పాలిటెక్నిక్ కళాశాలలోపుట్టెడు సమస్యలు | polytechnic college have been more problems | Sakshi

పాలిటెక్నిక్ కళాశాలలోపుట్టెడు సమస్యలు

Nov 24 2013 3:23 AM | Updated on Sep 17 2018 7:38 PM

స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కనీస వసతులు కరువయ్యాయి. సొంత భవనం లేకపోవడంతో డిగ్రీ కళాశాల భవనంలో తాత్కాలిక పద్ధతిన కొనసాగుతోంది.

జోగిపేట, న్యూస్‌లైన్:  స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కనీస వసతులు కరువయ్యాయి. సొంత భవనం లేకపోవడంతో డిగ్రీ కళాశాల భవనంలో తాత్కాలిక పద్ధతిన కొనసాగుతోంది. గదులు, అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. టాయిలెట్స్ లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ల్యాబ్‌లు లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇలా అనేక సమస్యలతో విద్యార్థులు విద్యాభ్యాసాన్ని సాగిస్తున్నారు.
 2011 సంవత్సరంలో జోగిపేటకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం ఆ కళాశాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మూడు గ్రూపులు కొనసాగుతున్నాయి.

ఎలక్ట్రానిక్, మెకానికల్, ఈసీఈలో మొత్తం 435 మంది విద్యార్థులున్నారు. కళాశాల ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సొంత భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని అందోల్ శివారులో గుర్తించినా నిధులు మంజూరు కాలేదు. పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం కరెంటు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. సాంకేతిక విద్యకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సమాచారాన్ని ప్రభుత్వం అందించే క్రమంలో కంప్యూటర్‌ను కూడా వినియోగించుకోలేని దుస్థితి.  అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సంబంధిత శాఖనే చూస్తున్నా నిధులు మంజూరు కాకపోవడం గమనార్హం. మూడు కోర్సులను నిర్వహించేందుకు తొమ్మి ది తరగతి గదులు అవసరం ఉన్నా ప్రస్తుతం ఏడు గదులే ఉన్నాయి. కొత్త భవనం అందుబాటులోకి రాగానే మరో మూడు గదులు కేటాయిస్తామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హమీ ఇచ్చినట్టు సమాచారం.
 ప్రాక్టికల్స్‌కు మాసాబ్‌ట్యాంకు,
 జహీరాబాద్ వెళ్లాల్సిందే..

 స్థానిక కళాశాలలో ల్యాబ్‌కు సంబంధించి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రాక్టికల్స్ కోసం వంద కిలో మీటర్ల దూరంలోని జహీరాబాద్‌కు విద్యార్థులను పంపుతున్నారు. 10 నుంచి 15 రోజులపాటు అక్కడే ఉండి ఏడాదికి సంబంధించిన ప్రాకిక్టల్స్‌ను పూర్తి చేసుకొని వస్తున్నారు. జహీరాబాద్‌లో ఈసీఈ కోర్సు లేకపోవడంతో ఆ కోర్సుకు సంబంధించిన విద్యార్థులు మాసాబ్‌ట్యాంక్‌కు వెళ్లాల్సి వస్తుంది.
 పోస్టులన్నీ ఖాళీనే...
 పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపు పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రిన్సిపాల్, లైబ్రరీయన్, పీడీ, సీనియర్ అసిస్టెంట్-2, జూనియర్ అసిస్టెంట్-2, ఎలక్ట్రికల్ ప్రధానశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సీనియర్ ప్రధానశాఖాధికారి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. కేవలం నలుగురు రెగ్యులర్, పదిమంది పార్ట్‌టైం లెక్చరర్లు మాత్రమే పనిచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement