సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట వేడి వేడిగా నాణ్యమైన భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన అధునాతన వంటశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు గంటల్లో 50,000 మందికి భోజనం అందించేలా ఈ వంటశాలను నిర్మించారు. ఈ కేంద్రీకృత వంటశాలను ఆసాంతం పరిశీలించిన సీఎం జగన్.. బటన్ నొక్కి ప్రారంభించారు.
హరేకృష్ణ హరేరామ మూమెంట్ నేషనల్ ప్రెసిడెంట్ (బెంగళూరు) మధు పండిట్ దాస్, ఆంధ్రా తెలంగాణా అధ్యక్షుడు సత్యగౌరి చందన దాస్‌లు ఈ వంటశాల పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం అక్కడ ఉన్న పాఠశాల విద్యార్థులను సీఎం ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో గ్రూపు ఫొటో దిగారు. ఈ విద్యార్థులకు ఆయన స్వయంగా వడ్డించడమే కాకుండా, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు అందించే చిక్కీలను రుచి చూశారు. ఈ వంటశాలలో తయారైన ఆహార పదార్థాలు వేడి తగ్గకుండా, నాణ్యత దెబ్బతినకుండా వేగంగా పాఠశాలలకు అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఎయిర్ ఇండియా సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ఈ కేంద్రీకృత వంటశాలను (సెంట్రలైజ్డ్ కిచెన్) అభివృద్ధి చేసింది.
తిరునామంతో పార, పలుగు పట్టి..
తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలోనే అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. సుమారు ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన రూ.70 కోట్ల వ్యయంతో ఈ గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్షేత్రం కోసం కొలనుకొండలో దేవదాయ శాఖ భూమిని లీజుకు ఇచ్చారు. ఇందులో రాధాకృష్ణ, వెంకటేశ్వరస్వామి ఆలయాలు, కల్చరల్ ఎక్స్‌పో, సంస్కార హాల్, కృష్ణ లీలాస్, గోశాల, అన్నదానం హాల్, యోగా, ధ్యాన మందిరాలు, ఆశ్రమం, భగవద్గీత మ్యూజియం, యువత కోసం శిక్షణ కేంద్రం నిర్మించనున్నారు. ఈ క్షేత్ర భూమి పూజ కార్యక్రమం కోసం వచ్చిన ముఖ్యమంత్రికి ఇస్కాన్ ప్రతినిధులు నుదుటిపై తిరునామం దిద్ది స్వాగతం పలికారు.
భూమి పూజ సందర్భంగా నిర్వహించిన భూ వరాహ స్వామి యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం గోపాలకృష్ణ ఆలయం నిర్మించే చోట గునపంతో మట్టిని తవ్వడం ద్వారా నిర్మాణ పనులను వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన బాల గోపాలకృష్ణుడు, రాధాకృష్ణులకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ హరేరామ మూమెంట్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఆధ్యాత్మిక గ్రంథాలను కానుకగా అందజేశారు. గుడి నిర్మాణ ఆకృతులు, ఇక్కడ ఏర్పాటు చేసే సౌకర్యాల గురించి వివరించారు. హరేకృష్ణ గోకుల క్షేతం నమూనా చిత్రాలను, శంకుస్థాపన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం దేవదాయ శాఖ రూపొందించిన క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment