జోగిపేట, న్యూస్‌లైన్: జిల్లాలో కొత్తగా మూడు ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని డిసెంబర్ 1నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ శైలజ తెలిపారు. శుక్రవారం జోగిపేటలో నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో ఐదు ప్రాజె క్టుల పరిధిలో ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండో విడతగా జోగిపేట, దుబ్బాక, గజ్వేల్ ప్రాజెక్టుల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సిద్దిపేట, పటాన్‌చెరు, సదాశివపేట ప్రాజెక్టుల్లో ఈ పథకం ప్రారంభం కాలేదన్నారు. గతంలో బాలింతలు, గర్భిణుల ఇళ్లకు వెళ్లి పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేవారమని, అలా పంపిణీ చేయడం వల్ల పారదర్శకత లోపిస్తోందని భావించి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వారికి వండి పెడతామని నెలకు 25 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అంగన్‌వాడీ టీచర్లు నిర్వహిస్తారన్నారు. ఐకేపీ వారు పాలు, కూరగాయలు, పోపు సామాన్లు సరఫరా చేస్తారని వీటికి గాను ఐసీడీఎస్ తరఫున డబ్బులను వారి ఖాతాల్లో వేస్తామన్నారు. కందిపప్పు, బియ్యం, ఆయిల్, గుడ్లు ఐసీడీఎస్ తరఫున పంపిణీ చేస్తామన్నారు. శిశుమరణాలు తగ్గించేందుకు పుట్టిన బిడ్డ బరువు పెంచేందుకు, రక్త హీనతను తగ్గించేందుకు ఈ పథకం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య అధ్యక్షత వహించారు.
ప్రాజెక్టు పరిధిలో బాలామృతం పథకం
ఏడు నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతినెల బాలామృతం పథకం క్రింద రెండున్నర కిలోల పోషక పదార్థాల పాకెట్‌ను పంపిణీ చేస్తామని ప్రాజెక్టు అధికారి ఎల్లయ్య తెలిపారు. ప్రతి రోజు 20 గ్రాముల చొప్పున దీనిని పిల్లలకు పట్టించాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఫుడ్ పంపిణీ చేసే మాడిఫైడ్ థెరఫ్యూటిక్ ఫుడ్‌ను డిసెంబర్ 1నుంచి ప్రాజెక్టు పరిధిలోని పిల్లలకు అందించనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ నుంచి ఇందిరమ్మ హస్తం ప్రారంభం
Published Sat, Nov 30 2013 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement