అడ్రస్ ప్లీజ్..
- దరఖాస్తుదారుల చిరునామా కోసం అధికారుల తిప్పలు
- 12 శాతం మాత్రమే పరిశీలన
- స్థానికుల సహకారంతో వివరాలు సేకరణ
- గడువులోగా కష్టమే
- 8 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ సాధ్యమా!
సాక్షి, సిటీబ్యూరో: బా..బ్బాబూ.. కాస్త ఈ అడ్రస్ చెప్పండి.. డోర్ నంబర్ ఎక్కడ ఉంది.. ఇదీ నగరంలో సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన కోసం అధికారులు, ఉద్యోగులు పడుతున్న తిప్పలు. స్థానికుల సహకారం లేకుండా పరిశీలన కష్టతరంగా మారింది. వృద్ధాప్య, వితంతు పింఛన్ రూ.1,000.. వికలాంగులకు రూ.1,500 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నగరంలో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వీటిని పరిశీలనకు బస్తీల్లో తిరుగుతున్న అధికారులకు దరఖాస్తుదారుల అడ్రస్ తెలుసుకోవడం గగనంగా మారింది. పాత బస్తీలో అయితే పరిస్థితి దారుణంగా ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా ఉన్న చోటా నాయకులు, మాజీ కార్పొరేటర్ల సహకారంతో ముందుకుసాగుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 12 శాతం మాత్రమే పరిశీలించారు. ఈ నేపథ్యంలో నవంబరు ఎనిమిది నుంచి పింఛన్ల పంపిణీ అనుమానంగా మారింది. వీటికోసం నగరంలో దరఖాస్తులను ఈనెల 20వ తేదీ వరకు స్వీకరించారు. వెల్లువలా వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరణ చేసిన తర్వాత 24 నుంచి పరిశీలనకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్ జిల్లాలో 225 మంది ఉద్యోగులు పింఛన్ల దరఖాస్తులను, 350 మంది ఉద్యోగులు ఆహారభద్రత కార్డుల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని దరఖాస్తుల పరిశీలనలో 300పైగా ఉద్యోగులు భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారు. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావడంతో దరఖాస్తుల పరిశీలన నత్తనడన సాగుతున్నట్టు అధికావర్గాలు పేర్కొంటున్నాయి.
సామాజిక పింఛన్లు 3.49 లక్షలు ఉండగా తాజాగా 4.96 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు 15.62 లక్షలు ఉండగా... తాజాగా ఆహారభద్రత కార్డు కోసం 21.88 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. రేషన్ సరుకుల కోసమే ఆహారభద్రత కార్డు పని చేస్తుందని పేర్కొన్నప్పటికీ అప్లికేషన్లు భారీగా వచ్చాయి.
పరిశీలన 12 శాతమే...
నవంబర్ 4వ తేదీ నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించడంతో ఉద్యోగులు కుస్తీ పడుతున్నారు. ఇప్పటివరకు పింఛన్ల దరఖాస్తుల పరిశీలన 12 శాతం మాత్రమే పూర్తయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధాప్య పింఛన్ల పరిశీలన 11.9 శాతం పూర్తి కాగా, వితంతువు పింఛన్ల పరిశీలన 10.8 శాతంగా నమోదైంది. వికలాంగుల పింఛన్ల పరిశీలన 11.7 శాతమైంది. ఆహార భద్రత కార్డుల దరఖాస్తులు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన నత్తనడకన సాగుతోంది.
ఈ దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టినా కంప్యూటరీకణపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి ముందుగా పింఛన్ల దరఖాస్తుల పరిశీలనపైనే అధికారులు కేంద్రీకరిస్తున్నారు. ప్రభుత్వం అర్హుల ఎంపిక విషయంలో విధించిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల పరిశీలన జరపడంతో జాప్యం అవుతోందని తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో తేడా వస్తే బాధ్యులను చేసే అవకాశం కూడా ఉండడంతో కుటుంబ సర్వే, ఆధార్‌తోపాటు, నిబంధనలను జోడించి సమగ్రంగా విచారణ నిర్వహించాల్సి రావడం సమయం బాగా తీసుకుంటుందని పేర్కొంటున్నారు.
8 నుంచి పింఛన్ల పంపిణీ అసాధ్యం..
ప్రభుత్వం నిర్దేశించిన నవంబర్ 8 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యమేనన్న విషయం తాజా దరఖాస్తుల పరిశీలన బట్టి తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 50 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు పేర్కొంటుండగా... నగరంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. చిరునామాలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది. నిర్దేశించిన సమయానికి పంపిణీ అసాధ్యమని తెలుస్తోంది.