికృష్ణ, హెచ్ఎంలు సీహెచ్ వీరభద్రరావు, రత్న, గుణిరాం, టీఆర్ఎస్ నాయకులు దొడ్డి రామకృష్ణ, చింతలపూడి జగన్, లావుడ్యా గోపి, వెంకటకృష్ణ, సందీప్, పాల్గొన్నారు. త్రీ ఇంక్లైన్లో... చుంచుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకాన్ని మూడో ఇంక్లైన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బోడా శారద శుక్రవారం ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సముద్రాల సత్యనారాయణ, బోడా గణ్ష్ , ఉపాధ్యాయులు లక్ష్మణ్ తదితరులుపాల్గొన్నారు. విద్యానగర్ ప్రాథమిక పాఠశాలలో పథకాన్ని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు ప్రారంభించి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు నీరుకొండ హన్మంతరావు, దుర్గారావు, యాకూబీ, హెచ్ఎం అరుణ పాల్గొన్నారు. అక్షయపాత్ర పేరుతో చద్దన్నం ... సూపర్‌బజార్(కొత్తగూడెం) : అక్షయపాత్ర పేరుతో కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చద్దన్నం పెడుతున్నారని సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు విమర్శించారు. శుక్రవారం రామవరం నేతాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర పథకం వంటలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఎస్ఎంసీ చైర్మన్ ఎస్ జనార్దన్, హెచ్ఎం సంధ్యారాణి, వీఆర్ఓ లక్ష్మి పాల్గొన్నారు. -
అక్షయపాత్ర అమ్ముతూ పోలీసులకు చిక్కిన తెలుగుతంబి
-
‘అక్షయపాత్ర ’ భోజనంలో బల్లి అవశేషాలు
జోగిపేట, న్యూస్‌లైన్: విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా అందిన మధ్యాగ్న భోజనంలో బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో విద్యార్థులు భోజనం చేసేందుకు నిరాకరించడంతో మళ్లీ భోజనం పంపిస్తామని హామీ ఇచ్చిన నిర్వాహకులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో చిన్నారులంతా ఆకలితో అలమటించారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ సంఘటన జోగిపేట ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం...జోగిపేట ఉర్దూ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పంపిణీ చేసే అక్షయపాత్ర నిర్వాహకులు ఎప్పటిలాగే సోమవారం ఉదయం 11 గంటలకు అన్నం, సాంబారు ఉన్న పాత్రలను పాఠశాలలో ఉంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం భోజనాన్ని పంపిణీ చేస్తున్న క్రమంలో బల్లి అవశేషాలు భోజనంలో కనిపించాయి. దీంతో ఉపాధ్యాయులు చిన్నారులకు భోజనాన్ని వడ్డించకుండా మానేశారు. ఈ విషయం సమీప ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు కూడా తెలియడంతో వారంతా అక్షయపాత్ర ద్వారా అందిన మధ్యాహ్న భోజనం చేసేందుకు నిరాకరించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కూడా భోజనం తినవద్దని చిన్నారులకు సూచించారు. వెంటనే ఉపాధ్యాయులు ఈ విషయాన్ని అక్షయపాత్ర నిర్వాహకులకు తెలిపారు. వెంటనే పరిశుభ్రమైన భోజనాన్ని మళ్లీ పంపాలని కోరారు. అయితే అందుకు అంగీకరించిన అక్షయపాత్ర నిర్వాహకులు సాయంత్రం 4 గంటల వరకూ భోజనం పంపలేదని హెచ్ఎం బిక్షపతి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దీంతో కొందరు విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లిపోగా, మిగతా వారంతా ఆకలితో అలమటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆగ్రహం అక్షయప్రాత నిర్వాహకులు నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పంపిణీ చేసే ఆహారంలో నాణ్యతలోపంతో పాటు పురుగులు రావడంపై వారు ఆందోళన చెందారు. అన్నంలో బల్లి వచ్చిన విషయాన్ని చిన్నారులు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరించారు.