కొంప ముంచిన రాంగ్‌కాల్..! | man cheats woman with wrong phone call in medak district | Sakshi
Sakshi News home page

కొంప ముంచిన రాంగ్‌కాల్..!

Published Thu, Dec 31 2015 9:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

కొంప ముంచిన రాంగ్‌కాల్..!

కొంప ముంచిన రాంగ్‌కాల్..!

జోగిపేట: ఫోన్‌లో పరిచయం స్నేహంగా మారింది. ఆపై ప్రేమకు దారితీసింది. ఆరు నెలలపాటు చనువుగా ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆపై ప్రేమికురాలి వద్ద నుంచి రూ.4.25 లక్షలు తీసుకుని ఉడాయించాడా ప్రేమికుడు. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లా జోగిపేటలో వెలుగు చూసింది.

ఆరు నెలల క్రితం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిలిప్‌చెడ్ గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం శ్రీలత ఫోన్‌కు రాంగ్‌కాల్ వచ్చింది. దీంతో ఆమె ‘రాంగ్‌కాల్’ అంటూ పెట్టేసింది. అతను మళ్లీ.. మళ్లీ కాల్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం స్నేహం వరకు వెళ్లింది. తనను తాను కిశోర్‌బాబుగా పరిచయం చేసుకున్న అతను, తనది విజయవాడ అనీ.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సొంతిల్లు ఉందని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆరు నెలలుగా ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో తాను ప్లాట్ కొంటున్నానని.. రూ. 35 వేలు తక్కువగా ఉన్నాయని.. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయాలని ఒత్తిడి పెంచాడు.  జోగిపేట ఎస్‌బీఐలో డబ్బు డ్రా చేసేందుకు మంగళవారం ఉదయం ఇద్దరూ కలిసి వెళ్లారు. తన ఖాతానుంచి శ్రీలత రూ.35 వేలు డ్రా చేసి ఇచ్చింది. అదే సమయంలో శ్రీలత ఖాతాలో మరో రూ.3.90 లక్షల వరకు నగదు ఉన్నట్టు గమనించిన అతడు.. అంతలోనే కుట్ర పన్నాడు.

ఇంత డబ్బు ఉద్యోగి ఖాతాలో ఉండకూడదని, సంవత్సరం చివర కావడంతో ఇన్‌కంటాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు. ఆమెతో రూ.3.90 లక్షలు డ్రా చేయించాడు. మధ్యాహ్నం వరకు బ్యాంకులోనే ఉండి డబ్బులు తీసుకుని పక్కనే ఉన్న వెంకటేశ్వర సినిమా థియేటర్‌లోకి సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా మధ్యలోనే బ్యాగులో ఉన్న డబ్బును ఆమెకు తెలియకుండా (రూ.3.90 లక్షలు) కాజేసీ, తనకు ఫోన్ వస్తుందని మాట్లాడి వస్తానంటూ బయటకు వెళ్లిపోయాడు. 15 నిమిషాల వరకు అతను రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో తన బ్యాగును చూసుకుంది. అందులో డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది.

బయటకు వచ్చి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీనిపై బుధవారం జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకులోని వీడియో ఫుటేజీలను పరిశీలించారు. కాగా, అతని సెల్ నంబర్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, శ్రీనివాసరావు పేరు మీద ఉన్నట్లు ఎస్‌ఐ విజయ్‌రావు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కిశోర్‌బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement