పోస్టాఫీసులు ఇక.. సేవామాల్స్ | Malls service financial services provider Post offices | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసులు ఇక.. సేవామాల్స్

Published Mon, Mar 16 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

Malls service financial services provider Post offices

అన్ని సేవలూ ఒకే గొడుగు కింద ఉంటే అందరికీ ప్రయోజనమే. అన్ని రకాల గృహవినియోగ వస్తువులను అందిస్తున్న సూపర్‌బజార్ల మాదిరిగానే భవిష్యత్తులో పోస్టాఫీసులు అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే సేవామాల్స్‌గా మారనున్నాయి. ప్రైవేట్ రంగం నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేలా పోస్టాఫీసులను విస్తృతపరిచేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రైవేట్ రంగం కంటే తక్కువ ఫీజలకే నమ్మకంగా సేవలు అందించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలో మూడు ప్రధాన పోస్టాఫీసులు, 65 సబ్ పోస్టాఫీసులు, 424 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ శాఖ సేవలపై రాష్ర్టప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతోంది. ప్రజలకు పలు సేవలను పోస్టాఫీసుల  ద్వారా అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఉత్తరాల బట్వాడాయే ప్రధాన బాధ్యతగా పని చేస్తున్న పోస్టాఫీసుల్లో ప్రస్తుతం లభిస్తున్న పరిమిత బ్యాంకు తరహా సేవలతోపాటు పింఛన్లు, వేతనాల పంపిణీ వంటి సేవలు కూడా ప్రారంభమయ్యాయి. వీటిని మరింత విస్తరించే దిశగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పోస్టల్ శాఖ కీలక సమావేశంలో ఉన్నతాధికారులు చర్చించారు. సంప్రదాయ విధులనే కొనసాగిస్తే ప్రజలకు దూరమై, ఇబ్బందులు తప్పవన్న భావనతో ఉన్న సిబ్బందితోనే ఇంకా ఎటువంటి సేవలు అవసరం, ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి అంశాల్లో ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.
 
 అందుబాటులోకి రానున్న సేవలు
 ప్రస్తుతం అందిస్తున్న సేవలకు అదనంగా పరిశీలన, కార్యాచరణ దశలో ఉన్న సేవల వివరాలు ఇలా ఉన్నాయి.
 ప్రైవేట్ కొరియర్ సంస్థల పోటీ తట్టుకునేందుకు స్పీడ్ కొరియర్ సేవలకు పోస్టాఫీసులు సిద్ధమవుతున్నాయి.
 భవిష్యత్తులో పాస్‌పోర్ట్ దరఖాస్తుల విక్రయం, స్వీకరణ బాధ్యత చేపట్టవచ్చు.
 సొంత ఫొటోలతో స్టాంపులు వేయించుకునే మై స్టాంప్ సౌకర్యాన్ని విస్తృతపరచనున్నారు.
 ప్రస్తుతం మీ-సేవ కేంద్రాలు అందిస్తున్న అన్ని రకాల సేవలను భవిష్యత్తులో పోస్టాఫీసుల్లోనే జరపాలనే ప్రతిపాదన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంది. కొన్ని మీ సేవ సెంటర్లలో ఆర్థిక లావాదేవీల విషయంలో అక్రమాలు జరుగుతుండడంతో అధికారులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు.
 వినియోగదారుడు పంపిన ఉత్తరం, పార్శిల్, కొరియర్ ఎక్కడ ఉందీ ఇట్టే తెలుసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. జీపీఎస్ ద్వారా వాటి ఉనికిని కనుగొని వినియోగదారుడికి అవసరమైన సమయాల్లో ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారం అందిస్తారు.
 పోస్టు బాక్సులో నిర్ణీత సమయాల్లో పోస్ట్‌మన్ ఉత్తరాలు తీస్తున్నాడో లేదో తెలుసుకునేందుకు వాటిని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. తద్వారా వినియోగదారుడికి మెరుగైన సేవలందించే అవకాశం ఉంది.
 గతంలో పోస్టాఫీసుల్లో బీఎస్‌ఎన్‌ఎల్ రీచార్జింగ్ కార్డులు విక్రయించేవారు. భవిష్యత్తులో అన్ని మొబైల్ నెట్‌వర్క్‌ల కార్డులూ విక్రయించే అవకాశం ఉంది.
 రిజిస్టర్డ్ పోస్టు సర్వీసుల్ని ప్రజలకు దగ్గరగా చేసేందుకు రుసుములను తగ్గించే అవకాశం ఉంది.
 ఆధార్, పాన్ కార్డ్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఓటు కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, సీ బుక్, రేషన్‌కార్డుల జారీ, తప్పుల సవరణలు తదితర సేవలు కూడా పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 ఇప్పటివరకు బ్యాంకుల్లో జరుగుతున్న స్వల్ప, దీర్ఘకాలిక, గృహ, వ్యక్తిగత, వాహన రుణాల మంజూరు ప్రక్రియను పోస్టాఫీసుల ద్వారా కూడా చేయిస్తారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ) లావాదేవీలను మరింత పెంచనున్నారు.
 
 పోస్టల్ సేవలపై నమ్మకం
 గతంలో పలు లావాదేవీలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసులనే ప్రజలు నమ్ముతున్నారు. పోస్టల్ సేవలను ప్రజలకు దగ్గర చేసేందుకు కేంద్రం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని సేవలు లభ్యమయ్యే అవకాశం ఉంది. సేవల పెంపునకు సంబంధించి ఇటీవల మా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు కూడా జరిగాయి.
 -జె.ప్రసాదబాబు,
 తపాలా శాఖ సూపరింటెండెంట్, శ్రీకాకుళం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement