పంజాబ్‌లో సివిల్ సర్వీస్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. అవినీతి ఆరోపణల కారణంగా లూథియానాలోని ప్రాంతీయ రవాణాశాఖ అధికారి నరీందర్ సింగ్ ధాలివాల్‌ను స్టేట్ విజిలెన్స్ బ్యూరో గత శుక్రవారం అరెస్ట్ చేసింది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చలాన్లు జారీ చేయకుండా వాహనాదారుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణంతో అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు.
అయితే తమ సహోద్యోగిని అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ సివిల్ సర్వీస్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ విధులు బహిష‍్కరించారు. అయిదు రోజులపాటు సామూహికంగా సాధారణ సెలవులపై వెళ్లారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పనులు ఆగిపోయాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన సివిల్ సర్వీసెస్ అధికారులపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా నిరసనలను బ్లాక్‌మెయిల్‌గా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మె విరమించి బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తిరిగి విధుల్లో చేరాలని, లేకుంటే వారిని సస్పెండ్ చేస్తామని హుకూం జారీ చేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు.
‘కొందరు అధికారులు సమ్మె ముసుగులో విధులకు హాజరుకావడం లేదని నా దృష్టికి వచ్చింది. అవినీతి అధికారులపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలకు వ్యతిరేకంగా వారు నిరసన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదని అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాంటి సమ్మె బ్లాక్‌మెయిలింగ్, పని చేయకుండా చేతులు దులుపుకోవడమే అవుతుంది. బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమూ దీనిని సహించదు. సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విధుల్లో చేరని అధికారులందరినీ సస్పెండ్ చేయండి’ అని భగవంత్ మన్ పేర్కొన్నారు.
అయితే, సీఎం హెచ్చరికను కూడా ఉద్యోగులు పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. భగవంత్ మాన్ విధించిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరలేదు. దీంతో అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఉత్కంఠగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment