అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరులో భారీ జన సందోహం మధ్య సంఘీభావ పాదయాత్ర నిర్వహిస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సాక్షి నెట్‌వర్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ పేరిట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య సంఘీభావ యాత్రలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు, ర్యాలీలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను వివరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు.. అనంతపురం జిల్లాలోని రొద్దం మండలంలో రోడ్లు, భవనాల శాఖమంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ, వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటించారు.
చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలు పర్యటించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఎమ్మెల్యేలు పాదయాత్రలు కొనసాగించగా.. ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పాదయాత్ర జరిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్ర చేశారు. నెల్లూరులో జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్, మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రలు నిర్వహించారు.
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం రాంభొట్లపాలెం, బలుసుల పాలెంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాదయాత్ర చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది. కర్నూలు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సంఘీభావ యాత్రలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రాపురం తాళ్లపొలం నుంచి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కడియం మండలం జేగురుపాడులో ఎంపీ మార్గాని భరత్‌రామ్ పాదయాత్రలు నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం నందిగంపాలెంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, నిడదవోలు రావిమెట్ల, శంకరపురంలో ఎంపీ మార్గాని భరత్, లింగపాలెం మండలం భీమోలులో ఎంపీ కోటగిరి శ్రీధర్ పాదయాత్రల్లో పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటించారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment