మన విద్యా రంగమే భేష్ | ETS survey: Quality of Education in Indian Schools | Sakshi
Sakshi News home page

మన విద్యా రంగమే భేష్

Published Tue, Feb 11 2025 3:49 AM | Last Updated on Tue, Feb 11 2025 3:56 AM

ETS survey: Quality of Education in Indian Schools

ఈటీఎస్‌ సర్వేలో 70 శాతం భారతీయ యువత వెల్లడి

భవిష్యత్‌ కెరీర్‌ కూడా బ్రహ్మాండమే

ఏఐని ముప్పుగా భావించడం లేదు

అయితే నాణ్యమైన విద్యను అందుకోవడం కష్టంగా మారింది

కొన్ని వర్గాలవారే ప్రయోజనం పొందేలా విద్యా అవకాశాలు ఉన్నాయన్న 78 శాతం మంది

నాణ్యమైన విద్యా సంస్థలు, కోర్సుల విషయంలోనూ కొరత  


‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్‌ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’ – మన విద్యా రంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది.

అయితే దీనికి భిన్నంగా.. మన విద్యా వ్యవస్థ.. కెరీర్‌ అవకాశాల విషయంలో నేటి తరం యువత స్పందించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశ విద్యా విధానమే బాగుంటుందనే ఆశాభావాన్ని యువత వ్యక్తం చేసింది. అదే విధంగా కెరీర్‌ అవకా­శాల కోణంలోనూ భవిష్యత్‌.. బ్రహ్మాండంగానే ఉంటుందనే రీతిలో స్పందించింది.

ఈ వివరాలు.. టోఫెల్, జీఆర్‌ఈ వంటి పరీక్షలు నిర్వహించే ప్రముఖ టెస్టింగ్‌ సంస్థ.. ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌)(ETS survey) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ మేరకు మొత్తం 18 దేశాల్లో 18 వేల మంది యువత అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను ఈటీఎస్‌ విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.

మన విద్యా వ్యవస్థ బాగుంటుంది..
మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70 శాతం యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76 శాతం మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30 శాతం మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు.

నాణ్యతతో కూడిన విద్య కష్టమే..
ఒకవైపు.. మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. అలాగే అత్యున్నత నాణ్యమైన కోర్సులు, విద్యా సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందన్నారు.

ముందంజలో నిలిచే అవకాశం..
ప్రస్తుత అవకాశాలతో కెరీర్‌లో ముందంజలో నిలవడానికి అవకాశం ఉంటుందని 69% మంది భారత యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59% మాత్రమే కావడం గమనార్హం. అదే విధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉద్యోగాల కొరత..
ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది భారతీయ యువత పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అదే విధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33 శాతం మంది వెల్లడించారు. 

నూతన నైపుణ్యాలవైపు పరుగులు..
మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్‌ సర్వే వెల్లడించింది. లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ అనేది కెరీర్‌ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనడం విశేషం. అదే విధంగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88 శాతం మంది పేర్కొన్నారు.

ఏఐ.. అవకాశాల వేదిక..
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో.. తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐని ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పది మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.

లాభాపేక్ష లేని సంస్థలు కూడా..
దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమ­య్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని.. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది తెలిపారు. అంత­ర్జా­తీయంగా ఈ సంఖ్య 19 శాతంగానే ఉంది.

ఆ 3 స్కిల్స్‌ ప్రధానంగా..
జాబ్‌ మార్కెట్‌లో ముందంజలో నిలవడానికి ఏఐ/డిజిటల్‌ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్‌లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే సంస్థలు శిక్షణ సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

బోధన, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలి
నేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్‌ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్‌ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగు పడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా.. ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.
– రమేశ్‌ లోగనాథన్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్‌ఐటీ–హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement