YSRCP Plenary 2022: తిరుగులేని శక్తి.. అలుపెరుగని పోరు సాగించిన వైఎస్‌ జగన్‌ | YSRCP Strengthened day by day with revolutionary schemes | Sakshi
Sakshi News home page

YSRCP Plenary 2022: తిరుగులేని శక్తి.. అలుపెరుగని పోరు సాగించిన వైఎస్‌ జగన్‌

Published Wed, Jul 6 2022 4:15 AM | Last Updated on Wed, Jul 6 2022 1:18 PM

YSRCP Strengthened day by day with revolutionary schemes - Sakshi

రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్‌ జగన్‌ను, వైఎస్సార్‌సీపీని అణగదొక్కడానికి చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు, సవాళ్లు, దాడులు ఎదుర్కొంది. అయినప్పటికీ వైఎస్‌ జగన్‌ ఒకే మాట.. ఒకే బాటగా ముందుకు సాగారు. ఏ దశలోనూ ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు. సవాళ్లే సోపానాలుగా మలుచుకుని.. ఇద్దరితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ ప్రస్తానాన్ని మూడో ప్లీనరీ నేపథ్యంలో ఓ సారి తరచి చూద్దాం.

సాక్షి, అమరావతి: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందారన్న విషాద వార్తను తాళలేక వందలాది మంది మరణించడం వైఎస్‌ జగన్‌ను, ఆయన కుటుంబీకులను తీవ్రంగా కలచివేసింది. ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన వైఎస్సార్‌ సంస్మరణ సభలో వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆ మేరకు 2010 ఏప్రిల్‌ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించారు.

ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం వైఎస్‌ జగన్‌ను ఆదేశించింది. రాజకీయాలకు ఈ యాత్రతో ఏమాత్రం సంబంధం లేదని, తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికే యాత్ర చేపట్టామని తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి వైఎస్‌ జగన్‌ వివరించినా లాభం లేకపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి.. వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్రను కొనసాగించారు.

ప్రజల నుంచి అపూర్వ ఆదరణ రావడంతో ఓర్వలేకపోయిన కాంగ్రెస్‌లోని కొన్ని శక్తులు, టీడీపీతో కుమ్మక్కై కుట్రలకు తెరతీశాయి. వైఎస్‌ జగన్‌ ఆస్తులపై విచారణ జరిపించాలని నాటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్‌రావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్‌ అధిష్టానం లేఖ రాయిస్తే.. కాంగ్రెస్‌ కనుసైగల మేరకు వైఎస్‌ జగన్‌ ఆస్తులపై దర్యాప్తు చేయించాలని నాటి ఎంపీ కె.ఎర్రన్నాయుడుతో టీడీపీ లేఖ రాయించింది.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్‌సభ, స్థానాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఓ వైపు ఓదార్పు యాత్రను కొనసాగిస్తూనే.. మరో వైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాట పట్టారు. అప్పటి నుంచి అధికారం చేజిక్కించుకునే వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఇలా ఉన్నాయి.

చరిత్రాత్మకంగా ప్రజా సంకల్ప యాత్ర
వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్‌ 6న ప్రజాసంకల్ప పాదయాత్రను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో.. మండుటెండలో.. కుంభవృష్టిలో 14 నెలలపాటు 3,648 కి.మీ.  దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. అన్నిచోట్లా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాలను కట్టబెట్టారు. 

అజేయశక్తిగా అవతరణ 
2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు.

అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు.

2022 ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. దీంతో వరుసగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది.  
నాగార్జున యూనివర్సిటీ సమీపంలో పూర్తికావస్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్లీనరీ ఏర్పాట్లు 

వైఎస్సార్‌సీపీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు 
02.09.2009 : మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్ట్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం
09.04.2010:  ఓదార్పు యాత్ర ప్రారంభం
27.11.2010 : తమ ఆదేశాలను ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టారనే అక్కసుతో వైఎస్‌ జగన్‌ ఆస్తులపై విచారణ జరపాలని లేఖలు రాసిన కాంగ్రెస్, టీడీపీ 
29.11.2010: ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ జగన్, వైఎస్‌ విజయమ్మ రాజీనామా
21.12.2010: రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలనే డిమాండ్‌తో విజయవాడ కృష్ణా నదీ తీరాన వైఎస్‌ జగన్‌ ‘లక్ష్య దీక్ష’  
11.03.2011: వైఎస్సార్‌సీపీ పేరు ప్రకటించిన వైఎస్‌ జగన్‌
12.03.2011: ఇడుపులపాయలో వైఎస్‌ సమాధి వద్ద వైఎస్సార్‌సీపీ పతాకం ఆవిష్కరణ, పార్టీ ఏర్పాటుపై ప్రకటన
13.05.2011: కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ జగన్‌ 5,45,672 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయభేరి.
08.07.2011:ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ తొలి ప్లీనరీ
10.08.2011: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ కె.ఎర్రన్నాయుడు చేసిన ఫిర్యాదులు ఆధారంగా వైఎస్‌ జగన్‌ ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు.
21.08.2011: వైఎస్సార్‌సీపీలో చేరుతూ కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు 19 మంది రాజీనామా. నెల్లూరు లోక్‌సభ స్థానానికి మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా.
27.05.2012: టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను పిలిచి, అరెస్టు చేసిన సీబీఐ
14.06.2012:  ఉప ఎన్నికల్లో 17 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం
21.12.2012: అక్రమ కేసులపై ‘జగన్‌ కోసం జనం’ పేరుతో కోటి సంతకాల సేకరణ
24.09.2013: అక్రమ కేసుల్లో బెయిల్‌పై విడుదలైన వైఎస్‌ జగన్‌
05.10.2013: రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. సమైక్య రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్‌ ఆమరణ దీక్ష 
18.12.2013: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం
16.5.2014: సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన.. 67 శాసనసభ స్థానాల్లో.. 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం
20.06.2014: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌కు గుర్తింపు
21.02.2015: అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టిన వైఎస్‌ జగన్‌
10.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో ధర్నా 
29.08.2015: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బంద్‌ 
26.01.2017:  విశాఖ ఆర్కే బీచ్‌లో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్‌ జగన్‌ను రన్‌ వేపైనే అరెస్టు చేసిన పోలీసులు
01.05.2017: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో గుంటూరులో వైఎస్‌ జగన్‌ రైతు దీక్ష 
08.07.2017:  నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న మైదానంలో వైఎస్సార్‌సీపీ రెండో ప్లీనరీ
26.10.2017: వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయకపోవడాన్ని, శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతుండటాన్ని నిరసిస్తూ శాసనసభ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసిన వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.
06.11.2017:ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం
25.10.2018: విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం
09.01.2019: శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం వద్ద ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు
23.05.2019: ఎన్నికల్లో ఘన విజయం
30.05.2019: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement