అంతర్జాతీయ స్థాయికి ‘అక్షయపాత్ర’  | International Akshaya Patara | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయికి ‘అక్షయపాత్ర’ 

Published Sat, Mar 31 2018 8:54 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

International Akshaya Patara - Sakshi

అన్నం తయారీని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం కడియం, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుధామూర్తి

సంగారెడ్డి రూరల్‌: దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని  అందిస్తూ అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రపంచ స్థాయికి ఎదిగిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కందిలో ఇన్ఫోసిస్‌ సామాజిక సేవ విభాగం, ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో  నిర్మించిన మెగా సెంట్రలైజ్‌ అక్షయపాత్ర కిచెన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..ఆకలితో ఉన్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి మెగా కిచెన్‌ ఏర్పాటుకు రూ.18.50 కోట్లను అందించిన ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ సుధామూర్తిని అభినందించారు. ఈ కిచెన్‌కు లక్ష మంది పాఠశాల విద్యార్థులకు సరిపడే మధ్యాహ్న భోజనం తయారు చేసే సామార్థ్యం ఉందన్నారు.

విద్యార్థులకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అంధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.550 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరూ తమ చేతనైన సహాయం అందిస్తూ పేద విద్యార్థులకు చేయూత నివ్వాలని కోరారు. బడికి వెళ్లే విద్యార్థులు ఆకలితో  విద్యకు దూరం కాకుండా అక్షయపాత్ర పని చేస్తోందన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ..అక్షయపాత్ర మెగా కిచెన్‌ ఏర్పాటుతో సంగారెడ్డి ప్రాంతంలో విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందే అవకాశం ఉందన్నారు. కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..మెగా కిచెన్‌ను ఏర్పాటు చేసి రోజుకు లక్ష మంది విద్యార్థులకు భోజనం అందించడంతో బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు.

అనంతరం అక్షయపాత్రపై ప్రముఖ గాయకుడు కారుణ్య ఆలపించిన సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్‌ అధ్యక్షుడు సత్యగౌడ చంద్రదాస, వైస్‌ చైర్మెన్‌ చంచలపతిదాస, జెడ్పీ చైర్మెన్‌ రాజమణీ మురళీ యాదవ్, సర్పంచ్‌ ఉమారాణి శంకర్‌గౌడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజేంద్రబోయి, రిజినల్‌ ఆర్గనైజర్‌ లక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్‌ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మెన్‌ విజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ కొండల్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ మండలా«ధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్‌ పాల్గొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement