new pensions
-
పింఛన్లు:65,98,138
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మరో 1,93,680 మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంగళవారం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రతి నెలా అందజేసే పింఛన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 65,98,138కి చేరింది. కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే ఫింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుకు అదనంగా అవసరమయ్యే నిధులను కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, చాలా చోట్ల మంగళవారం సాయంత్రం నుంచే కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్ మంజూరైన 1,93,680 మంది లబ్ధిదారులలో 95,653 మంది అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లున్నాయి. 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4,763 మంది మత్య్సకారులు, 2,844 మంది కల్లుగీత కార్మికులు, 4 వేల మంది హెచ్ఐవీ బాధితులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 3,42,452 మందికి పింఛన్లు... ఎప్పటిమాదిరిగానే ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో 1,48,772 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటికే పింఛన్ల పొందుతున్న వారితో కలిపి సెప్టెంబరు ఒకటో తేదీన ప్రభుత్వం మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా మంగళవారం మంజూరు చేసిన 1,93,680 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ నెలలో రెండు విడతల్లో మొత్తం 3,42,452 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడం గమనార్హం. ఒక్క నెలలో పింఛన్లకు రూ.1,819.02 కోట్లు.. సెప్టెంబరు ఒకటో తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛను డబ్బుల పంపిణీకి రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ నెలలో రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేసేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగేళ్లలో 28.26 లక్షల కొత్త పింఛన్లు రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో నలుగురుకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాతే కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గణాంకాలతో వెల్లడిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం సెప్టెంబరు నెలలో ఏకంగా రూ.1,819 కోట్లు వెచ్చించడం గమనార్హం. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్లుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 3 లక్షల 98 మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించే విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. తర్వాత డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం అందిన దరఖాస్తులపై ఈ నెల 15–23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలన చేసి దాదాపు 3 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్ కార్డు, పాస్‌బుక్‌లను అందజేయనున్నట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్ ‘సాక్షి’కి వివరించారు. నవరత్న కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించబడి తదుపరి పరిశీలనలో అర్హులుగా గుర్తించిన వారికి జూలై 19న ప్రత్యేకంగా ఆయా పథకాల లబ్ధిని అర్హులకు అందజేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 24న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి కూడా అదే రోజున మంజూరు పత్రాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వివరించారు. ఇదిలా ఉండగా, జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వం ఇప్పటిదాకా దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు. చదవండి: (గుడివాడ టీడీపీలో తీవ్రస్థాయికి విభేదాలు.. మినీ మహానాడు సైతం రద్దు) -
AP: 1.33 లక్షల మందికి కొత్తగా పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1.33 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయనుంది. జనవరి ఒకటో తేదీ నుంచే కొత్త పింఛన్ల డబ్బులు చెల్లిస్తారు. ప్రస్తుతం పింఛను లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ ఇస్తున్న రూ. 2,250 మొత్తాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి రూ.2,500కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పింఛన్లలో కోత పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తుంటే.. వారికి చెంపపెట్టులా ప్రభుత్వం పింఛన్లు పెంచుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండున్నర సంవత్సరాల్లో 17,03,250 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. తాజాగా పింఛన్లు పొందుతున్న 1.33 లక్షల మందితో కలిపి వీరి సంఖ్య 18.36 లక్షలు అవుతుంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ల కనీస అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది. దీనికి తోడు గతంలో లబ్ధిదారులు వృద్ధాప్యంలో సైతం ప్రతి నెలా పింఛను డబ్బుల కోసం గ్రామ పంచాయతీ లేదా వార్డు కార్యాలయాల వద్దనో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్దో గంటల తరబడి వేచి చూడాల్సివచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఆనారోగ్యంతో ఉన్న వారు తదితరులు ఇంటి వద్ద లేదా వారు ఎక్కడ ఉంటే అక్కడే పింఛను డబ్బులు తీసుకుంటున్నారు. చదవండి: (ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా) కొత్త వారి మంజూరు పత్రాలు సిద్ధం జనవరి నుంచి కొత్తగా పింఛన్లు పొందుతున్న 1.33 లక్షల మంది మంజూరు పత్రాలను ఇప్పటికే జిల్లాల్లో సిబ్బంది అందజేశారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ చెప్పారు. ఒకటో తేదీ నాటికి ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉందని అన్నారు. తాజాగా మంజూరు చేసిన పింఛన్లతో కలిపి 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 18 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిందని వివరించారు. -
ఆధార్‌లో వయసు ఎన్నిసార్లు మార్చారు?
సాక్షి, అమరావతి: కొత్తగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుదారు ఆధార్ కార్డులో వయసుకు సంబంధించి జరిగిన మార్పులు, చేర్పుల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అర్హులందరికీ సంతృప్తస్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆధార్ కార్డులో తమ వయసును మార్చుకుని పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులందాయి. దీంతో అనర్హులు లబి్ధపొందకుండా చూసేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కొత్త నిబంధన ప్రకారం పింఛనుకు దరఖాస్తుచేసుకునేవారు తమ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ప్రింట్ అవుట్ కూడా సమర్పించాలి. ► మార్పులు, చేర్పులు జరిగి ఉంటే.. ఆధార్ కార్డులో తక్కువ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారు వయసు అర్హత నిబంధనల ప్రకారం ఉంటేనే ఆ దరఖాస్తును తదపరి దశ పరిశీలనకు పంపుతారు. లేనిపక్షంలో సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ స్థాయిలోనే తిరస్కరిస్తారు. ► దరఖాస్తుదారుకి ఆధార్ కార్డు మంజూరు సమయంలో వయసు తప్పుగా నమోదై, తిరస్కరణకు గురైతే అప్పీలు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కలి్పంచింది. అలాంటి దరఖాస్తుదారు వయసు ధ్రువీకరణ పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయంలో అప్పీలు చేసుకోవాలి. ► ఈ అప్పీళ్లను ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పరిశీలించి, అర్హులైతే పింఛను మంజూరుకు డీఆర్డీఏ పీడీలకు సిఫార్సు చేస్తారు. ఇప్పటికే మంజూరైన వాటిపై నవంబర్‌లో పరిశీలన ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 12.42 లక్షలమందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఆధార్‌లో వయసు వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకుని అర్హత లేకున్నా పింఛను పొందినవారిని గుర్తించేందుకు నవంబర్‌లో పరిశీలన చేపడుతున్నట్టు సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. తక్కువ వయసు ఉండి, ఆధార్‌లో మార్చుకుని పింఛను పొందారని నిర్ధారణ అయితే వారి పింఛను తొలగిస్తామని చెప్పారు. -
మీకొకటి.. మాకొకటి!
కర్నూలు(అగ్రికల్చర్):జిల్లాకు గత జూన్ నెలలో 11,080 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఆ నెలలో శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండటంతో బడ్జెట్ వచ్చినా పలు మండలాల్లో పంపిణీ నిలి చిపోయింది. జూలై నెలలో కొత్త పింఛన్లకు రెండు నెలల మొత్తం పంపిణీ చేయాల్సి ఉంది. పంచాయతీ సెక్రటరీల ద్వారా మాన్యువల్‌గా పంపిణీ చేయిస్తుండటంతో ఈ విడత కొందరికి కలిసొచ్చింది. జూలై నెల పింఛను మాత్రమే పంపిణీ చేసిన కార్యదర్శులు.. జూన్ నెలలో ఎన్నికల కోడ్ వల్ల ఆ మొత్తం రాలేదని బుకాయించారు. కొన్ని మండలాల్లో రెండు నెలల మొత్తం పంపిణీ చేసినా.. మరికొందరు ఒక నెల పింఛను నొక్కేశారు. చాలా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు కొత్త పింఛను బడ్జెట్ సర్పంచ్‌లకు అప్పగించినా పంపిణీ ఇష్టారాజ్యంగా సాగింది. మొత్తం రూ.2.21 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. కార్యదర్శులు, సర్పంచ్‌లు కలిసి దాదాపు రూ.కోటి స్వాహా చేశారు. ఒక నెల పింఛను అందుకోలేకపోయిన లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తే ఎక్కడ తొల గిస్తారోనని జంకుతున్నారు. దేవనకొండ మండలంలోని చాలా గ్రామాల్లో కొత్త పింఛన్లకు ఒక నెల మొత్తమే అందజేశారు. ఇక్కడ ఓ గ్రామంలో 12 మందికి పింఛన్లు మంజూరు కాగా ఒక నెల మొత్తంతోనే సరిపెట్టారు. అందులోనూ రూ.200 చొప్పున కోతపెట్టారు. హొళగుంద మండలంలోనూ ఇదే పరిస్థితి. పింఛన్లను కొంతకాలం పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేయడం.. ఆ తర్వాత ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి పంచాయతీ కార్యాలయాలకు మార్చడం గందరగోళానికి తావిస్తోంది. ఇదే సమయంలో మాన్యువల్‌గా పంపిణీ చేస్తుండటం కార్యదర్శులకు కలిసొచ్చినట్లయింది. తాజాగా ట్యాబ్‌ల సహాయంతో పంపిణీ తెరపైకి రావడంతో ఇదెలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది. -
అడ్రస్ ప్లీజ్..
దరఖాస్తుదారుల చిరునామా కోసం అధికారుల తిప్పలు 12 శాతం మాత్రమే పరిశీలన స్థానికుల సహకారంతో వివరాలు సేకరణ గడువులోగా కష్టమే 8 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ సాధ్యమా! సాక్షి, సిటీబ్యూరో: బా..బ్బాబూ.. కాస్త ఈ అడ్రస్ చెప్పండి.. డోర్ నంబర్ ఎక్కడ ఉంది.. ఇదీ నగరంలో సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన కోసం అధికారులు, ఉద్యోగులు పడుతున్న తిప్పలు. స్థానికుల సహకారం లేకుండా పరిశీలన కష్టతరంగా మారింది. వృద్ధాప్య, వితంతు పింఛన్ రూ.1,000.. వికలాంగులకు రూ.1,500 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నగరంలో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వీటిని పరిశీలనకు బస్తీల్లో తిరుగుతున్న అధికారులకు దరఖాస్తుదారుల అడ్రస్ తెలుసుకోవడం గగనంగా మారింది. పాత బస్తీలో అయితే పరిస్థితి దారుణంగా ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న చోటా నాయకులు, మాజీ కార్పొరేటర్ల సహకారంతో ముందుకుసాగుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 12 శాతం మాత్రమే పరిశీలించారు. ఈ నేపథ్యంలో నవంబరు ఎనిమిది నుంచి పింఛన్ల పంపిణీ అనుమానంగా మారింది. వీటికోసం నగరంలో దరఖాస్తులను ఈనెల 20వ తేదీ వరకు స్వీకరించారు. వెల్లువలా వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరణ చేసిన తర్వాత 24 నుంచి పరిశీలనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ జిల్లాలో 225 మంది ఉద్యోగులు పింఛన్ల దరఖాస్తులను, 350 మంది ఉద్యోగులు ఆహారభద్రత కార్డుల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని దరఖాస్తుల పరిశీలనలో 300పైగా ఉద్యోగులు భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారు. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావడంతో దరఖాస్తుల పరిశీలన నత్తనడన సాగుతున్నట్టు అధికావర్గాలు పేర్కొంటున్నాయి. సామాజిక పింఛన్లు 3.49 లక్షలు ఉండగా తాజాగా 4.96 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు 15.62 లక్షలు ఉండగా... తాజాగా ఆహారభద్రత కార్డు కోసం 21.88 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. రేషన్ సరుకుల కోసమే ఆహారభద్రత కార్డు పని చేస్తుందని పేర్కొన్నప్పటికీ అప్లికేషన్లు భారీగా వచ్చాయి. పరిశీలన 12 శాతమే... నవంబర్ 4వ తేదీ నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించడంతో ఉద్యోగులు కుస్తీ పడుతున్నారు. ఇప్పటివరకు పింఛన్ల దరఖాస్తుల పరిశీలన 12 శాతం మాత్రమే పూర్తయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధాప్య పింఛన్ల పరిశీలన 11.9 శాతం పూర్తి కాగా, వితంతువు పింఛన్ల పరిశీలన 10.8 శాతంగా నమోదైంది. వికలాంగుల పింఛన్ల పరిశీలన 11.7 శాతమైంది. ఆహార భద్రత కార్డుల దరఖాస్తులు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన నత్తనడకన సాగుతోంది. ఈ దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టినా కంప్యూటరీకణపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి ముందుగా పింఛన్ల దరఖాస్తుల పరిశీలనపైనే అధికారులు కేంద్రీకరిస్తున్నారు. ప్రభుత్వం అర్హుల ఎంపిక విషయంలో విధించిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల పరిశీలన జరపడంతో జాప్యం అవుతోందని తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో తేడా వస్తే బాధ్యులను చేసే అవకాశం కూడా ఉండడంతో కుటుంబ సర్వే, ఆధార్‌తోపాటు, నిబంధనలను జోడించి సమగ్రంగా విచారణ నిర్వహించాల్సి రావడం సమయం బాగా తీసుకుంటుందని పేర్కొంటున్నారు. 8 నుంచి పింఛన్ల పంపిణీ అసాధ్యం.. ప్రభుత్వం నిర్దేశించిన నవంబర్ 8 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యమేనన్న విషయం తాజా దరఖాస్తుల పరిశీలన బట్టి తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 50 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు పేర్కొంటుండగా... నగరంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. చిరునామాలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది. నిర్దేశించిన సమయానికి పంపిణీ అసాధ్యమని తెలుస్తోంది. -
కొత్తకార్డులకు నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ
నీలగిరి : కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లకు శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ టి.చిరంజీవులు చెప్పారు. కలెక్టరేట్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రద్దుచేసిన రేషన్‌కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులిస్తామని చెప్పారు. రేషన్‌కార్డులు, పింఛన్లకు గ్రామస్థాయిలో దరఖాస్తు చేసుకోవాలని, పథకాలకు ఎంపిక చేసిన వారి వివరాలను గ్రామ పంచాయతీల్లో నోటీస్‌బోర్డు మీద ప్రకటిస్తామన్నారు. ఈ అంశాలకు సం బంధించి ఎలాంటి సమస్య ఎదురైనా టోల్‌ఫ్రీ నంబర్ 18004251442కు ఫోన్ చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గానికో ఫ్ల్లయింగ్ స్క్వాడ్‌ను నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పేరిట కొత్త రేషన్‌కార్డులను కూడా నవంబర్‌లో ముద్రించి ఇస్తామన్నారు. పెంచిన కొత్త పింఛన్లు కూడా నవంబర్ 1వ తేదీ నుంచే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. ఫాస్ట్ పథకం ద్వారా లబ్ధి పొందాలని అనుకునే విద్యార్థులు మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించిన పిదప అర్హులైన వారికి నవంబర్ 1 నుంచి కొత్త సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. సమావేశంలో జేసీ ప్రీతిమీనా, అదనపు జేసీ వెంకట్రావ్, డీఎస్ఓ నాగేశ్వరరావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ఏఓ రాజు పాల్గొన్నారు. -
‘జన్మభూమి’పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
ఏలూరు : రాష్ట్రంలో కొత్తగా 5.23 లక్షల మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ కొత్తగా అందిన పింఛన్ దరఖాస్తుల్లో 5.23 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కలె క్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 23,367 మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నీరు- చెట్టు కార్యక్రమం కింద జిల్లాలో ప్రతి పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో జన్మభూమి సభలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 13 నియోజకవర్గాల్లో జన్మభూమి సభలు ఏలూరు (టూటౌన్) : జిల్లాలో సోమవారం 13 నియోజకవర్గాల్లో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం నిర్వహించి 82.78 లక్షల రూపాయలను 9వేల 231 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 52 గ్రామాలు, 6 పురపాలక సంఘాలు, 1 నగరపాలక సంస్థ పరిధిలలోని 17 వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. 69 వైద్య శిబిరాలు నిర్వహించి 5 వేల 35 మందికి వైద్యసేవలు అందించామని, 494 హెల్త్‌కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 51 పశు వైద్య శిబిరాలు నిర్వహించి, 4 వేల100 పశువులకు వైద్య సేవలు అందించామన్నారు. ప్రజల నుంచి 7 వేల 196 విజ్ఞప్తులను స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభలలో ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను ఆన్లైన్లో పొందుపరిచి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చినట్టు కలెక్టర్ చెప్పారు.