ఉపాధి హామీ వేతనాలు, పింఛన్ల బట్వాడా బాధ్యత చేపట్టిన పోస్టాఫీసులు కొత్త సమస్య ఎదుర్కొంటున్నాయి. వీటిలో చాలా నిధులు సకాలంలో పంపిణీ కాకుండా నిలిచిపోతున్నాయి. ఆధార్ సమస్యలు, చిన్న చిన్న పొరపాట్లు, లోపాలు, ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు ఉండటం వంటి కారణాలతో చెల్లింపులు నిలిచిపోయి కోట్లాది రూపాయలు మూలుగుతున్నాయి. వీటిని సకాలంలో చెల్లించలేకపోతే తపాలా శాఖ ప్రభుత్వానికి డెమరేజి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కమీషన్ మాటేమో గానీ ఈ భారం ఎక్కువయ్యే ప్రమాదముందని పోస్టల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లా పరిధిలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.12 కోట్లు పోస్టాఫీసుల్లో మూలుగుతున్నాయి. వీటి చెల్లింపులు సత్వరమే పూర్తి చేయాలని పోస్టల్ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి మరికొంత గడువు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసేవారికి పోస్టాఫీసుల ద్వారా వేతనాలు చెల్లించాలని అక్టోబర్ 2, 2012న ఆదేశాలు జారీ అయ్యాయి. ఏజెన్సీలు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మోసాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మున్సిపాలిటీల పరిధిలోని ఫించన్లనూ పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయాలని ఇటీవలే ఆదేశించింది.
ఈ మేరకు జిల్లాలోని మూడు ప్రధాన పోస్టల్ కార్యాలయాలు, 65 సబ్ పోస్టాఫీసులు, 424 బ్రాంచ్ పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. వీటి కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.400 కోట్లను పోస్టాఫీసులకు అందజేస్తోంది. కూలి రేటు, పని దినాల ఆధారంగాా వేతనదారులకు ఎంత చెల్లించాలన్నది ఎంపీడీవోలు నిర్థారించి జిల్లా యంత్రాంగంతోపాటు స్థానిక పోస్టాఫీసులకు జాబితాలు పంపిస్తారు. వేతనదారులు తమ పాస్‌బుక్కులు, పే స్లిప్‌లు చూపిస్తే పోస్టాఫీసుల్లో వారికి వేతనాలు చెల్లిస్తారు. పోస్టాఫీసుల్లో జరిగే లావాదేవీలకు పూర్తి బాధ్యత ఉంటుండడంతోపాటు లబ్ధిదారులు తన సొమ్మును పోస్టల్ ఆర్‌డీ, ఎఫ్‌డీలకూ, ఎస్బీ ఖాతాల్లోనూ జమ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నష్ట భయం
ఉపాధి హామీ పనులకు సంబంధించి 2012 నుంచి వేతనాల రూపంలో సుమారు రూ.354 కోట్లు ప్రభుత్వం నుంచి పోస్టాఫీసులకు అందాయి. వాటిలో ఇప్పటివరకు సుమారు రూ. 342.31 కోట్ల చెల్లింపులే జరిగాయి. అదే విధంగా పింఛన్లకు సంబంధించి ఇప్పటివరకు సుమారు రూ.29 కోట్లు విడుదల కాగా.. సకాలంలో చెల్లింపులు జరగక రూ.3 కోట్లు వెనక్కు వెళ్లిపోయాయి. వాస్తవానికి ప్రభుత్వం నుంచి సొమ్ము విడుదలైన నాలుగు రోజుల్లోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అలా జరగకపోతే ప్రభుత్వానికి పోస్టల్ శాఖ డెమరేజీ(నష్ట పరిహారం) చెల్లించాల్సి ఉంటుంది. కాగా పోస్టాఫీసుల ద్వారా జరిగే ప్రతి చెల్లింపునకూ ప్రభుత్వం 2 శాతం కమీషన్ ఇస్తుంది. అందులో ఏపీ ఆన్‌లైన్ నిర్వహణకు కొంత మొత్తం పోతుంది. ఫించన్ల పంపిణీకి గాను పోస్టల్ శాఖకు ఒక శాతం కమీషన్ లభిస్తుంది. ఇందులో 25 శాతం ఏపీ ఆన్‌లైన్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
కారణాలేమిటంటే..
పోస్టాఫీసుల్లో సొమ్ము ఉన్నా వేతనదారులు, లబ్ధిదారులు తీసుకోలేకపోవడానికి పలు కారణాలను అధికారులు గుర్తించారు. ఆధార్ కార్డు లేకపోవడం, ఉన్న వాటిని తొలగించడం, ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులుండటం, బినామీలు తేలడం, కార్డు ఉన్నా తప్పులు కనిపించడం, సమయానికి స్వగ్రామాల్లో ఉండకపోవడం, స్వల్పకాలిక పనుల కోసం గ్రామాలు వదిలిపోవడం తదితర కారణాలు చెల్లింపులకు అవరోధంగా పరిణమిస్తున్నాయి. ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోపు చెల్లింపులు జరగాల్సి ఉన్నప్పటికీ ఈ నెల ప్రభుత్వం మరో రెండు రోజుల గడువిచ్చింది. నెలకు 2,69,260 మందికి చెల్లింపులు జరుగుతున్నాయి. ఫించన్ల పంపిణీలో 95శాతం పైగా చెల్లింపులు జరుగుతున్నాయి.
ఈ చెల్లింపులెలా..?
Published Sun, Mar 15 2015 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement