సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను ఓ ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చంద్రబాబు మద్దతు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. దేశమంతా అమర జవాన్లకు సంఘీభావం చెబుతుంటే.. నువ్వు మాత్రం ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు చెబుతావా అంటూ మండిపడ్డారు. దేశ వ్యవహారాలలో బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు.
రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో బాబు చర్యల వల్ల ఓ బీసీ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పోలీసుల చర్యల వల్ల కోటయ్య చనిపోయాడని కోటయ్య కుటుంబసభ్యులే చెబుతుంటే.. వైఎస్సార్ సీపీ కుల రాజకీయాలు చేస్తోందంటారా అంటూ మండిపడ్డారు. మీరు తప్పు చేస్తే భాద్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రశ్నించవద్దా?.. రైతును చంపండి, సైనికుడ్ని చంపండి ఇలా ఎవర్ని చంపినా ప్రశ్నించకుండా ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ రైతు చనిపోయినా, ఇక్కడ సైనికుడు చనిపోయినా మీరు డైరక్షన్ చేస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమాజం తలదించుకునేలా చింతమనేని మాట్లాడారని, అతని మాటలను కనీసం చంద్రబాబు ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థం కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయవద్దని చంద్రబాబును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment