చెక్కు చెదరని దృఢ సంకల్పం | YSRCP Leaders Celebrated For Praja Sankalpa Yatra Four Years Celebrations | Sakshi
Sakshi News home page

చెక్కు చెదరని దృఢ సంకల్పం

Published Sun, Nov 7 2021 3:21 AM | Last Updated on Sun, Nov 7 2021 11:50 AM

YSRCP Leaders Celebrated For Praja Sankalpa Yatra Four Years Celebrations - Sakshi

ఒంగోలులో వైఎస్సార్‌ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు అంటూ కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు, పార్టీ జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా.. లేదా.. అని ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు. జోహార్‌ వైఎస్సార్‌.. జై జగన్‌.. అంటూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు కదంతొక్కాయి.

2017 నవంబర్‌ 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసిన విషయం తెలిసిందే. పాదయాత్ర స్ఫూర్తితో 29 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే 97%› హామీలు నెరవేర్చారు. ఎన్నో విప్లవాత్మక చట్టాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగింది.
తిరుపతిలో ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి  

పండుగలా సాగిన సంబరాలు
► తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు. కుప్పంలో పార్టీ శ్రేణులు జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశాయి.  
► అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాదయాత్రలు చేపట్టారు. పెనుకొండలో మంత్రి శంకరనారాయణ కేక్‌ కట్‌ చేశారు. అనంతపురంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌ పాదయాత్ర నిర్వహించారు. 
► వైఎస్సార్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ విగ్రహాల వద్ద నివాళులర్పించి కేక్‌ కట్‌ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు.
► కర్నూలు జిల్లాలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. ఆలూరులో కార్మిక శాఖ మంత్రి జయరాం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ప్రకాశం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించారు. 
► నెల్లూరులో మంత్రి అనిల్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నాయకులు కేట్‌ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించారు.
► గుంటూరు నగరంలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. బాపట్లలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కేక్‌లు కట్‌ చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు పాదయాత్రలు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి, కేక్‌లు కట్‌ చేశారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  
► పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు పాదయాత్ర చేశారు. 
► తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్‌కట్‌ చేశారు. ఎంపీ మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో లాలాచెరువు సెంటర్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు.  శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు జరిగాయి. నరసన్నపేటలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని కేక్‌ కట్‌ చేశారు.  
► విజయనగరం జిల్లాలో సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. కురుపాంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర సాగింది. 
► విశాఖలో వాడవాడలా వైఎస్సార్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, బైక్‌ ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టారు. జగదాంబ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ భారీ జెండాతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గుడిలోవలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేక్‌ కట్‌ చేశారు. కొయ్యూరు మండలంలోని కంఠారంలో ఎంపీ గొడ్డేటి మాధవి వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. 
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్‌. చిత్రంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు 

కోవిడ్‌ సంక్షోభం నుంచి ప్రగతిపథంలోకి..
కోవిడ్‌ సంక్షోభంలో దేశం గర్వించేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అవినీతి మయంగా ఉండిందని, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి.. మొక్కవోని ధైర్యంతో అడుగులు ముందుకేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. వైఎస్‌ జగన్‌ నాడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అభివృద్ధి – సంక్షేమం అనే రెండు చక్రాల మీదుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. అనంతరం పాదయాత్రలో వైఎస్‌ జగన్‌తో పాటు అడుగులు వేసిన వారిని సన్మానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement