జోగిపేట, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల పనితీరులో చాలా మార్పు వచ్చిందని, బాగా పనిచేస్తున్నారని, భవిష్యత్తులో మంచి ఫలితాలు రావడం ఖాయమని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ పేర్కొన్నారు. గురువారం జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాల, ఉపాధ్యాయుల నిరంతర సమగ్ర మూల్యాంకనపై శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధిం చేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఈ సారి జూలై మాసం నుంచే 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు.
హెచ్‌ఎంలు వారానికి 8 తరగతులు తప్పనిసరిగా నిర్వహించాలని, లేనట్లయితే ఇంక్రిమెంట్‌లు కట్ చేస్తామని హెచ్చరించారు. స్పోకన్ ఇంగ్లీష్ తరగతులను నిర్వహించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. పాఠశాలల్లో ప్రతి శుక్రవారం అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులచే క్విజ్ పోటీలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో విద్యావలంటీర్ల స్థానంలో ప్రభుత్వం అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌ల పోస్టుల నియామకాన్ని చేపడుతుందని తెలిపారు. జిల్లాకు 230 పోస్టులను కేటాయించినట్లు వివరించారు. ఉన్నత పాఠశాలల్లో 430 పోస్టులు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మండల స్థాయిలో సమగ్ర మూల్యాంకనంపై నిర్వహిస్తున్న శిక్షణ పట్ల ఉపాధ్యాయులు సైతం సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. మారిన సిలబస్‌ను ఎలా భోదించాలన్న విషయమై శిక్షణలో ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
శిక్షణ కేంద్రం వద్ద సలహాల బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముం దు జోగిపేట ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు సంబంధించిన హాజరు రిజిష్టరు, మధ్యా హ్న భోజన పథకంనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాను చూసి అభినందించారు. ఎంఇఓ బి.గోపాల్ ఆయన వెంట ఉన్నారు.