జోగిపేట నుంచి పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు
జోగిపేట(అందోల్): వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చేస్తున్న పాదయాత్ర వెయ్యి కి.మీ పూర్తయిన సందర్భంగా ఆయనకు మద్దతుగా జోగిపేటలో సోమవారం అందోల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, మెదక్ జిల్లా అధ్యక్షుడు బి.సంజీవరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. మార్కెట్ యార్డు, బసవేశ్వర విగ్రహం, హనుమాన్ చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం మీదుగా అన్నాసాగర్ గ్రామ సమీపంలోని ముర్షద్ వరకు పాదయాత్ర కొనసాగింది. వైఎస్.జగన్ నాయకత్వం వర్థిల్లాలి, వైఎస్సార్ అమర్ రహే, వైఎస్సార్‌సీపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
పాదయాత్రలో భాగంగా స్థానిక పబ్బతి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నాసాగర్ దర్గాలో ప్రార్థనలు చేశారు. వైఎస్.జగన్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకున్నారు. హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టిన అనంతరం ముందుకు కదిలారు.
వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని, దానికి ఆయన చేపడుతున్న పాదయాత్రలకు వస్తున్న ప్రజా స్పందనే సాక్ష్యంగా చెప్పవచ్చని మెదక్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బి.సంజీవరావు, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి బాలకృష్ణారెడ్డి, జిల్లా వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు డీజీ మల్లయ్య యాదవ్ అన్నారు. ప్రజల ఆదరాభిమానాల మధ్య చేపడుతున్న పాదయాత్ర నేటికి వెయ్యి కి.మీకు చేరుకుందని చెప్పారు.
రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పాదయాత్రలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో కూడా పార్టీ పటిష్టంగా తయారవుతోందన్నారు. దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలతో పాటు అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతాయన్నారు. నియోజకవర్గంలో యువత పార్టీ వైపు బాగా ఆకిర్షతులవుతోందని అన్నారు.
కార్యకర్తలు రాజకీయ ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రసిడెంట్ బాగయ్య, మెదక్ జిల్లా యువత విభాగం అధ్యక్షుడు రాజేందర్, మండల శాఖ అ«ధ్యక్షుడు జీ.శంకర్, జోగిపేట పట్టణ అధ్యక్షుడు రాకేష్, సోషల్‌మీడియా ఇన్‌చార్జి పవన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీలు రమేశ్, పరిపూర్ణ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాండు, జిల్లా నాయకులు బుచ్చయ్య నవీన్, నరేష్, కార్తీక్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment