
డబ్బుల్లేవ్
సాక్షి, కడప: కరెన్సీ నోట్ల కోసం రెండో రోజు జనాలు బారులు తీరారు. పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో మిగిలిన నోట్లను మార్చుకునేందుకు ప్రజలు నానా యాతన పడుతున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. కొంతమంది గంతల తరబడి క్యూలో నిలబడలేకపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరుతున్న నేపథ్యంలో బ్యాంకర్లు కూడా ఒకటే కౌంటర్ కాకుండా రెండు, మూడు కౌంటర్లు పెడితే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. నల్లధనం మాటేమోగానీ సామాన్యులు మాత్రం ఉన్న ఒకటి, రెండు పెద్ద నోట్లను మార్చుకునేందుకు నరకం చూస్తున్నారు. కడపతోపాటు పలుచోట్ల పోస్టాఫీసుల్లో నగదు లేకపోవడంతో గంటల తరబడి నిలబడి వేచి ఉన్నా వారికి ప్రయోజనం లేకుండా పోయింది. అందునా ఉదయం నుంచి వచ్చి గంటల తరబడి ఉంటూ ఒక్కోసారి అక్కడికే తినుబండారాలు తీసుకుని తింటూ కాలం గడిపారు. ప్రొద్దుటూరు, రాయచోటి, జమ్మలముగు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరులలో నోట్ల మార్పుకు భారీ క్యూలు దర్శనమిచ్చారు.
ప్రొద్దుటూరులో మధ్యాహ్నానికే ఖేల్ ఖతం..
ప్రొద్దుటూరు పట్టణంలో బ్యాంకు అధికారులు మధ్యాహ్నానికే చేతులు ఎత్తేశారు. ప్రధాన బ్యాంకుల్లో సైతం డబ్బులు అయిపోవడంతో నో మనీ బోర్డులు పెట్టారు. దీంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు
మైదుకూరులో డిపాజిట్లకే పరిమితమైన బ్యాంకర్లు
మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని బ్యాంకులు డిపాజిట్ చేయడానికే అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని బ్యాంకులు ఇదే తరహా పద్ధతిని అనుసరించడంతో నోట్ల మార్పునకు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక్క బి.మఠం మండలంలో గంట, రెండు గంటలు చొప్పున పంపిణీకి శ్రీకారం చుట్టిన తర్వాత కార్యక్రమాన్ని ముగించారు. మైదుకూరులోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్లు చేసకోవడంపైనే బ్యాంకర్లు శ్రద్ధ చూపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జమ్మలమడుగులో నోట్ల దొంగలు
జమ్మలమడుగులో నోట్ల మార్పిడికోసం వస్తున్న ప్రజలను దొంగలు టార్గెట్ చేశారు. బ్యాంకుల వద్ద జనంలో కలిసిపోయిన కొంతమంది దొంగలు క్యూలైన్లలో వేచి ఉన్నట్లు నటిస్తూ ముందున్న వారి జేబుల్లోని నగదు నొక్కేస్తున్నారు. ఒకరిద్దరు కాకుండా కొంతమందితో కూడిన దొంగల ముఠా ప్రవేశించిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
జమ్మలమడుగులో ఈ తరహా దోపిడీ చేస్తున్న సందర్భంలో క్యూలోనే అప్రమత్తమైన ప్రజలు ఒకరిని పట్టుకోగానే మిగిలిన వారు పారిపోయినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలియవచ్చింది. దొరికిన దొంగను పోలీసులకు అప్పగించిన నేపధ్యంలో పోలీసులు మరింత లోతుగా కూపీ లాగితే దొంగలకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.