సిటీలోని బహిరంగ ప్రదేశాల్లో పలువురి నివాసం
మద్యం, గంజాయి, వైట్‌నర్ మత్తులో జోగుతూ నేరాలు
తరచూ ఘర్షణలతో స్థానికులకు ఇబ్బందులు
గతంలో డేటాబేస్ రూపొందించిన పోలీసులు
ప్రస్తుతం పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: ఏ అడ్రస్ లేనివాళ్లకు నగరంలోని కొన్ని ప్రాంతాలు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. సిటీలోని బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం పొందుతున్న వీరు స్వచ్ఛంద సంస్థలు, ప్రార్థన స్థలాలు, జీహెచ్‌ఎంసీపై ఆధారపడి బతికేస్తున్నారు. అనునిత్యం నిషాలో జోగుతూ, ఘర్షణలకు దిగుతూ స్థానికంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు కొన్ని నేరాలు చేస్తున్నప్పటికీ తీవ్రమైతే తప్ప రికార్డుల్లోకి ఎక్కట్లేదు. గతంలో నగర పోలీసు విభాగం ఈ అభాగ్యుల డేటాబేస్ నిర్వహించింది. ప్రస్తుతం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవకపోవడంతో వీరికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనే..
ఈ అపరిచితుల సమస్య ప్రధానంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్, రైల్వేస్టేషన్, పాస్‌పోర్టు కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు నాంపల్లి, జేబీఎస్, సీబీఎస్ తదితర చోట్ల వీరు కనిపిస్తుంటారు. వీరిలో కొందరు మతిస్థిమితం సరిగా లేక ఇలా వస్తుండగా... మరికొందరు కుటుంబీకులతో సరిపడక, ఇబ్బందుల నేపథ్యంలో వచ్చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, పార్కులతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో జీవిస్తున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో ఇలాంటి అభాగ్యుల్లో అనేక మంది గంజాయి, వైట్‌నర్, మద్యంతో పాటు వివిధ రకాలైన మత్తు టాబ్లెట్లకు బానిసలుగా మారుతున్నారు. ఆ మత్తులో ఘర్షణలకు దిగడంతో పాటు స్థానికంగా అనేక సమస్యలు సృష్టిస్తున్నారు.
గతంలో డేటాబేస్ క్రియేట్ చేసిన పోలీసులు...
ఈ అభాగ్యులు, అనాథలు నేరాలకు పాల్పడుతుండటంతో నాంపల్లి పోలీసులు గతంలో డేటాబేస్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌తో పాటు పబ్లిక్‌గార్డెన్‌లో వీరి బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో మధ్య మండల అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం ద్వారా వీరి డేటాబేస్ రూపొందించారు. అందులో పేరు, ఫొటో, చిరునామాతో పాటు వేలిముద్రల్నీ సంగ్రహించి స్టోర్ చేశారు. దీనివల్ల భవిష్యత్తులో జరగరానిది జరిగితే ఈ డేటా ఉపయుక్తంగా మారుతుందని ఈ చర్యలు తీసుకున్నారు. అయితే కాలక్రమంలో పోలీసులు వీరి మాట పూర్తిగా మర్చిపోయారు. అయితే షెల్టర్ హోమ్స్‌కు లేదా స్వస్థలాలకు పంపాలని, లేదంటే కనీసం వీరిపై కన్నేసి ఉంచడంతో పాటు డేటాబేస్ రూపొందించాలని పలువురు కోరుతున్నారు. అలాకాకుంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేస్తున్నారు.
కడుపు నింపుతున్న స్వచ్ఛంద సంస్థలు..
ఇలా బహిరంగ ప్రదేశాల్లో జీవిస్తున్న వారిలో కొందరు చిన్న చిన్న పనులు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. వీరికి జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న రూ.5 క్యాంటీన్లు ఆకలి తీరుస్తున్నాయి. అత్యధికులు మాత్రం కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రార్థన స్థలాలు, నగర వాసులు అందిస్తున్న ఆహారం తిని బతికేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు స్థానికంగా ఉన్న దుకాణాలు, వాహనచోదకులు, పాదచారుల నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. ఏదైనా పెద్ద ఉదంతం చోటు చేసుకున్నప్పుడు మాత్రమే రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. అయితే ఈ నేరాలపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడం వీరికి కలిసి వస్తోంది. నగరంలో విదేశీ వీవీఐపీల పర్యటనలు ఉన్నప్పుడు మాత్రమే యంత్రాంగాలకు వీరితో పాటు బిచ్చగాళ్లు గుర్తుకు వస్తుంటారు. ఆ సమయంలో హడావుడిగా షెల్డర్ హోమ్స్‌కు తరలించే అధికారులు ఆపై వీరి విషయం మర్చిపోతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment