Balamrutham scheme
-
'బాలామృతం'.. విషం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు ప్రచారం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న పథకాలు అమల్లో మాత్రం అత్యంత అధ్వానంగా మారిపోతున్నాయి. ఈ పథకాల కోసం ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను నిలిపేయడం వల్ల లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోతోంది. అలాంటి మరో ఆర్భాటపు పథకమే.. ‘బాలామృతం’. ఏడు నెలల వయసు నుంచి ఏడేళ్ల మధ్య చిన్నారులకు పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా గత నెలలో ప్రకటించిన ఈ పథకం ఆచరణలో మాత్రం దాదాపు పూర్తిగా విఫలమైంది. దీనికోసం ఏటా రూ. 250 కోట్లు వెచ్చిస్తున్నామని సర్కారు చెప్పుకొంటున్న గొప్పలేమిటో... కనీసం మూడోవంతు చిన్నారులకు కూడా పౌష్టికాహారం అందడం లేదనే నిష్ఠుర సత్యం స్పష్టంగా కళ్లకు కడుతోంది. దానికితోడు ‘బాలామృతం’ పథకం కింద అందజేస్తున్న పౌష్టికాహారంలో కలుపుతున్న పాలపొడి నాసిరకంగా ఉంటోందనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లోపం కారణంగా పలు చోట్ల చిన్నారులు వాంతులు, విరేచనాలు వంటి అస్వస్థతకు గురవుతున్నారు. సమగ్ర కార్యాచరణ ఏది? గోధుమలు, శనగపప్పు, వేరుశనగ, పంచదార, పాలపొడి మిశ్రమంతో ఏపీ ఫుడ్స్ బాలామృతాన్ని ప్యాకెట్ల రూపంలో తయారు చేస్తోంది. రోజుకు 100 గ్రాముల చొప్పున, 25 రోజులకు ఒక్కొక్కరికి 2.5 కేజీల ప్యాకెట్‌ను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని నిర్దేశించారు. అయితే, ఐసీడీఎస్ పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమం ఇంత వరకూ సమగ్ర కార్యాచరణకు నోచుకోలేదు. పథకం కింద అందిస్తున్న పౌష్టికాహారం ప్యాకెట్ల డిమాండ్‌కు, పంపిణీకి మధ్య ఏమాత్రం పొంతన లేదు. ముందస్తు ప్రణాళిక కరువు.. ‘బాలామృతం’ పౌష్టికాహార ప్యాకెట్ల పంపిణీ వ్యవహారంపై అధికారుల్లోనూ అయోమయం కనిపిస్తోంది. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా పథకాన్ని ప్రకటించడమే దీనికి కారణమని వారు పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ‘సోయా మీల్ (సోయాబీన్ ఇతర పప్పుధాన్యాలతో కూడిన పౌష్టికాహారం)’ పొడి మాత్రమే అందించేవారు. అయితే, కొత్తగా పాలపొడిని చేర్చాలనే యోచనకు అనుగుణంగా ప్రత్యేక యంత్రాలు, ప్యాకింగ్ పరికరాలు కావాలని అధికారులు అంటున్నారు. దాంతో అక్టోబర్‌లో 1,200 టన్నులు, నవంబర్‌లో 1,800, డిసెంబర్లో 2,300 టన్నులు మాత్రమే అందించగలిగామని అధికారులు పేర్కొన్నారు. రెంటికీ నోచని చిన్నారులు.. ఐసీడీఎస్ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 406 ప్రాజెక్టుల కింద 80 వేల అంగన్వాడీ కేంద్రాలు, 10 వేల మినీ అంగన్వాడీలున్నాయి. అందులో కేవలం 160 ప్రాజెక్టులకే ‘బాలామృతం’ సరఫరా అవుతోంది. మిగతా ప్రాజెక్టులకు గతంలో మాదిరిగా సోయామీల్‌ను పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ, చాలా జిల్లాల్లో సోయామీల్ కూడా సరిగా అందడం లేదని సమాచారం. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ప్రాంతంలో ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో 100 నుంచి 120 మంది చిన్నారులు ‘బాలామృతం’ ప్యాకెట్ల కోసం నమోదు చేసుకున్నారు. కానీ, ఒక్కో కేంద్రంలో సుమారు 40 మందికి సరిపడా ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. మెదక్ జిల్లా జోగిపేటలో ‘బాలామృతం’ ప్యాకెట్లలో తెల్లటి పురుగులు వచ్చాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. అదే గ్రామం ఎస్సీ కాలనీలో చిన్నారులకు ‘బాలామృతం’ తిన్న వెంటనే వాంతులవడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ప్రాణాంతకమే..! రాష్ట్రంలో చాలా చోట్ల ‘బాలామృతం’ పౌష్టికాహార ప్యాకెట్లలో అందించే పొడి నాసిరకంగా ఉంటోందని.. పురుగులు, బూజు వంటివి కనిపిస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ‘బాలామృతం’ తయారీకి ఉపయోగించే పప్పు దినుసులు నాసిరకంగా ఉండటం, బూజు పట్టిన సరుకును తయారీలో వినియోగించడమే దీనికి కారణమనే వాదన విన్పిస్తోంది. ఇందులో కలిపే పాలపొడిని గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల అమూల్ డైరీలు సరఫరా చేస్తున్నాయి. అయితే, ఆ సంస్థలు నాసిరకం పాలపొడిని సరఫరా చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పాలపొడిలో ఏమాత్రం నాణ్యత లోపించినా, నిర్ధారిత సమయం మించిపోయినా... అది విషపూరితమయ్యే ప్రమాదం ఎక్కువ. పాలపొడి ప్రమాణాల్లో తేడా వస్తే... ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు ప్రభుత్వానికి అంతర్గత నివేదికలు కూడా ఇచ్చినట్టు తెలిసింది. అంతా బాగానే ఉంది: జేడీ బాలామృతం పథకాన్ని ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ సరళారాజ్యలక్ష్మి తెలిపారు. నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించామన్నారు. ‘బాలామృతం’ పొడిని చిన్నారులకు తినిపించేటప్పుడు శుభ్రత పాటించకపోవడమే అస్వస్థతకు కారణమన్నారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని చెప్పారు. -
అంగన్వాడీల్లో ‘బాలామృతం’
చిన్నారులకు సెరెలాక్ తరహా పౌష్టికాహారం: మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ‘బాలామృతం’ పథకాన్ని అమలు చేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. పథకం కింద చిన్నారులకు గోధుమలు, పల్లీపొడి, పాలపొడి, చక్కెర, నూనెలతో కూడిన సెరెలాక్ తరహా మిశ్రమ పౌష్టికాహారాన్ని అందజేస్తామని తెలిపారు. శనివారం సచివాలయంలో శిశు సంక్షేమ శాఖ రూపొందించిన కొత్త కేలండర్‌ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు తనకు సంతృప్తినిచ్చాయని చెప్పారు. కోడిగుడ్డు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో అంగన్వాడీలకు సరఫరా కోసం నిర్ణయించిన ధర సీలింగ్‌ను తొలగించినట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లా పెదవూర మండలం ఏనెమీద తండా అనాథాశ్రమంలోని బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డ ట్యూటర్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైనట్టేనని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని స్పీకర్ కూడా చెప్పారన్నారు. స్పీకర్ చెప్పిన విధంగా తెలంగాణ బిల్లుపై చర్చ కొనసాగుతోందంటే చర్చ ప్రారంభమైనట్లే కదా అని ప్రశ్నించారు. -
అమృతం కాదు.. విషం
జోగిపేట, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేది నుంచి చిన్నారుల కోసం ‘బాలామృతం’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా చిన్నారులకు నెల రోజులు పాటు సరిపోయేలా అనుబంధ పౌష్టికాహరంతో కూడిన ప్యాకెట్‌ను ఒక్కొక్కరికి ఒక్క ప్యాకెట్ చొప్పున అందజేయాలి. ప్రతి రోజు 100 గ్రాముల చొప్పున 7-36 నెలల పిల్లలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో 7 వేల మంది చిన్నారులను గుర్తించి రెండు, మూడు రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రాలకు ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే జోగిపేటకు చెందిన రెండు కేంద్రాల్లో శుక్ర, శనివారాల్లో ఈ ప్యాకెట్లను పంపిణీ చేయగా, అందులో నుంచి తెల్లటి పురుగులు బయటపడడంతో ప్యాకెట్లు తీసుకున్న వారు తిరిగి తీసుకువచ్చి అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చేశారు. సర్కార్ పంపిణీ చేసిన ప్యాకెట్లోని పొడి తాగిన స్థానిన ఎస్సీ కాలనీలోని చిన్నారి వాంతులు చేసుకుంది. మరో కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త తన బిడ్డకు ఈ పొడిని కలిపి తాగించిన వెంటనే ఆ చిన్నారి వాంతులు చేసుకున్నట్లు సమాచారం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం వారిని అనారోగ్యానికి గురి చేస్తుండడంతో వాటిని పిల్లలకు పంపిణీ చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు భయపడుతున్నారు. మరోవైపు ‘బాలామృతం’ ప్యాకెట్లలో పురుగులు వస్తున్న విషయం తెలుసుకున్న తల్లులు ఈ ప్యాకెట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. -
డిసెంబర్ నుంచి ఇందిరమ్మ హస్తం ప్రారంభం
జోగిపేట, న్యూస్‌లైన్: జిల్లాలో కొత్తగా మూడు ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని డిసెంబర్ 1నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ శైలజ తెలిపారు. శుక్రవారం జోగిపేటలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో ఐదు ప్రాజె క్టుల పరిధిలో ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండో విడతగా జోగిపేట, దుబ్బాక, గజ్వేల్ ప్రాజెక్టుల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సిద్దిపేట, పటాన్చెరు, సదాశివపేట ప్రాజెక్టుల్లో ఈ పథకం ప్రారంభం కాలేదన్నారు. గతంలో బాలింతలు, గర్భిణుల ఇళ్లకు వెళ్లి పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేవారమని, అలా పంపిణీ చేయడం వల్ల పారదర్శకత లోపిస్తోందని భావించి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే వారికి వండి పెడతామని నెలకు 25 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తారన్నారు. ఐకేపీ వారు పాలు, కూరగాయలు, పోపు సామాన్లు సరఫరా చేస్తారని వీటికి గాను ఐసీడీఎస్ తరఫున డబ్బులను వారి ఖాతాల్లో వేస్తామన్నారు. కందిపప్పు, బియ్యం, ఆయిల్, గుడ్లు ఐసీడీఎస్ తరఫున పంపిణీ చేస్తామన్నారు. శిశుమరణాలు తగ్గించేందుకు పుట్టిన బిడ్డ బరువు పెంచేందుకు, రక్త హీనతను తగ్గించేందుకు ఈ పథకం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య అధ్యక్షత వహించారు. ప్రాజెక్టు పరిధిలో బాలామృతం పథకం ఏడు నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతినెల బాలామృతం పథకం క్రింద రెండున్నర కిలోల పోషక పదార్థాల పాకెట్‌ను పంపిణీ చేస్తామని ప్రాజెక్టు అధికారి ఎల్లయ్య తెలిపారు. ప్రతి రోజు 20 గ్రాముల చొప్పున దీనిని పిల్లలకు పట్టించాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఫుడ్ పంపిణీ చేసే మాడిఫైడ్ థెరఫ్యూటిక్ ఫుడ్‌ను డిసెంబర్ 1నుంచి ప్రాజెక్టు పరిధిలోని పిల్లలకు అందించనున్నట్లు తెలిపారు.