మహిళా సంఘాలకు రేషన్ షాపులు!
► ఐకేపీ సభ్యుల వివరాల సేకరణ
►ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పౌరసరఫరాల శాఖ
► డీలర్ల సమ్మె ప్రకటన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు పౌరసరఫరాల చౌకధరల దుకాణాలను అప్పజెప్పేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ధాన్యం సేకరణలో విజయవంతమైన మహిళా సంఘాలకు రేషన్ షాపుల డీలర్‌షిప్‌లు అప్పగిస్తే మంచిందన్న భావనకు వచ్చిందని సమాచారం. ఇప్పటికే జిల్లాలు, మండలాల వారీగా ఐకేపీ గ్రూపు సభ్యుల వివరాలను సేకరించాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే రేషన్ డీలర్ షాపులను మహిళా సంఘాలకు అప్పగించే నిర్ణయానికి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆగస్టు 1 నుంచి కొందరు రేషన్ డీలర్లు సమ్మెకు దిగుతామని ప్రకటిం చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది. ఒకవైపు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాలతో చర్చలు జరుపుతూనే మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ప్రజలకు అందాల్సిన సరుకుల పంపిణీని అడ్డుకుంటే నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం డీలర్లకు నోటీసులు జారీ చేసి, తక్షణమే సస్పెండ్ చేసే అంశాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో రేషన్ షాపులకు దరఖాస్తు చేసుకున్న స్థానిక నిరుద్యోగ యువతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా చర్చ జరుగుతోందని తెలిసింది. ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలు విజయవంతమైన పాత్ర పోషించాయి. వారికున్న ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి డీలర్‌షిప్‌లు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల డీసీఎస్‌ఓలతో సమీక్ష జరిపారని తెలిసింది. అంతేకాదు డీడీలు కట్టకుండా రేషన్ సరుకులు పంపిణీ చేయని డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 30 వరకు డీడీలు కట్టని డీలర్లను సస్పెండ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏయే ప్రాంతంలో డీలర్లు సమ్మెకు వెళుతున్నారనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించారని సమాచారం. సమ్మెకు దూరంగా ఉండాలని కమిషనర్ చేసిన విజ్ఞప్తికి గ్రేటర్ హైదరాబాద్ యూనియన్లు సానుకూలంగా స్పందించాయి. నాయకోటి రాజు నేతృత్వంలోని యూనియన్ సమ్మెకు వెళ్లట్లేదని ప్రకటించింది. అయినా మరో మూడు సంఘాలు సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నాయి.