ఇంట్లో వంట గ్యాస్ అయిపోయిందా.. మొబైల్ ఫోన్, టీవీ డీటీహెచ్ రీచార్జ్ చేయాలా..రైలు, విమాన టికెట్లు కావాలా..ఆస్తి పన్ను చెల్లించాలా.. బీమా పాలసీ ప్రీమియం చెల్లించాలా.. మీకు పాస్‌పోర్టు కావాలా.. అయితే జస్ట్ పోస్టాఫీసుకు వెళ్లండి చాలు. పట్టణానికో, మీసేవా కేంద్రానికో వెళ్లాల్సిన పనిలేదు. మారుమూల గ్రామం అయినా సరే.. తపాలా కార్యాలయానికి వెళితే ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి.
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాల బట్వాడా సేవలం దించిన పోస్టాఫీసులు ఇప్పుడు పౌరసేవా కేంద్రాలుగా మారిపోతున్నాయి. క్రమంగా ఉనికి కోల్పోతున్న పోస్టాఫీసులకు కొత్త ఉత్తేజం కల్పించే ఉద్దేశంతో పౌర సేవలందించే కేంద్రాలుగా వాటిని రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో నిత్యం ప్రజలకు అవసరమైన పలు సేవలను అందించేలా ఏర్పాటు చేసింది. ఈమేరకు తపాలా సిబ్బందికి శిక్షణను పూర్తి చేసి దశలవారీగా అన్ని పోస్టాఫీసుల్లో వాటిని అందుబాటులోకి తెచ్చింది. అన్ని పోస్టాఫీసుల్లో కామన్ సర్వీసెస్ సెంటర్ (సీఎస్‌సీ)లను ఏర్పాటు చేసింది.
కొన్ని ఉచితం.. కొన్నింటికి రుసుం
ఫోన్లు, డీటీహెచ్ రీచార్జ్, పన్నులు, బీమా ప్రీమి యం చెల్లింపు లాంటి సేవలకోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. ఇక పాన్‌కార్డు, పాస్‌పోర్టులాంటి సేవలకు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అవికూడా వినియోగదారులకు ఏమాత్రం భారం లేకుండా ఖరారు చేశారు. చిన్నచిన్న ఊళ్లలో ఉండేవారు ఆయా సేవలు పొందేందుకు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది ఖర్చు, ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఊర్లో ఉన్న పోస్టాఫీసుకు వెళ్తే ఆయా పనులు పూర్తవుతాయి. సమయం, దూరాభారం, వ్యయ ప్రయాసలు లేకుండానే సులభంగా పనులు అయ్యేలా వీటిని అందుబాటులోకి తెచ్చారు. గతేడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్, హన్మకొండ, జనగామ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి హెడ్ పోస్టాఫీసులలో ప్రారంభించారు. ఇవి విజయవంతం కావటంతో ఇప్పుడు హైదరాబాద్ మొదలు మారుమూల పల్లె వరకు ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో ప్రారంభించారు.
ఆదర్శంగా తక్కళ్లపల్లి
జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లి బ్రాంచి పోస్టాఫీసులో స్వల్ప సమయంలోనే ఈ కేటగిరీ కింద 127 మందికి సేవలందించినందుకుగాను పోస్ట్‌మాస్టర్ జ్ఞానేశ్వర్ జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచి పురస్కారం అందుకున్నారు. కేవలం మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో ఫోన్ రీచార్జ్ మొదలు పాస్‌పోర్టు వరకు పోస్టాఫీసు ద్వారా సేవలు అందించారు. గతంలో పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఆధార్ అనుసంధానం లాంటి పనులకు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు వారి ఊర్లలోనే పోస్టాఫీసుకు వెళ్తే సులభంగా పని అయిపోతోందని, ఇది గ్రామస్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని జ్ఞానేశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు.
ఇంట్లో కూర్చునే...
మా ప్రాంతం నుంచి దుబాయికి వెళ్లేవారు ఎక్కువ. పాస్‌పోర్టు కోసం కోరుట్ల గానీ లేదా ఇతర పట్టణాలకు గాని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు తపాలా శాఖ ప్రారంభించిన కొత్త సేవల వల్ల మేం మా ఊళ్లోనే పాస్‌పోర్టు తీసుకోగలుగుతున్నాం. ఇటీవల నేను, నా ముగ్గురు మిత్రులు మా ఊరి పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసి పాసుపోర్టు పొందాం. ఇంట్లో కూర్చునే పాసుపోర్టు తెప్పించుకున్నట్టనిపించింది. ఖర్చు, కష్టం, సమయం ఆదా అయ్యాయి.
– మహేందర్, తక్కళ్లపల్లి గ్రామం
Comments
Please login to add a commentAdd a comment