సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాలపట్ల యువత ఆలోచనా సరళిలో మార్పు వస్తోంది. వచ్చిన జీతంలో కంటే నచ్చిన జీవితంలోనే సంతృప్తిని వెతుక్కుంటున్నారు. రూ.లక్షల సంపాదన కంటే లక్ష్యం ముఖ్యమంటున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ చదివామా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో జాబులు కొట్టామా.. ఒకటో తారీఖు జీతం తీసుకున్నామా.. అనే ధోరణి మారుతోంది. ఇంజనీర్, డాక్టర్ ఉద్యోగాలను సైతం పక్కనబెట్టి సివిల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌లో 57 మంది ఇంజనీర్లు, 11 మంది డాక్టర్లు ఉన్నారంటే యువత అభిరుచి ఏమిటో అర్థమవుతుంది.
ఎవరెవరు ఏమేం చదివారు..
ఈసారి బ్యాచ్‌లో విద్యార్హతల పరంగా ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం 92 మంది ఐపీఎస్ అధికారుల విద్యానేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఆర్ట్స్ 7, సైన్స్ 5, కామర్స్ 02, ఇంజనీరింగ్ 57, మెడిసిన్ 11, ఎంబీఏ 7 ఇతరులు ముగ్గురు ఉన్నారు.
2017 ఐపీఎస్ బ్యాచ్..
ఇంజనీర్లు : 57మంది
డాక్టర్లు : 11 మంది
మైక్రోబయాలజీలో పీజీ చేశాను. నెట్, జీఆర్‌ఈలోనూ మంచి స్కోర్ చేశాను. పీహెచ్‌డీలో కూడా ప్రవే శం వచ్చింది. పలు వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశాలు వచ్చినా సివిల్స్ రాసి ఐపీఎస్‌కు సెలెక్టయ్యాను.
– రిచా తోమర్
ఎంబీబీఎస్ తరువాత ఎంఎస్ ఆర్థో చదివాను. ప్రభుత్వాసుపత్రిలో చేరా. పేదలకు మరింత సాయం చేయడానికి డాక్టర్‌గా నా పరిధి సరిపోదు. అందుకే, సివిల్స్ రాశాను.
– డాక్టర్ వినీత్
ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. ఏడాదిపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాను. మా తండ్రి స్ఫూర్తితో సివిల్స్ రాశా. ఆ ఉత్సాహంతోనే ట్రైనింగ్‌లో బెస్ట్ ఐపీఎస్ ప్రొబేషనర్‌గా నిలిచాను. ప్రజల సమస్యలు గమనించి ఆ మేరకు పనిచేస్తా.
– గౌస్ ఆలం
Comments
Please login to add a commentAdd a comment