కొత్త పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూపులు
పెంచుతామన్న మొత్తం కాకపోయినా పాత పింఛనైనా మంజూరు చేయాలనే విజ్ఞప్తి
2022 ఆగస్టు నుంచి అందుబాటులో లేని ఆసరా పింఛన్ల ఆన్‌లైన్ పోర్టల్..
మాన్యువల్‌గా వివిధ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎంతో మంది
పింఛన్ల మొత్తం పెంచుతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కారు హామీ.. అది అమలు చేసేలోగా.. కొత్తవైనా ఇచ్చి ఆదుకోవాలనే వేడుకోళ్లు
పెద్ద వయసులో బతుకు వెళ్లదీసుకోవడానికి పింఛన్ ఆసరా అవుతుందంటున్న వృద్ధులు
సాక్షి, హైదరాబాద్ : భర్త చనిపోయి ఎలాంటి ఆధారం లేక తండ్లాడుతున్న వితంతువు.. పెద్ద వయసులో తోడెవరూ లేక, ఎలా బతకాలో తెలియక గోస పడుతున్న వృద్ధుడు.. వైకల్యంతో ఏ పనీ చేయలేక, వైద్యం కోసం డబ్బుల్లేక ఆగమైతున్న దివ్యాంగుడు.. .. ఇలా ఎందరో.. అందరిదీ ఒకే వేదన. ఎలాగోలా బతుకు వెళ్లదీసేందుకు కనీసం ప్రభుత్వమిచ్చే పింఛన్ అయినా తోడ్పడుతుందనే ఆలోచన. తిరగని ఆఫీసులు లేవు.. కలవని అధికారులు లేరు.. వేడుకోని రాజకీయ నాయకులు లేరు.. అయినా పింఛన్ రావడం లేదు. ఏళ్లకేళ్లుగా, ఎన్నోసార్లు దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నా ఫలితం ఉండటం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేసి, తమను ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలకు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఆత్మియ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్‌కార్డుల కోసం మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా... తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతూ దరఖాస్తులు ఇస్తున్నారు. పింఛన్ల సొమ్ము పెంచుతామన్న కాంగ్రెస్ సర్కారు హామీని అమల్లోకి తెచ్చేలోగా.. ముందు కొత్త పింఛన్లను మంజూరు చేసి పాత పింఛన్ మొత్తమైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
2022 ఆగస్టు నుంచి ఆన్‌లైన్ పోర్టల్ మూత..
కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునే ఆసరా పోర్టల్ 2022 ఆగస్టు నుంచి అందుబాటులో లేకుండా పోయింది. గత ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ సర్కారు అధికారంలో వచ్చిన 13 నెలలు కలిపి.. సుమారు మూడున్నరేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు, ఇతర రూపాల్లో వచ్చిన వినతులు కలిపి.. కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఆరు లక్షల వరకు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తు చేసుకున్న అందరికీ కాకపోయినా.. అర్హతలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోస్తే కనీసం 3 లక్షల మందికైనా కొత్త పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇందులో వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు ఇతర కేటగిరీల వాళ్లు కూడా గణనీయంగా ఉన్నట్టు చెబుతున్నాయి.
పాత మొత్తమైనా ఇవ్వాలంటూ..
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు (ప్రస్తుతం రూ.4 వేలు), వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర కేటగిరీల పింఛన్ రూ.4 వేలకు (ప్రస్తుతం రూ.2 వేలు) పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం అన్ని కేటగిరీలు కలిపి 43.72 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు దాటినా పింఛన్ల పెంపు హామీ అమల్లోకి రాలేదు. నిజానికి 2024–25 బడ్జెట్‌లో పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.14,628 కోట్లు కేటాయించింది. కానీ పెంపు అమలుచేస్తే ఖజనాపై గణనీయంగా భారం పడుతుందన్న ఉద్దేశంతో.. ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో పింఛను మొత్తాన్ని ఇప్పటికిప్పుడు పెంచకపోయినా.. కనీసం కొత్త పింఛన్లు మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర కేటగిరీల వారు కోరుతున్నారు.
ఇంటి పెద్ద లేడు.. వితంతు పింఛన్ ఇస్తే కాస్త ఆసరా
నా భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా స్పందన రావడం లేదు. ఇంటికి పెద్ద దిక్కయిన భర్త మృతితో బతుకు కష్టంగా మారింది. ఎలాంటి ఆధారం లేక కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటున్న. వెంటనే పింఛన్ మంజూరు చేయాలి. – కావలి సుష్మ , బొల్లారం గ్రామం, దేవరకద్ర మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
దివ్యాంగ పింఛన్ వస్తే.. వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది
మూడేళ్లకుపైగా దివ్యాంగుల పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు ఇచ్చినా, రాజకీయ నాయకులను వేడుకున్నా ఫలితం లేదు. గత ఏడాది ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్నాను. కాంగ్రెస్ సర్కారు పెంచే పింఛను కాకున్నా పాత పింఛన్ సొమ్ము రూ.4 వేలు ఇచ్చినా సరే.. నా వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది. – అబ్దుల్ మాజిద్ ఖాన్, తిమ్మాపూర్, కరీంనగర్
భర్త చనిపోయాడు.. పింఛన్ వస్తేనే జీవితానికి ఆసరా
నా భర్త చనిపోయి మూడేళ్లయింది. అప్పటి నుంచి ఎన్నోసార్లు వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. మొదట్లో పింఛన్లు ఇవ్వడం లేదని అధికారులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరికి ఇచ్చినా నాకు రాలేదు. గతేడాది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాను. ఇటీవల కులగణనలో కూడా ఆప్షన్ ఇచ్చిన. ఇప్పుడు గ్రామసభలో దరఖాస్తు చేశాను. త్వరగా పింఛన్ ఇస్తే జీవితానికి ఆసరా అవుతుంది. – కాసగాని సురాంబా, ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రం, సూర్యాపేట జిల్లా
వృద్ధాప్యంలో ఒంటరి బతుకు.. పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి
నాకు 70 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయింది. గుంట భూమి లేదు. ఎలాంటి జీవనాధారం లేదు. ఇద్దరు కొడుకులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. ఒంటరిగా ఉంటున్నా. వృద్ధాప్య పింఛన్ కోసం పదేళ్లలో ఎన్నో సార్లు దరఖాస్తు చేసినా రాలేదు. ఇప్పుడు గ్రామసభలో పింఛన్ కోసం దరఖాస్తు ఇచ్చాను. పింఛన్ వస్తే ఉన్నంతకాలం బతుకు వెళ్లదీసుకుంటా.. - తాటికోల్ సాయి గొండ, తగ్గేల్లి గ్రామం, సాలూర మండలం, నిజామాబాద్ జిల్లా
పింఛన్ వస్తే బతుకు వెళ్లదీసుకుంటా..
నాకు 75 ఏళ్లు. వృద్ధాప్య పింఛన్ కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న. గతంలో రూ.200 ఇచ్చేప్పటి నుంచీ నా భార్యతోపాటు నాకు కూడా పింఛన్ వచ్చేది. తర్వాత ఇంట్లో ఒక్కరికే పింఛన్ అని నా పేరు తీసేశారు. ఆరేళ్ల క్రితం భార్య చనిపోయింది. అప్పట్నుంచీ పింఛన్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసుకున్న. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్న. ఇప్పుడు గ్రామసభలో అధికారులకు మొరపెట్టుకున్న. పింఛన్లకు దరఖాస్తులు తీసుకోవడం లేదన్నరు. పింఛన్ వస్తే ఈ వయసులో బతుకు వెళ్లదీసుకోవడానికి ఆసరా అవుతుంది. – గంటే రాములు, నేరడగందొడ్డి గ్రామం, మాగనూరు మండలం, నారాయణపేట జిల్లా
Comments
Please login to add a commentAdd a comment