ఆందోళన.. అంతలోనే ఆనందం! | No Move to Disband Ration Dealers Network In AP | Sakshi
Sakshi News home page

ఆందోళన.. అంతలోనే ఆనందం!

Published Tue, Jul 23 2019 8:55 AM | Last Updated on Tue, Jul 23 2019 8:55 AM

No Move to Disband Ration Dealers Network In AP - Sakshi

ప్రకటనకు ముందు కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న రేషన్‌ డీలర్లు, మంత్రి ప్రకటనతో కలెక్టరేట్‌ వద్ద సంబరాలు

ప్రతిపక్ష టీడీపీ నేతలు, వారికి వత్తాలు పలుకుతున్న పత్రికలు వండి వార్చిన కథనాలతో అభద్రతా భావానికి లోనైన రేషన్‌ డిపో డీలర్లు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపడదామని బయలుదేరారు. ర్యాలీగా వెళ్లి స్పందన కార్యక్రమంలో తమ గోడు చెప్పుకుందామని భావించారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా డీలర్లు తరలివచ్చారు. అంతా కలెక్టరేట్‌కొచ్చేసరికి డీలర్లను తీసే ప్రతిపాదన లేదని మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆందోళన చేద్దామని వచ్చిన డీలర్లంతా మంత్రి ప్రకటన విని ఆనందంతో గంతులు వేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వారిని ఎగతోద్దామని భావించిన టీడీపీ నేతలకు అనుకున్నదొకటి...అయ్యిందొకటి అని పలువురు పెదవి విరిచారు.

సాక్షి, శ్రీకాకుళం: ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినా టీడీపీ నేతల తీరు మారలేదు. వారి ప్రజాకంటక పాలనతో విసిగివేసారిన ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదు. ఓటమి పొందామన్న అక్కసుతో లేనిపోని వార్తలను ప్రచారం చేస్తూ వివిధ వర్గాల ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రేషన్‌ డిపో డీలర్లను ఎగదోసే పనిలో పడ్డారు. అయితే రేషన్‌ డీలర్లను తొలగించే ప్రతిపాదన లేదని మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో స్పష్టం చేయడంతో టీడీపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయింది.

గత ఐదేళ్లలో టీడీపీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న డీలర్లపై అక్రమ కేసులు, అన్యాయంగా ఫిర్యాదులు చేసి తొలగించిన సందర్భాలున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి మరికొందరిపై వేటు వేసిన దాఖలాలు ఉన్నాయి. అలా ఖాళీ అయిన డీలర్ల పోస్టుల్లో టీడీపీ నేతలు పాగా వేశారు. గత ఐదేళ్లలో డీలర్లు అనేక వేధింపులకు గురయ్యారు. నెలవారీ ముడుపులు తీసుకున్నారు. తమ జేబులను నింపని వారిపై కక్షపూరితంగా వ్యవహరించారు. ఇవన్నీ డీలర్లకు తెలియనివి కావు. కాకపోతే అడ్డదారిలో డీలర్ల పోస్టులను దక్కించుకున్న వారి సాయంతో టీడీపీ నేతలు రెచ్చగొట్టే కార్యక్రమాన్ని తలపెట్టారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డీలర్లను తొలగిస్తుందని దుష్ప్రచారం చేయించే పనిలో పడ్డారు. తమ ద్వారా రేషన్‌ డీలర్లుగా నియమితులైన వారి ద్వారా విషప్రచారం చేయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు ఉసిగొల్పారు. అందులో భాగంగా సోమవారం డీలర్లంతా కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చారు. తమకు న్యాయం చేయాలని, తమను ఇబ్బంది పెట్టొద్దని మొర పెట్టుకునేందుకు వచ్చిన వారికి తీపి కబురు అందడంతో తెరవెనకున్న టీడీపీ నేతలను పట్టించుకోకుండా ఆనందంతో గంతులేసి, కలెక్టరేట్‌ బయట బాణసంచా కాల్చి తమ హర్షధ్వానాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఏం సాధించారని ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారని టీడీపీ ముసుగేసుకున్న కొందరు రెచ్చగొట్టినా అత్యధిక డీలర్లు వారి మాటను లెక్క చేయకుండా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

మంత్రి ప్రకటనతో ఆనందం
40 ఏళ్లుగా దీన్నే ఉపాధిగా భావించి బతుకుతున్నాం. కానీ మా డీలర్‌షిప్‌ తీసేస్తున్నారని కొందరు చెప్పడంతో ఆందోళనకు లోనై మా గోడు విన్పించుకుందామని కలెక్టరేట్‌కు వచ్చాం. ఇంతలోనే మంత్రి కొడాలి నాని ప్రకటన చేయడంతో మాకెంతో ఊరట కలిగింది. వైఎస్‌ కుటుంబానిది అన్నం పెట్టే మనసేగానీ కడుపు కొట్టే బుద్ధి కాదు 
–వి.కృష్ణదాస్, జిల్లా రేషన్‌ డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు

ఆందోళనకు లోనయ్యాం
గత కొన్ని రోజులుగా ఆందోళనకు లోనవుతున్నాం. డీలర్లను తొలగిస్తారన్న వార్తలతో మానసిక క్షోభకు గురవుతున్నాం. ఇంతవరకు ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే,  సోమవారం అసెంబ్లీలో  మంత్రి కొడాలి నాని స్పందిస్తూ డీలర్లను తీసే ప్రతిపాదన లేదని స్పష్టం చేయడంతో టెన్షన్‌ తీరింది.  
– బుగత వెంకటేశ్వరరావు, రేషన్‌ డిపో డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు

శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటుతో అభివృద్ధి
బీసీల అభ్యున్నతికి శాశ్వత కమిషన్‌ ఏర్పాటు నిజంగా సాహాసోపేతమైన చర్య. ఎప్పటి నుంచో వెనుకబడిన తరగతికి చెందిన కులాలు అణగారి ఉన్నాయి. వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో సామాజిక న్యాయం జరుగుతుంది. వెనుకబడిన తరగతుల్లో ఎన్నో కులాలకు చెందిన ప్రజలు పేదరికంతో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో వారికి న్యాయం జరుగుతుంది.
– జుత్తు పాపారావు, భేతాళపురం, మందస మండలం

బెడిసికొట్టిన టీడీపీ నేతల కుట్రలు
రేషన్‌ డిపో డీలర్లను టీడీపీ నేతలు భయాందోళనకు గురి చేస్తున్నారు. వారికి వంతపాడుతున్న పత్రికలు అందుకు తగ్గ రాతలు రాస్తున్నాయి. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీలర్లకు అన్యాయం చేయరని మంత్రి తాజా ప్రకటనతో స్పష్టమైంది.
– సముద్రపు రామారావు, రాష్ట్ర రేషన్‌ డిపో డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement