civil service department
-
Punjab: సివిల్ సర్వీస్ ఉద్యోగులకు అల్టీమేటం జారీ చేసిన సీఎం మాన్
పంజాబ్‌లో సివిల్ సర్వీస్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. అవినీతి ఆరోపణల కారణంగా లూథియానాలోని ప్రాంతీయ రవాణాశాఖ అధికారి నరీందర్ సింగ్ ధాలివాల్‌ను స్టేట్ విజిలెన్స్ బ్యూరో గత శుక్రవారం అరెస్ట్ చేసింది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చలాన్లు జారీ చేయకుండా వాహనాదారుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణంతో అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు. అయితే తమ సహోద్యోగిని అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ సివిల్ సర్వీస్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించారు. అయిదు రోజులపాటు సామూహికంగా సాధారణ సెలవులపై వెళ్లారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పనులు ఆగిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన సివిల్ సర్వీసెస్ అధికారులపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా నిరసనలను బ్లాక్‌మెయిల్‌గా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మె విరమించి బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తిరిగి విధుల్లో చేరాలని, లేకుంటే వారిని సస్పెండ్ చేస్తామని హుకూం జారీ చేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. ‘కొందరు అధికారులు సమ్మె ముసుగులో విధులకు హాజరుకావడం లేదని నా దృష్టికి వచ్చింది. అవినీతి అధికారులపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలకు వ్యతిరేకంగా వారు నిరసన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదని అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాంటి సమ్మె బ్లాక్‌మెయిలింగ్, పని చేయకుండా చేతులు దులుపుకోవడమే అవుతుంది. బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమూ దీనిని సహించదు. సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విధుల్లో చేరని అధికారులందరినీ సస్పెండ్ చేయండి’ అని భగవంత్ మన్ పేర్కొన్నారు. అయితే, సీఎం హెచ్చరికను కూడా ఉద్యోగులు పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. భగవంత్ మాన్ విధించిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరలేదు. దీంతో అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఉత్కంఠగా మారింది. -
పోస్టాఫీస్‌కు వెళ్తే పాస్‌పోర్ట్...
ఇంట్లో వంట గ్యాస్ అయిపోయిందా.. మొబైల్ ఫోన్, టీవీ డీటీహెచ్ రీచార్జ్ చేయాలా..రైలు, విమాన టికెట్లు కావాలా..ఆస్తి పన్ను చెల్లించాలా.. బీమా పాలసీ ప్రీమియం చెల్లించాలా.. మీకు పాస్‌పోర్టు కావాలా.. అయితే జస్ట్ పోస్టాఫీసుకు వెళ్లండి చాలు. పట్టణానికో, మీసేవా కేంద్రానికో వెళ్లాల్సిన పనిలేదు. మారుమూల గ్రామం అయినా సరే.. తపాలా కార్యాలయానికి వెళితే ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. సాక్షి, హైదరాబాద్: ఉత్తరాల బట్వాడా సేవలం దించిన పోస్టాఫీసులు ఇప్పుడు పౌరసేవా కేంద్రాలుగా మారిపోతున్నాయి. క్రమంగా ఉనికి కోల్పోతున్న పోస్టాఫీసులకు కొత్త ఉత్తేజం కల్పించే ఉద్దేశంతో పౌర సేవలందించే కేంద్రాలుగా వాటిని రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో నిత్యం ప్రజలకు అవసరమైన పలు సేవలను అందించేలా ఏర్పాటు చేసింది. ఈమేరకు తపాలా సిబ్బందికి శిక్షణను పూర్తి చేసి దశలవారీగా అన్ని పోస్టాఫీసుల్లో వాటిని అందుబాటులోకి తెచ్చింది. అన్ని పోస్టాఫీసుల్లో కామన్ సర్వీసెస్ సెంటర్ (సీఎస్సీ)లను ఏర్పాటు చేసింది. కొన్ని ఉచితం.. కొన్నింటికి రుసుం ఫోన్లు, డీటీహెచ్ రీచార్జ్, పన్నులు, బీమా ప్రీమి యం చెల్లింపు లాంటి సేవలకోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. ఇక పాన్‌కార్డు, పాస్‌పోర్టులాంటి సేవలకు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అవికూడా వినియోగదారులకు ఏమాత్రం భారం లేకుండా ఖరారు చేశారు. చిన్నచిన్న ఊళ్లలో ఉండేవారు ఆయా సేవలు పొందేందుకు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది ఖర్చు, ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఊర్లో ఉన్న పోస్టాఫీసుకు వెళ్తే ఆయా పనులు పూర్తవుతాయి. సమయం, దూరాభారం, వ్యయ ప్రయాసలు లేకుండానే సులభంగా పనులు అయ్యేలా వీటిని అందుబాటులోకి తెచ్చారు. గతేడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్, హన్మకొండ, జనగామ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి హెడ్ పోస్టాఫీసులలో ప్రారంభించారు. ఇవి విజయవంతం కావటంతో ఇప్పుడు హైదరాబాద్ మొదలు మారుమూల పల్లె వరకు ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో ప్రారంభించారు. ఆదర్శంగా తక్కళ్లపల్లి జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లి బ్రాంచి పోస్టాఫీసులో స్వల్ప సమయంలోనే ఈ కేటగిరీ కింద 127 మందికి సేవలందించినందుకుగాను పోస్ట్‌మాస్టర్ జ్ఞానేశ్వర్ జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచి పురస్కారం అందుకున్నారు. కేవలం మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో ఫోన్ రీచార్జ్ మొదలు పాస్‌పోర్టు వరకు పోస్టాఫీసు ద్వారా సేవలు అందించారు. గతంలో పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఆధార్ అనుసంధానం లాంటి పనులకు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు వారి ఊర్లలోనే పోస్టాఫీసుకు వెళ్తే సులభంగా పని అయిపోతోందని, ఇది గ్రామస్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని జ్ఞానేశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. ఇంట్లో కూర్చునే... మా ప్రాంతం నుంచి దుబాయికి వెళ్లేవారు ఎక్కువ. పాస్‌పోర్టు కోసం కోరుట్ల గానీ లేదా ఇతర పట్టణాలకు గాని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు తపాలా శాఖ ప్రారంభించిన కొత్త సేవల వల్ల మేం మా ఊళ్లోనే పాస్‌పోర్టు తీసుకోగలుగుతున్నాం. ఇటీవల నేను, నా ముగ్గురు మిత్రులు మా ఊరి పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసి పాసుపోర్టు పొందాం. ఇంట్లో కూర్చునే పాసుపోర్టు తెప్పించుకున్నట్టనిపించింది. ఖర్చు, కష్టం, సమయం ఆదా అయ్యాయి. – మహేందర్, తక్కళ్లపల్లి గ్రామం -
డాక్టర్, ఇంజనీర్ అయినా సంతృప్తి చెందని యువత
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాలపట్ల యువత ఆలోచనా సరళిలో మార్పు వస్తోంది. వచ్చిన జీతంలో కంటే నచ్చిన జీవితంలోనే సంతృప్తిని వెతుక్కుంటున్నారు. రూ.లక్షల సంపాదన కంటే లక్ష్యం ముఖ్యమంటున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ చదివామా.. క్యాంపస్ ప్లేస్మెంట్లలో జాబులు కొట్టామా.. ఒకటో తారీఖు జీతం తీసుకున్నామా.. అనే ధోరణి మారుతోంది. ఇంజనీర్, డాక్టర్ ఉద్యోగాలను సైతం పక్కనబెట్టి సివిల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌లో 57 మంది ఇంజనీర్లు, 11 మంది డాక్టర్లు ఉన్నారంటే యువత అభిరుచి ఏమిటో అర్థమవుతుంది. ఎవరెవరు ఏమేం చదివారు.. ఈసారి బ్యాచ్‌లో విద్యార్హతల పరంగా ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం 92 మంది ఐపీఎస్ అధికారుల విద్యానేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఆర్ట్స్ 7, సైన్స్ 5, కామర్స్ 02, ఇంజనీరింగ్ 57, మెడిసిన్ 11, ఎంబీఏ 7 ఇతరులు ముగ్గురు ఉన్నారు. 2017 ఐపీఎస్ బ్యాచ్.. ఇంజనీర్లు : 57మంది డాక్టర్లు : 11 మంది మైక్రోబయాలజీలో పీజీ చేశాను. నెట్, జీఆర్‌ఈలోనూ మంచి స్కోర్ చేశాను. పీహెచ్‌డీలో కూడా ప్రవే శం వచ్చింది. పలు వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశాలు వచ్చినా సివిల్స్ రాసి ఐపీఎస్‌కు సెలెక్టయ్యాను. – రిచా తోమర్ ఎంబీబీఎస్ తరువాత ఎంఎస్ ఆర్థో చదివాను. ప్రభుత్వాసుపత్రిలో చేరా. పేదలకు మరింత సాయం చేయడానికి డాక్టర్‌గా నా పరిధి సరిపోదు. అందుకే, సివిల్స్ రాశాను. – డాక్టర్ వినీత్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. ఏడాదిపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. మా తండ్రి స్ఫూర్తితో సివిల్స్ రాశా. ఆ ఉత్సాహంతోనే ట్రైనింగ్‌లో బెస్ట్ ఐపీఎస్ ప్రొబేషనర్‌గా నిలిచాను. ప్రజల సమస్యలు గమనించి ఆ మేరకు పనిచేస్తా. – గౌస్ ఆలం -
రేషన్ డిపోల వద్ద ప్రభుత్వ ప్రచారార్భాటం
సాక్షి, విశాఖపట్నం: ఏ చిన్న అవకాశం వచ్చినా, చిక్కినా వదలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవాలను సైతం తన ప్రచారానికి వాడేసుకుంటున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఏనాడు వినియోగదారుల హక్కుల రక్షణ ఊసెత్తని టీడీపీ ప్రభుత్వం.. మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల దినోత్సవం రోజున రేషన్ డిపోల్లో కార్డుదారులను సమీకరించి అవగాహన కల్పించాలని తలపోశారు. ఎగ్జిబిషన్లు, వర్క్‌షాపులు, ప్రసార మాద్యమాల ద్వారా వినియోగదారుల సంఘాలు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రచారం చేయాలని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డి.వరప్రసాద్ సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులతో షెడ్యూల్‌కు ఒక రోజు ముందు అమరావతిలో సమావేశం నిర్వహించారు కూడా. కొన్నేళ్లుగా చేతి చమురు వదిలించుకుని వినియోగదారుల హక్కుల రక్షణ కోసం పనిచేస్తున్న వినియోగదారుల సంఘాలను ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు.కొన్ని ఫోరాలకు శాశ్వత భవనాల్లేక అద్దె భవనాల్లోనే కోర్టులు నడుస్తున్నాయి. ఫోరాల అధ్యక్షులు, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు. 2014 నుంచి రాష్ట్ర వినియోగదారుల సమాచార కేంద్రం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఏటా నిర్వహించాల్సిన కార్యక్రమాలను తెలియజేసే ఇయర్ క్యాలెండర్ ఏనాడు రూపొందించిన పాపాన పోలేదు. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా తదితర పథకాలతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసుకునేందుకు గడచిన ఐదేళ్లలో తొలిసారి ఈ ఏడాది అవగాహనా సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 29,990 రేషన్ డిపోల ద్వారా కోటి 42 లక్షల 27వేల 455 కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకుల సరఫరా చేస్తోంది. ఆయా డిపోలన్నింటి వద్ద ఎన్నికల ప్రచారం కోసం ఒక్కో కార్డుదారునికి రూ.200 చొప్పున రూ.59.98లక్షలు మంజూరు చేసింది. పైగా ఈ నిధులను రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి మళ్లించింది. సంక్షేమ నిధిలో రూ.1.35 కోట్లు ఉన్నాయి. కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ విధంగా దొడ్డి దారిన ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం కోసం వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి మళ్లించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వ బాగోతంపై విశాఖకు చెందిన పలువురు డీలర్లు, సామాజిక కార్యకర్తలకు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. దొడ్డిదారిన చంద్రబాబు ప్రచారానికి ఎన్నికల కమిషన్ బ్రేకులు వేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు నిలుపుదల చేయాలని, అవగాహనా సదస్సుల పేరిట ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని నిలిపి వేయాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఐదేళ్లలో ఏనాడయినా పట్టించుకున్నారా?.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం గడచిన ఐదేళ్లలో ఏనాడు ప్రయత్నం చేయలేదు. పైసా ఖర్చు చేయలేదు. వినియోగదారుల ఫోరంలను పట్టించు కోలేదు. కానీ ఇప్పుడు దొడ్డిదారిన తమ పథకాలను ప్రచారం చేసుకునేందుకు సంక్షేమ నిధి నుంచి నిధులు దారిమళ్లించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయమనడం దారుణం. కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇలాంటివి సముచితం కాదు..ఫిర్యాదులు అందగానే ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడం అభినందనీయం. –కాండ్రేగుల వెంకటరమణ, సమాచార హక్కు ఉద్యమ కర్త -
తన్నుకున్న కాంట్రాక్టర్లు..
జగిత్యాల క్రైం: జగిత్యాలలో కాంట్రాక్టర్లు తన్నుకున్నారు. సిండికేట్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో ఎవరికి వారు టెండర్లు వేసేందుకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్‌మిల్లులకు తరలించేందుకు లారీ యజమానుల నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గడువు విధించడంతో కరీంనగర్, సిరిసిల్ల, జమ్మికుంట, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల తదితర ప్రాంతాలకు చెందిన 18 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు తీసుకున్నారు. అయితే, శనివారం ఉదయం 11 గంటల నుంచే కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యేందుకు మంతనాలు జరిపారు. మధ్యాహ్నం 1.30 వరకు చర్చలు జరిగినా.. అవి విఫలం కావడంతో ఎవరికి వారు టెండర్లు దాఖలు చేసేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో మెట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ బృందం టెండర్లు వేసేందుకు వెళ్తున్న కాంట్రాక్టర్లను అడ్డుకొని.. బయటకు నెట్టివేసింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంట్రాక్టర్లు తమ అనుచరులతో కార్యాలయంలోనికి చొరబడగా.. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ క్రమంలో కార్యాలయంలోని కంప్యూటర్లు, ఇతర సామగ్రి కిందపడి ధ్వంసమయ్యాయి. టెండర్ బాక్స్ సైతం కిందపడి దరఖాస్తులు చిందరవందరగా పడ్డాయి. భయంతో ఉద్యోగులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. 2 గంటల వరకు ఏడు టెండర్లు మాత్రమే దాఖలు కాగా, దాడుల భయంతో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయలేకపోయారు. పౌరసరఫరాల శాఖ డీఎం జితేంద్రప్రసాద్ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కృపాకర్ వచ్చి ఓ ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. -
మహిళా సంఘాలకు రేషన్ షాపులు!
► ఐకేపీ సభ్యుల వివరాల సేకరణ ►ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పౌరసరఫరాల శాఖ ► డీలర్ల సమ్మె ప్రకటన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు పౌరసరఫరాల చౌకధరల దుకాణాలను అప్పజెప్పేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ధాన్యం సేకరణలో విజయవంతమైన మహిళా సంఘాలకు రేషన్ షాపుల డీలర్‌షిప్‌లు అప్పగిస్తే మంచిందన్న భావనకు వచ్చిందని సమాచారం. ఇప్పటికే జిల్లాలు, మండలాల వారీగా ఐకేపీ గ్రూపు సభ్యుల వివరాలను సేకరించాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే రేషన్ డీలర్ షాపులను మహిళా సంఘాలకు అప్పగించే నిర్ణయానికి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆగస్టు 1 నుంచి కొందరు రేషన్ డీలర్లు సమ్మెకు దిగుతామని ప్రకటిం చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది. ఒకవైపు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాలతో చర్చలు జరుపుతూనే మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ప్రజలకు అందాల్సిన సరుకుల పంపిణీని అడ్డుకుంటే నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం డీలర్లకు నోటీసులు జారీ చేసి, తక్షణమే సస్పెండ్ చేసే అంశాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో రేషన్ షాపులకు దరఖాస్తు చేసుకున్న స్థానిక నిరుద్యోగ యువతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా చర్చ జరుగుతోందని తెలిసింది. ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలు విజయవంతమైన పాత్ర పోషించాయి. వారికున్న ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి డీలర్‌షిప్‌లు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల డీసీఎస్ఓలతో సమీక్ష జరిపారని తెలిసింది. అంతేకాదు డీడీలు కట్టకుండా రేషన్ సరుకులు పంపిణీ చేయని డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 30 వరకు డీడీలు కట్టని డీలర్లను సస్పెండ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏయే ప్రాంతంలో డీలర్లు సమ్మెకు వెళుతున్నారనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించారని సమాచారం. సమ్మెకు దూరంగా ఉండాలని కమిషనర్ చేసిన విజ్ఞప్తికి గ్రేటర్ హైదరాబాద్ యూనియన్లు సానుకూలంగా స్పందించాయి. నాయకోటి రాజు నేతృత్వంలోని యూనియన్ సమ్మెకు వెళ్లట్లేదని ప్రకటించింది. అయినా మరో మూడు సంఘాలు సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నాయి.