అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువ వాటాను కైవసం చేసుకునేందుకు.. భారత్ తన అంతరిక్ష కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తోంది. అయితే దీనికి ప్రైవేట్ రంగాలు.. స్టార్టప్‌లు కీలక పాత్ర పోషించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. కేరళ స్టార్టప్ మిషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా భారత్ అవతరించినప్పటికీ.. గ్లోబల్ మార్కెట్లో ఇండియా వాటా కేవలం 2 శాతం (386 బిలియన్ డాలర్లు) వద్దనే ఉంది. దీనిని 2030నాటికి 500 బిలియన్ డాలర్లకు.. 2047 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమని సోమనాథ్ అన్నారు.
భారతదేశంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న స్పేస్ శాటిలైట్స్ కేవలం 15 మాత్రమే. ఈ సంఖ్య చాలా తక్కువ. దీనిని పెంచడానికి కృషి చేయాలి. అంతరిక్ష సాంకేతికతలో దేశం నైపుణ్యం.. పెరుగుతున్న ఉపగ్రహాల తయారీ కంపెనీల దృష్ట్యా.. భారతదేశం కనీసం 500 ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించే సామర్థ్యాన్ని కలిగి ఉందని సోమనాథ్ ఉద్ఘాటించారు.
ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రైవేట్ సంస్థలు.. కక్ష్యలో శాటిలైట్‌లను తయారు చేసి ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్‌లు కూడా వస్తాయి. 2014లో అంతరిక్ష సంబంధిత స్టార్టప్ కేవలం ఒక్కటి మాత్రమే ఉండేది. 2024కు ఈ సంఖ్య 250కి చేరింది. 2023లోనే స్పేస్ స్టార్టప్‌లు రూ.1,000 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించాయి. 450కి పైగా MSMEలు.. 50కి పైగా పెద్ద కంపెనీలు ఇప్పుడు అంతరిక్ష రంగానికి చురుకుగా సహకరిస్తున్నాయని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.
మన దేశంలో మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్, ఇండియన్ స్పేస్ స్టేటన్ వంటి భవిష్యత్ ప్రాజెక్టులు కూడా ఇస్రో.. ప్రైవేట్ రంగాల మధ్య సహకార ప్రయత్నాలే. అంతరిక్ష యాత్రల కోసం చేసిన పరిశోధనల నుంచి ప్రయోజనం పొందే వందలాది విభిన్న రంగాలను ఇస్రో గుర్తించింది. సాంకేతికత బదిలీ కోసం ఎంపిక చేసిన పరిశ్రమలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి.
ఇదీ చదవండి: బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి?.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే..
వివిధ ప్రాజెక్టుల అభివృద్ధిలో భాగంగా ఇస్రో సుమారు 61 దేశాలకు సహకరిస్తోంది. భారత్ ఇప్పటి వరకు 431 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని సోమనాథ్ తెలిపారు. ప్రస్తుత ఉమ్మడి మిషన్లలో NASAతో NISAR, CNES (ఫ్రాన్స్)తో TRISHNA, G20 శాటిలైట్, JAXA (జపాన్)తో లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ వంటివి ఉన్నాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment